హీరో రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన హిట్ పడట్లేదు. ఈ నెల ప్రారంభంలోనే 'మాస్ జాతర' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతంలో 'ధమాకా'తో హిట్ కొట్టడంతో ఇందులోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా పెట్టుకున్నారు. కానీ కాంబో ఈసారి పనిచేయలేదు. థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.
రవితేజ, శ్రీలీల కాంబోలో వచ్చిన 'మాస్ జాతర' చిత్రాన్ని కమర్షియల్ అంశాలతో తీశారు. కానీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో థియేటర్లలో తొలి ఆట నుంచే ఈ మూవీ తేలిపోయింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మరో మాస్ సినిమా లేకపోవడంతో జనాలు కాస్తోకూస్తో చూసేందుకు వచ్చారు. విడుదలకు ముందే డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా డీల్ సెట్ చేసుకున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
అలా ఈ శుక్రవారం అంటే నవంబరు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి 'మాస్ జాతర' రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విషయానికొస్తే.. లక్ష‍్మణ్ భేరి (రవితేజ) నిజాయితీ గల రైల్వే పోలీస్. వరంగల్‌లో పనిచేసేటప్పుడు ఓ మంత్రి కొడుకుని కొడతాడు. దీంతో అల్లూరి జిల్లాలోని అడవివరం రైల్వే స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. దీనికి సమీపంలో కొండల మధ్య ఉండే గిరిజన ప్రాంతాన్ని శివుడు (నవీన్ చంద్ర) శాసిస్తుంటాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులతో శీలావతి రకం గంజాయిని పండించి, దాన్ని కోల్‌కతాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు.
లక్ష్మణ్ ఆ ఊరిలోకి అడుగు పెట్టడంతోనే శివుడికి ఎదురెళ్లడం మొదలుపెడతాడు. జిల్లా ఎస్పీ నుంచి మొదలుకుని మొత్తం రాజకీయ వ్యవస్థ అండగా ఉన్న శివుడిని ఓ మామూలు రైల్వే ఎస్సై ఎలా అడ్డుకున్నాడు? అతడి గంజాయి సామ్రాజ్యాన్ని ఎలా కూలదోశాడు? ఇందులో తులసి (శ్రీలీల), హనుమాన్ (రాజేంద్ర ప్రసాద్)ల పాత్రల సంగతేంటి అనేది మిగిలిన స్టోరీ.
(ఇదీ చదవండి: కాబోయే భార్యకు మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్)


