తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసిన దిగ్గజ నటుడు
ముంబైలో అంత్యక్రియలు.. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
300కుపైగా చిత్రాల్లో ధర్మేంద్ర నటన
2012లో పద్మభూషణ్‌తో సత్కరించిన కేంద్రం
‘గబ్బర్ సింగ్.. మై ఆ రహా హూ’... అని గర్జిస్తే థియేటర్ హోరెత్తి పోయింది షోలేలో..
‘ఖూన్ కా బద్‌లా ఖూన్’ అని కత్తి దూస్తే కలెక్షన్ల జోరు పెరిగింది ధర్‌మ్ వీర్‌లో..
‘బియుటి బట్’ అయితే ‘పియుటి పట్’ ఎందుకు కాదని అడిగితే నవ్వుల జల్లు కురిసింది చుప్కే చుప్కేలో..
యాదోంకి బారాత్‌లో తమ్ములను కాచుకున్న అన్న అతడే. బరి్నంగ్ ట్రైన్‌లో ప్రయాణికులను కాపాడిన వీరుడూ అతడే.
‘డ్రీమ్‌గర్ల్... ఏక్ షాయర్‌కి గజల్’ అని తెర మీద పాడి నిజ జీవితంలో హేమమాలినిని వివాహం చేసుకుందీ అతడే.
ధర్మేంద్ర నటన, 50 ఏళ్లుగా భారతీయప్రేక్షకుల జీవితంతో కలగలిసి పోయింది.
ఆయన మృతితో వారి మనసు ఖాళీ అయిన సినిమా హాలులా బోసిపోయింది.
సాక్షి, సినిమా డెస్క్: బాలీవుడ్ హీ మ్యాన్‌గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సీనియర్ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ ధర్మేంద్ర (89) ఇకలేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను గత నెల 31న కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొంది, డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం రాత్రి మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు మరోసారి ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
సోమవారం ముంబైలోని విల్లే పార్లీ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ధర్మేంద్ర భౌతికకాయం వద్ద నివాళులర్పించగా పలువురు సంతాపం తెలిపారు. ధర్మేంద్ర గత నెలలో ఆస్పత్రిపాలైనప్పుడు ఆయన మరణించారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ వార్తలను ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ అప్పట్లో ఖండించింది. అయితే అలా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ధర్మేంద్ర తుదిశ్వాస విడవడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
స్కూలు రోజుల్లోనే నాటకాలు..
ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని ఫాగ్వారాలో జన్మించారు. చదువులో ప్రతిభావంతుడు కానప్పటికీ చిన్నప్పటి నుంచి ధర్మేంద్ర ఎంతో క్రమశిక్షణ కలిగి ఉండేవారు. స్కూలు రోజుల్లోనే ఆయన నాటకాలు వేసేవారు. దీంతో ఆయనకు సినిమాలపై మక్కువ పెరిగింది. అప్పట్లో ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ధర్మేంద్ర విజేతగా నిలిచి ముంబైలో అడుగుపెట్టారు. తన 19వ ఏట సినిమాల్లోకి రాక ముందే 1954లో ప్రకాశ్ కౌర్‌ని మొదటి వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. వారిలో కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు విజిత, అజీత ఉన్నారు.
నట ప్రస్థానం
అర్జున్ హింగోరాని దర్శకత్వం వహించిన ‘దిల్ బీ తేరా హమ్ బీ తేరే’(1960) సినిమాతో ధర్మేంద్ర బాలీవుడ్‌లో నటుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రానికిగాను ఆయన తీసుకున్న తొలి పారితోషికం రూ.51. ఆ తర్వాత ‘బాయ్ ఫ్రెండ్, బందినీ, అనుపమ, ఆయా సావన్ జూమ్ కే’వంటి సినిమాలతో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘షోలే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్’వంటి చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నారు. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగానూ ఆయన రాణించారు. ‘ఆయే మిలన్ కీ బేలా’వంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా పోషించారు. 1966లో వచ్చిన ‘ఫూల్ ఔర్ పత్తర్’సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.
1971లో విడుదలైన ‘మేరా గావ్ మేరా దేశ్’తో యాక్షన్ హీరోగా స్థిరపడ్డ ధర్మేంద్రకు.. ‘ప్యార్ హి ప్యార్, ఆయా సావన్ ఝూమ్ కే, మేరే హమ్‌దమ్ మేరే దోస్త్’వంటి చిత్రాలు రొమాంటిక్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. ‘రాజా జానీ’(1972), ‘జుగ్ను’(1973) వంటి చిత్రాలు ఆయన్ను యాక్షన్ హీరోగా మరింత నిలబెట్టాయి. ‘షోలే’(1975) చిత్రానికి రూ. 1.5 లక్షల పారితోషికం తీసుకున్నారు. ఆ సినిమా నటీనటుల్లో అత్యధిక పారితోషికం అందుకున్నది ఆయనే కావడం విశేషం. అలాగే అందాల తార హేమమాలినితో కలిసి నటించిన ‘తుమ్ హసీన్ మై జవాన్, షరాఫత్, సీతా ఔర్ గీతా, రాజా జానీ, జుగ్ను, ప్రతిజ్ఞ, షోలే, చరస్, ఆజాద్, దిల్లగి’వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. వెండితెరపై హిట్ పెయిర్‌గా నిలిచిన ధర్మేంద్ర–హేమమాలిని 1980లో వివాహం చేసుకొని రియల్ లైఫ్ జోడీగా మారారు. వారికి ఇషా డియోల్, అహనా డియోల్ సంతానం.
ఎన్నో రికార్డులు...
ఆరు దశాబ్దాలకుపైగా సినీ కెరీర్‌లో ధర్మేంద్ర 300కుపైగా సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌లో అత్యధిక హిట్ చిత్రాల్లో నటించిన రికార్డు ఆయన సొంతం. 1973లో ఎనిమిది, 1987లో వరుసగా ఏడు హిట్స్‌తోపాటు అదే ఏడాది తొమ్మిది విజయవంతమైన చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ చరిత్రలో ఇప్పటికీ ఇది ఒక రికార్డుగా ఉంది. కండలు తిరిగిన శరీర సౌష్టవంతో సినిమాల్లో కనిపించిన ధర్మేంద్ర.. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచారు. శరీర సౌష్టవానికి తోడు యాక్షన్ చిత్రాల్లో పోషించిన పాత్రలు ఆయనకు ‘హీ మ్యాన్’ట్యాగ్‌ని తెచ్చిపెట్టాయి.
పోరాట సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించి యాక్షన్ కింగ్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు. 1983లో విజేత ఫిలింస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి బేతాబ్, ఘాయల్, బర్సాత్ తదితర చిత్రాలను నిరి్మంచారు. ముఖ్యంగా తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్‌తో తీసిన ‘ఘాయల్’సూపర్‌హిట్‌గా నిలిచింది. తన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్‌లతో కలిసి ‘అప్నే, యమ్లా పగ్లా దీవానా’వంటి సినిమాల్లో నటించారు. 2011లో ప్రముఖ రియాలిటీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’మూడవ సిరీస్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
2023లో ధర్మేంద్ర తొలిసారి ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’అనే టీవీ సీరియల్‌లో నటించారు. ధర్మేంద్ర నటించిన ఆఖరి చిత్రం ‘ఇక్కీస్’(2025). శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ధర్మేంద్ర రాజకీయాల్లోనూ కొంతకాలం పనిచేశారు. 2004లో రాజస్తాన్‌లోని బికనీర్ లోక్‌సభ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2009లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
అవార్డులు...
కళామతల్లికి చేసిన సేవలకుగాను 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయన్ను వరించింది. 1991లో వచ్చిన ‘ఘాయల్’సినిమాకుగాను ఆయన నిర్మాతగా జాతీయ అవార్డు అందుకున్నారు. 2016లో వరల్డ్ యూనివర్సిటీ ఫోరమ్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 1970లో ప్రపంచంలోని అందగాళ్లలో ఒకడిగా ధర్మేంద్ర నిలిచారు. పలు ప్రముఖ సంస్థలు ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతో సత్కరించాయి.


