ఆస్కార్ అవార్డ్ అనేది ప్రతి ఇండస్ట్రీ కల. భారతీయ సినిమాలకు, మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్రాలకు చాన్నాళ్ల పాటు ఇది అందని ద్రాక్షలానే మిగిలింది. కానీ 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటకు పురస్కారం దక్కడంతో యావత్ భారతదేశం సంతోషంతో ఉప్పొంగింది. ఇప్పుడు మరో హిట్ మూవీ.. ఆస్కార్ బరిలో నిలిచింది. అదే ఈ ఏడాది వందల కోట్లు సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న 'మహావతార్ నరసింహ'.
సలార్, కేజీఎఫ్ తదితర మూవీస్ తీసిన హొంబలే ఫిల్మ్స్ నుంచి ఈ ఏడాది వచ్చిందీ యానిమేషన్ సినిమా. జూలై 25న ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్ల రిలీజ్ చేశారు. తొలివారం పాజిటివ్, మౌత్ టాక్ రావడంతో ఓ మాదిరి కలెక్షన్ వచ్చాయి. రెండో వారం నుంచి ఇక తగ్గేదే లే అనేలా దూసుకుపోయింది. రూ.30-40 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఓవరాల్‌గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా లెవల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఇకపోతే ఇప్పుడీ సినిమా ఆస్కార్ బరిలోనూ నిలిచింది. 2026 ఆస్కార్ పోటీలో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పలు దేశాల నుంచి వచ్చిన 35 సినిమాల్లో 'మహావతార్ నరసింహ' కూడా ఒకటిగా నిలిచింది. మన దేశం నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి యానిమేటెడ్ చిత్రం ఇదే కావడం విశేషం. ఒకవేళ ఆస్కార్ గెలుచుకుంటే మాత్రం అది మరొక అద్భుతం అవుతుందడంలో ఎలాంటి సందేహం లేదు.
(ఇదీ చదవండి: కాబోయే భార్యకు మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్)
మహావతార్ నరసింహ సినిమా విషయానికొస్తే.. శ్రీ మహావిష్ణువు, నరసింహావతారం ఆధారంగా రూపొందిన చిత్రమిది. మీరు సృష్టించిన ఏ జీవి వల్ల, ఎలాంటి కాలంలోనూ ఏ అస్త్ర శస్త్రాల నుంచి తన ప్రాణాలకి ముప్పు కలగకూడదని బ్రహ్మ దేవుడి నుంచి రాక్షసరాజు హిరణ్యకశిపుడు వరం పొందుతాడు. ఆ తర్వాత ముల్లోకాలకు తానే అధిపతినని, తానే భగవంతుడినని ప్రకటించుకుంటాడు. భూలోకంలో ధర్మాన్ని కాలరాస్తాడు. తన సోదరుడి మరణానికి కారణమైన మహావిష్ణువుపై మరింత కోపంతో రగిలిపోతుంటాడు.
కానీ తన కుమారుడు ప్రహ్లాదుడు... శ్రీవిష్ణువుకి మహా భక్తుడిగా మారతాడు. ఇది సహించలేని హిరణ్యకశిపుడు.. ప్రహ్లాదుడిని చంపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? తనకెంతో ప్రీతిపాత్రమైన భక్తుడు ప్రహ్లాదుడిని మహావిష్ణువు ఎలా కాపాడుకున్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో నరసింహావతారం ఎత్తాల్సి వచ్చింది? హిరణ్యకశిపుడి సంహారం ఎలా జరిగింది? అనేదే సినిమా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన)


