హీరో రామ్ పోతినేని(Ram Pothineni ), నటి భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారనే వార్త గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఆంధ్రకింగ్ తాలూకా’ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని..అది కాస్త స్నేహబంధం దాటి ప్రేమగా మారిందనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా ఈ పుకార్లపై హీరో రామ్ పోతినేని స్పందించారు. ఆంధ్రాకింగ్ తాలుకా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ.. భాగ్యశ్రీతో డేటింగ్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని స్పష్టం చేశారు.
‘ఆంధ్రకింగ్ తాలుకా’(Andhra King Taluka) సినిమా కోసం నేను ఒక ప్రేమ గీతం రాశాను. అప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. భాగ్యశ్రీ(Bhagyashri Borse)పై మనసులో ప్రేమ లేనిదే ఇంత గొప్ప పాట ఎలా రాయగలడు? అని అంతా అనుకున్నారు. వాస్తవం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌ని ఎంపిక చేయకముందే నేను ఆ పాట రాశాను. సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలను ఊహించుకొని ఆ లిరిక్స్ రాస్తే..అంతా మరోలా అనుకున్నారు’ అని రామ్ చెప్పుకొచ్చారు.
ఇక ఇదే విషయంపై మరో ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ కూడా స్పందించారు. రామ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే నని.. ఒక నటుడిగా ఆయన అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పింది. ఆయన డెడికేషన్ చూసి ఎంతో నేర్చుకున్నానని..అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఆంధ్రకింగ్ తాలుకా సినిమా విషయానికొస్తే..పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌కి జోడీగా భాగ్యశ్రీ నటించింది. ఇందులో రామ్ ఒక స్టార్ హీరోకి అభిమానిగా నటించబోతున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ఈ మూవీ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


