సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పెళ్లికు ముందు కాబోయే భర్త లేదా భార్యకు సర్‌ప్రైజులు ఇస్తుంటారు. అవి చాలావరకు జీవితంలో మర్చిపోలేని మధుర స్మృతులుగా మిగిలిపోతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తనకు కాబోయే భార్యకు ఊహించని సర్‍ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఆమె షాక్‌లోనే ఉండిపోయింది. ఇప్పటికీ ఇది జరిగిందని నమ్మలేకపోతున్నానని సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 27న హరిణ్య అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇప్పటికీ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు మొదలైపోయాయి. తాజాగా హైదరాబాద్‌లో సంగీత్ పార్టీ జరగ్గా.. రాహుల్, హరిణ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇదే వేడుకకు టీమిండియా స్పిన్నర్ చాహల్ కూడా వచ్చాడు. ఇతడు రావడానికి ఓ కారణముంది. హరిణ్యకు ఫేవరెట్ క్రికెటర్ ఇతడు. దీంతో ఇతడిని సంగీత్‌కి పిలిచిన రాహుల్.. తనకు కాబోయే భార్య హరిణ్యకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఆమె ఆనందం పట్టలేకపోయింది.

చాహల్‌తో కలిసి దిగిన ఫొటోలను హరిణ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని బయటపెట్టింది. ఇప్పటికీ ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినందుకు రాహుల్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పింది. నిశ్చితార్థంలోనూ రాహుల్.. హరిణ్య కోసం ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెటర్‌ని పిలిచి ఆమెని మరింత సంతోషపెట్టాడు.
రాహుల్-హరిణ్య పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురిని రాహుల్ స్వయంగా ఆహ్వానించాడు.


