
సైబర్ వలయం
ఇప్పుడు ప్రపంచం వైఫైలో బందీ! ఆ వైఫైయే సెల్‌ఫోన్‌కు ఆహారం.. ఆ సెల్‌ఫోనే అందరికీ ప్రాణాధారం! రియల్ లైఫ్ కన్నా వర్చువల్ వరల్డ్‌లోనే శ్వాసిస్తున్నాం! పిల్లలకైతే చెప్పక్కరలేదు.. చదువు – సంధ్య, ఆట – పాట అంతా డిజిటల్ డివైజే! అందుకే ఆన్‌లైన్‌లో అవతలివైపు వాళ్లకు అవలీలగా దొరికిపోతున్నారు.. ఆటవస్తువులుగా మారుతున్నారు! ఈ ప్రమాదానికి సెలబ్రిటీల పిల్లలూ వల్నరబులే.. ప్రైవసీ కంచె వాళ్లను కాపాడలేకుంది! తాజా ఉదాహరణ.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూతురు నితారా కుమార్‌కు ఎదురైన అనుభవమే!
అక్షయ్ కుమార్ కూతురు నితారాకు పదమూడేళ్లు. అందరి పిల్లల్లాగే ఆ అమ్మాయికీ ఆన్‌లైన్ గేమ్స్ అంటే మహా ఇష్టం. అమ్మ ట్వింకిల్ ఖన్నా అనుమతితో రోజులో కొంచెంసేపు ఆన్‌లైన్ గేమ్స్‌తో ఎంటర్‌టైన్ అవుతూంటుంది. ఎప్పటిలాగే ఆ రోజూ గేమ్‌స్టార్ట్ చేసింది. అవతలి వైపు నుంచి ఓ అపరిచితుడు అమ్మాయికి గేమ్ పార్ట్‌నర్‌గా చేరాడు. గేమ్ ఆడుతూ నితారాతో సంభాషణ మొదలుపెట్టాడు. ‘చాలా స్మార్ట్‌గా ఆడుతున్నావ్.. వెరీ గుడ్’ అంటూ ప్రశంసించాడు. ‘థాంక్స్’ చెప్పింది నితారా.
ఇంకో రెండుమూడు క్యాజువల్ మాటల తర్వాత ‘నువ్వు అమ్మాయివా? అబ్బాయివా?’ అంటూ అడ్వాన్స్ అయ్యాడు. ‘అమ్మాయిని’ అంటూ బదులిచ్చింది నితారా. ‘ఒకసారి నీ ఫొటోగ్రాఫ్స్ పంపవా?’ అని అడిగాడు. ఏదో అపశ్రుతి పసిగట్టిన ఆ అమ్మాయి వెంటనే డివైజ్ షట్‌డౌన్ చేసి, విషయాన్ని తల్లికి చెప్పింది. ‘నా కూతురు చేసిన తెలివైన పని అదే. డివైజ్ క్లోజ్ చేసి ఆ ఆన్‌లైన్ అబ్యూజ్‌ను తల్లితో షేర్ చేసుకోవడం’ అంటాడు అక్షయ్ కుమార్. సైబర్ అవేర్‌నెస్ మంత్ క్యాంపెయిన్‌లో మాట్లాడుతూ తన కూతురు ఎదుర్కొన్న పరిస్థితిని వివరించాడు అక్షయ్ కుమార్.
పాఠ్యాంశంగా..
అక్షయ్, ట్వింకిల్ ఖన్నా ఇద్దరూ క్రమశిక్షణకు మారుపేరు. పిల్లలిద్దరినీ మీడియాకు దూరంగానే ఉంచుతారు. వాళ్ల ప్రైవసీకే ప్రాధాన్యం ఇస్తారు. అయినా నితారా ఆన్‌లైన్ అబ్యూజ్‌ను ఎదుర్కొంది. అంత కంటికి రెప్పలా కాచుకుంటేనే ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే.. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లల్లో పిల్లల సంగతి ఎలా ఉంటుందో! 24 గంటలు కాదుకదా.. కనీసం ఇంట్లో ఉన్నప్పుడు కూడా పర్యవేక్షించలేనంత బిజీగా ఉంటున్నారు పేరెంట్స్. అందుకే స్కూళ్లల్లో సైబర్ సేఫ్టీని పాఠ్యాంశంగా చేర్చాలంటున్నాడు అక్షయ్ కుమార్.
ఎందుకంటే పిల్లల స్క్రీన్ టైమ్ మీద నియంత్రణ లేకపోతే సైబర్ ట్రోలింగ్, బుల్లీయింగ్, అబ్యూజ్‌కి గురయ్యే ప్రమాదం ఎలాగూ ఉంటుంది. దానితోపాటు అది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం పై, వాళ్ల సోషల్ బిహేవియర్ మీదా దుష్ప్రభావం చూపిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి అక్షయ్ కుమార్ చెప్పినట్టు పిల్లలకు బడిలో పుస్తక పాఠాలతోపాటు సైబర్ బిహేవియర్ జాగ్రత్తలనూ నేర్పించాలని చైల్డ్ సైకాలజిస్ట్‌లూ సూచిస్తున్నారు. అంతేకాదు పెద్దలకూ ఆన్‌లైన్ అవేర్‌నెస్ మీద వర్క్‌షాప్స్‌ను నిర్వహించాలని.. సైబర్ క్రైమ్ పోలీసులే దీని మీద చొరవ చూపాలని కోరుతున్నారు.
వీళ్లు కూడా..
షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నుంచి కాజోల్, అజయ్ దేవ్‌గన్‌ల కూతురు నైసా దేవ్‌గన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల కూతురు ఆరాధ్యా బచ్చన్, అనూష్కా శర్మ, విరాట్ కొహ్లీల కూతురు పసికూన వమికా దాకా అందరూ ఆన్‌లైన్ ట్రోలింగ్, బుల్లీయింగ్‌కి గురైనవారే. సుహానా ఖాన్ ఒంటి రంగు, యాక్టింగ్ స్కిల్స్‌ను వెక్కిరిస్తూ ట్రోల్ చేశారు. నైసా దేవ్‌గన్ కూడా ఒంటిరంగు పట్ల ఆన్‌లైన్ హేళనకు గురైంది. ఆరాధ్యనయితే బాడీషేమింగ్ చేశారు. కెమెరా ముందు నిలబడటం రాదని ఎద్దేవా చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకుని ఐశ్వర్య సైబర్ పోలీసులకు ఫిర్యాదూ చేశారు.
ఆ మాటలు, వెక్కిరింతలు ఆరాధ్య మనసును గాయపరచి ఆమె మానసిక ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తాయని.. ఐశ్వర్య కూతురిని డిజిటల్ మాధ్యమానికి దూరంగా ఉంచారు. కనీసం ఫోన్ కూడా వాడదు ఆరాధ్య. ఈ విషయాన్ని ఒక సందర్భంలో స్వయంగా అభిషేక్ బచ్చనే ప్రస్తావించారు. భార్యకు బెస్ట్ మదర్‌గా కితాబూ ఇచ్చారు. నటులు దియా మిర్జా, సమీరా రెడ్డి కూడా పేరెంట్స్‌గా.. పిల్లల స్క్రీన్ టైమ్ మీద నియంత్రణ ఉండాలని, దాన్నెలా ఫాలో కావాలో, పేరెంటింగ్‌లో ఎలా భాగం చేయాలో పేరెంట్స్‌కి నిపుణులు వర్క్‌షాపులు నిర్వహించి అవగాహన పెంపొందించాలని కోరుతున్నారు.
కనీస అవసరాల నుంచి ఫ్లయిట్ టికెట్స్ దాకా, బడి పాఠాల నుంచి ప్రొఫెషనల్ మీటింగ్స్ దాకా అన్నిటికీ ఆన్‌లైనే మాధ్యమం. అలాంటి ఈ డిజిటల్ యుగంలో పిల్లల జోక్యాన్ని నివారించడం అసాధ్యమే. కానీ దాని మంచి చెడు, వ్యక్తిగత డేటాను ఎలా కాపాడుకోవాలి, ఆన్‌లైన్ భద్రత కోసం ఏం చేయాలి.. వంటి అంశాల మీద అవగాహన కల్పించడం మాత్రం సాధ్యమే! అత్యవసరం కూడా!