ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే ఇప్పటికే వేలాది సినిమాలు వచ్చాయి. ఎందరో నటీనటులు కొత్తగా వస్తున్నారు. పాత నటీనటులు కనుమరుగైపోతూనే ఉన్నారు. మనం సరిగా గమనించం గానీ కొన్నిసార్లు చిత్రమైనవి జరుగుతూనే ఉంటాయి. ఒకే నటుడు వరసగా ఒకే తరహా పాత్రల్లో కనిపిస్తూ ఉంటారు. తెలుగులోనూ ఇలాంటి వాళ్లని చూసే ఉంటారు. అయితే ఇలా ఒకే పాత్రలో ఓ వ్యక్తి ఏకంగా 144 సినిమాలు చేసి గిన్నీస్ రికార్డ్ సాధించాడని మీకు తెలుసా? ఇంతకీ ఆ నటుడెవరు? ఏంటా రికార్డ్?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన)
ఒక యాక్టర్ నాలుగైదు సినిమాల్లో ఒకే లాంటి పాత్ర చేస్తే 'మూస' నటుడు అని ట్యాగ్ వేసేస్తారు. ఇలాంటివి పడేందుకు సాధారణంగా నటీనటులు పెద్దగా ఇష్టపడరు. కాస్త పేరున్న వాళ్లయితే వైవిధ్యమైన పాత్రలు చేయాలని అనుకుంటారు. కానీ అప్పట్లో హిందీ చిత్రసీమలో జగదీశ్ రాజ్ అనే నటుడు ఉండేవాడు. ఈయన్ని అందరూ బాలీవుడ్ 'ఇన్‌స్పెక్టర్ సాబ్' అని పిలిచేవారు. ఎందుకంటే 144 సినిమాల్లో పోలీస్ పాత్రల్లోనే కనిపించాడు. ఇది గిన్నీస్ రికార్డ్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ నమోదైంది.
1928లో బ్రిటీష్ ఇండియాలోని పాకిస్థాన్‌లో సర్గోదా అనే ఊరిలో జగదీష్ పుట్టారు. పుట్టిన పదకొండేళ్లకే అంటే 1939లోనే బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1955 నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారారు. అప్పటినుంచి 2004 వరకు వరసగా దాదాపు 260 చిత్రాలు చేశారు. 1956లో వచ్చిన 'సీఐడీ'లో తొలిసారి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించారు. తర్వాత దీవార్, డాన్, శక్తి, మజ్దూర్, ఇమాన్ ధరమ్, జాసూస్, సిల్సిలా, ఐనా, బేషరమ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఈయన పోలీస్‌గానే కనిపించారు. చివరగా 'మేరీ బీవీ కా జవాబ్ నహిన్' అనే సినిమా చేశారు. ఈ మూవీలోనూ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నటించారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?)
260కి పైగా సినిమాలు చేసిన జగదీష్ రాజ్.. పోలీస్ పాత్రలతో పాటు విలన్, న్యాయమూర్తి లాంటి ఇతర పాత్రల్లోనూ కనిపించారు. కానీ ఈయన సినీ పోలీస్‌గానే అందరికీ గుర్తుండిపోయారు. శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతూ 2013 జూలై 29న ముంబైలోని జుహు నివాసంలో జగదీశ్ తుదిశ్వాస విడిచారు. జగదీష్ కూతురు అనితా రాజ్ కూడా నటిగా సుపరిచతమే. 1981లో 'ప్రేమ్ గీత్' నటిగా కెరీర్ ప్రారంభించింది. 80, 90లలో చాలా హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు మూవీస్ చేస్తోంది.
ఏదేమైనా ఒకేలాంటి పాత్రని 144 సినిమాల్లో చేయడం అంటే మాములు విషయం కాదు. ఇప్పటి నటులకైతే ఇలా చేయడం పక్కనబెడితే అసలు ఇది సాధ్యమేనా?
(ఇదీ చదవండి: కుక్క కాటు పెద్ద మేటర్ కాదు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు)


