బాలీవుడ్‌ హీ మేన్‌ | Bollywood He-Man Dharmendra Passes Away At 89, Sakshi Special Story | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ హీ మేన్‌

Nov 25 2025 5:05 AM | Updated on Nov 25 2025 5:27 AM

Bollywood He-Man Dharmendra Passes Away At 89, Sakshi Special Story

నివాళి
 

‘ధరమ్‌ జీ’ ‘ధరమ్‌ పాజీ’ ‘వీరూ’ ‘ధరమ్‌ వీర్‌’... అంటూ ఇండస్ట్రీ, ప్రేక్షకులూ యాభై ఏళ్లుగా ప్రేమగా పిలుచుకున్న బాలీవుడ్‌ హీమేన్‌ ధర్మేంద్ర కన్నుమూశారు. రొమాంటిక్‌ సినిమాలతో మొదలు యాక్షన్‌ సినిమాల వరకు అన్నీ చేసి ‘సకల నటనా వల్లభుడు’ అనిపించుకున్న ధర్మేంద్ర మృతితో  ఒక శకం ముగిసింది.

ధర్మేంద్ర గారూ...  దేశానికి అమితాబ్‌ మంచి హెయిర్‌ స్టయిల్‌ ఇచ్చాడు. రాజేష్‌ ఖన్నా ఫ్యాషనబుల్‌ కుర్తా ఇచ్చాడు. మిథున్‌ డిస్కో డాన్స్‌ ఇచ్చాడు. మీరేం ఇచ్చారు?’
ధర్మేంద్ర ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి సమాధానం ఇచ్చారు. ‘ఆరోగ్యం ఇచ్చాను. నన్ను చూసి దేశంలో ఎందరో యువకులు జిమ్‌ వైపు నడిచారు. నేను దేశానికి కండ ఇచ్చాను. అంతకు మించింది ఏముంది?’

13 ఏళ్ల పిల్లవాడుగా ధర్మేంద్ర ఉన్నప్పుడు లూథియానా మినర్వా థియేటర్‌లో ‘షహీద్‌’ అనే సినిమా చూశాడు. అందులో ఒకతను ‘వతన్‌ కే రాహ్‌ మే వతన్‌ కే నౌజవాన్‌ షహీద్‌ హో’... అని చేతిలో జెండా పట్టుకుని పాడుతున్నాడు. అతణ్ణి హీరో అంటారని, అతని పేరు దిలీప్‌ కుమార్‌ అని ధర్మేంద్రకు తెలియదు. కాని థియేటర్‌ నుంచి బయటకు వచ్చే సమయానికి ఒకటే నిశ్చయించుకున్నాడు– ‘నేను అతనిలాగే మా ఊరి థియేటర్‌లో తెర మీద కనిపిస్తా’.
అది ఏ సమయమో. ఆ మాటను ఏ నక్షత్రాలు విన్నాయో.

ధర్మేంద్ర తండ్రి స్కూల్‌ టీచర్‌. పెద్ద కొడుకు ధర్మేంద్ర తన మార్గంలో నడిచి ప్రొఫెసర్‌ కావాలని ఆయనకు ఉండేది. ధర్మేంద్రకు చదువు వంటబట్టలేదు. పైగా సినిమా పురుగు కుట్టింది. దాంతో క్లాసులో ఏమీ వినలేక, చెప్పలేక తండ్రి చేతిలో రోజూ తిట్లే. ఇంటికి వచ్చి తల్లితో ‘నన్ను స్కూల్‌కు పంపకు. నాన్న నన్ను మిగిలిన పిల్లల కంటే ఎక్కువ తిడుతున్నాడు’ అని ఫిర్యాదు చేసేవాడు. 

మొత్తానికి మెట్రిక్‌తో చదువు ఆగి, రైల్వే శాఖలో క్లర్క్‌ ఉద్యోగం దొరికి, 19 ఏళ్లకు పెళ్లి కూడా అయిపోయింది. కాని అతణ్ణి వెండితెర పిలుస్తూ ఉంది. రోజూ అతడి బాధ చూసిన తల్లి ‘నీకు అంతగా నటించాలని ఉంటే ఒక అర్జీ పడేయొచ్చు కదరా’ అంది అమాయకంగా. ఉద్యోగానికి అర్జీగానీ హీరో కావడానికి అర్జీ ఉంటుందా? ఏమో... అర్జీ పెట్టాలేమో అనుకుంటున్న ధర్మేంద్రకు అప్పుడే ‘ఫిల్మ్‌ఫేర్‌ టాలెంట్‌ హంట్‌’ ప్రకటన పేపర్‌లో కనిపించింది.

 బిమల్‌ రాయ్, గురుదత్‌ల పర్యవేక్షణలో కొత్త నటీనటుల అన్వేషణ. అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి అప్పటికప్పుడు ‘మలేర్‌కోట్లా’ అనే టౌన్‌కు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాడు. కారణం ఫొటో స్టూడియో అక్కడే ఉంది. అక్కడ జాన్‌ మహమ్మద్‌ అనే ఫొటోగ్రాఫర్‌తో ‘నన్ను దిలీప్‌కుమార్‌లా ఫొటో తియ్యి’ అనంటే అతను అంతకన్నా అందంగా ఫొటో తీశాడు. వెంటనే బొంబాయి నుంచి పిలుపు వచ్చింది. మహా దర్శకులైన బిమల్‌రాయ్, గురుదత్‌ స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. గురుదత్‌ ఏ సినిమా ఆఫర్‌ చేయలేదుగానీ బిమల్‌రాయ్‌ ‘నీకు వేషం ఇస్తున్నా’ అన్నాడు. సినిమా పేరు ‘బందినీ’.

సినిమా రంగంలో ఇదిగో అంటే ఆర్నెల్లు. ‘బందినీ’ నిర్మాణం లేటయ్యింది. ఈలోపు ధర్మేంద్రకు పస్తులు మొదలయ్యాయి. బిమల్‌రాయ్‌ బుక్‌ చేసిన నటుడు కాబట్టి ‘దిల్‌ భీ తేరా హమ్‌ భీ తేరే’ (1960) అనే సినిమాలో హీరోగా 51 రూపాయల అడ్వాన్సుతో పని దొరికింది. మొదటి సినిమాగా అదే రిలీజైంది. కాని ఫ్లాప్‌. ఆ కష్టకాలంలో తనలాగే వేషాల కోసం ప్రయత్నిస్తున్న మనోజ్‌ కుమార్‌ ఫ్రెండ్‌ అయ్యాడు. 

రోజుల తరబడి స్టూడియోల చుట్టూ తిరగడం, భార్యనూ... ఉద్యోగాన్నీ వదిలేసి బొంబాయిలో ఏం చేస్తున్నావ్‌ అని తండ్రి అక్షింతలతో ఉత్తరాలు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం వేల వేదనలు అనుభవించాడు. అప్పుడు ‘బందినీ’ (1963) విడుదలైంది. కొద్దిగా గుర్తింపు. ‘ఆయి మిలన్‌ కీ బేలా’ (1963) నెగెటివ్‌ రోల్‌. రాజేంద్ర కుమార్‌ హీరో. కాస్త హిట్‌ అయ్యింది. ఈ సమయంలోనే అతను మన మహానటి సావిత్రి పక్కన హీరోగా ‘గంగాకీ లహరే’ (1964)లో నటించాడు. ఆ సంగతి సావిత్రికి, ధర్మేంద్రకు తప్ప ప్రేక్షకులకు తెలియదు. అంత ఫ్లాప్‌ ఆ సినిమా. ధర్మేంద్ర స్ట్రగుల్‌ కొనసాగింది.

సినిమా పరిశ్రమలో ‘గాడ్‌ఫాదర్‌’ ఉండాలని అంటూ ఉంటారు. ధర్మేంద్రకు ‘గాడ్‌మదర్‌’ దొరికింది. ఆమె పేరు మీనా కుమారి. మన ‘నాదీ ఆడజన్మే’ సినిమాను హిందీలో ‘మై భీ లడ్‌కీ హూ’ (1964)గా రీమేక్‌ చేస్తుంటే మొదటిసారి మీనాకుమారితో నటించాడు ధర్మేంద్ర. మీనాకుమారి అప్పటికే తన వివాహ బంధం నుంచి బయటపడింది. ఆమె మనసు ఒక మంచి మిత్రుడి కోసం చూస్తోంది. ఆ సమయంలో సిగ్గరిగా, స్నేహంగా ఉన్న ధర్మేంద్ర ఆమెకు ఆప్తుడుగా అనిపించాడు. మీనాకుమారి పేరు మీద ఇంకా సినిమాలు ఆడుతున్న రోజులు అవి. అందువల్ల మీనాకుమారి ధర్మేంద్రను చాలా ప్రమోట్‌ చేసింది. వారిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పూర్ణిమ (1965), కాజల్‌ (1965), ఫూల్‌ ఔర్‌ పత్థర్‌ (1966), చందన్‌ కా పల్‌నా (1967), ‘బహారోంకి మంజిల్‌’ (1968).... వీటిలో ఫూల్‌ ఔర్‌ పత్థర్‌ సూపర్‌హిట్‌. ఆ తర్వాత ధర్మేంద్ర ఆగలేదు. అతణ్ణి పెద్ద హీరో చేసిన మీనాకుమారి అతని జ్ఞాపకాల్లో మిగిలిపోయింది.

ఆశాఫరేఖ్, ధర్మేంద్ర జోడి ప్రేక్షకులకు నచ్చింది. ‘ఆయా సావన్‌ ఝూమ్‌ కే’... పాట రేడియోలో పెద్ద హిట్‌. సినిమా కూడా సూపర్‌హిట్‌. ‘ఆయా సావన్‌ ఝూమ్‌ కే’ సినిమాతో ధర్మేంద్ర కెరీర్‌ పూర్తిగా సెటిల్‌ అయ్యింది. ఇతను యాక్షన్, సెంటిమెంట్, రొమాంటిక్‌ సినిమాలు చేయగలడు అని ఇండస్ట్రీకి తెలిసిపోయింది. హీరోయిన్లు మాలాసిన్హా, సైరాబాను, వహీదా రెహమాన్, షర్మిలా టాగోర్‌ అందరూ ధర్మేంద్ర పక్కన నటించడానికి పోటీలు పడ్డారు. అయితే అతను నటించడానికి పోటీ పడిన హీరోయిన్‌ ఆ తర్వాతి రోజుల్లో వచ్చింది. హేమమాలిని!

ధర్మేంద్రలో ఒక మంచి, సెన్సిబుల్‌ నటుడు ఉన్నాడు. ఆ సంగతిని హృషికేష్‌ ముఖర్జీ పసిగట్టాడు. ‘అనుపమ’ (1966), ‘సత్యకామ్‌’ (1968), ‘చుప్కే చుప్కే’ (1975)... ఇవన్నీ ధర్మేంద్రతో తీశాడు. ధర్మేంద్ర మొత్తం కెరీర్‌లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన సినిమాగా ‘సత్యకామ్‌’ను విమర్శకులు గుర్తిస్తారు. అయితే ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యి ఆ తర్వాత కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచింది. ‘చుప్కే చుప్కే’లో ధర్మేంద్ర వేసిన ‘΄్యారేమోహన్‌’ అనే పాత్రకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ధర్మేంద్ర కామెడీని ప్రేక్షకులు ఈ సినిమాలో ఎంతో ఎంజాయ్‌ చేశారు. విశేషం ఏమంటే ఇందులో ధర్మేంద్ర బోటనీ ప్రొఫెసర్‌. సినిమా రిలీజయ్యాక తండ్రికి చూపించి ‘నువ్వు కోరినట్టుగా నేను బోటనీ ప్రొఫెసర్‌ అయ్యాను చూడు’ అనంటే ఆయన ఎప్పటిలానే ‘ఏడ్చావులే బడుద్దాయి’ అని అని అక్షింతలు వేశాడు.

ధర్మేంద్ర హీరో. అతను హీరోగా ఉంటే పక్క పాత్ర ఉంటుంది తప్ప వేరెవరో హీరోగా ఉంటే అతను పక్కపాత్ర కాదు. ‘షోలే’లో హీరో ధర్మేంద్ర. సినిమాలో ్రపాణాలతో మిగిలేది కూడా అతడే. కాని అమితాబ్‌ కూడా అసాధ్యుడిగా నటించాడు. ధర్మేంద్రకు రాజకీయాలు చేయడం తెలియదు. కొత్త తరం వస్తే అసూయ లేదు. ఒడ్డూ ΄÷డవూ ఉన్న అమితాబ్‌ తనను దాటేస్తాడనే భయం లేకుండా ‘జయ్‌’ పాత్రకు అమితాబ్‌ను తీసుకోండని తనే ఒక మాట వేశాడు దర్శకుడికి. ‘షోలే’ (1975) విడుదలయ్యి మరి కొన్ని రోజుల్లో 4కెలో రీరిలీజ్‌ అవనుంది. యాభై ఏళ్లుగా షోలే ఖ్యాతి ధర్మేంద్రను భారత ప్రేక్షకులకు చేరువ చేస్తూనే ఉంది. ప్రతి కొత్తతరం ఈ సినిమా చూసి ధర్మేంద్రకు ఫ్యాన్స్‌ అయ్యారు. ‘కుత్తే మై తేరా ఖూన్‌ పీజావూంగా’ డైలాగ్‌ ధర్మేంద్ర ఒక్కసారి చెప్తే ఆ తర్వాతి తరాలు వందసార్లు చెప్తూనే ఉన్నాయి.

1980ల తర్వాత ధర్మేంద్ర మల్టీస్టారర్‌ సినిమాల్లో హీరోగా క్షణం తీరిక లేకుండా గడిపాడు. అదే సమయంలో తన కుమారుడు సన్ని డియోల్‌ను ‘బేతాబ్‌’ (1983)లో లాంచ్‌ చేసి హీరోగా నిలబెట్టాడు. కొడుకుతో ధర్మేంద్ర తీసిన ‘ఘాయల్‌’ కూడా సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ కాలంలో హీరోగా ధర్మేంద్ర కొన్ని సినిమాలు చేస్తుంటే హీరోగా సన్నిడియోల్‌ సినిమాలు చేస్తూ వచ్చాడు. డింపుల్‌ కపాడియా వంటి హీరోయిన్లు ఇద్దరి సరసనా నటించారు. ఆ తర్వాత చిన్న కొడుకు బాబీ డియోల్‌ను ‘బర్సాత్‌’తో లాంచ్‌ చేశాడు ధర్మేంద్ర.

ధర్మేంద్ర ఎప్పుడూ తన పని గురించి తప్ప ఎత్తులు పైఎత్తులు వేస్తూ కూచోలేదు. పంచాయతీలకు దిగలేదు. అనవసరంగా మీడియా ముందుకు రాలేదు. ఇన్నేళ్లలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తక్కువ. అవార్డు ఫంక్షన్లకు హాజరవడం, పార్టీలు ఇవన్నీ చాలా పరిమితంగా చేసేవాడు. ధర్మేంద్రకు రైతుగా ఉండడటం ఇష్టం. అందుకే కుమారులిద్దరూ కలిసి లోనావాలా దగ్గర 100 ఎకరాల ఫామ్‌హౌస్‌ ఏర్పాటు చేశాడు. 

సినిమాలను పూర్తిగా తగ్గించుకున్నా ఆ ఫామ్‌హౌస్‌లోనే ఎక్కువగా గడిపాడు ధర్మేంద్ర, ‘మీ వయసు ఎంత?’ అని ధర్మేంద్రను అడిగితే ‘అది కెమెరా చెప్తుంది’ అనేవాడు. కెమెరా తన కంటితో ఆయనను ఎప్పుడూ యంగ్‌గా, ఆరోగ్యవంతుడిగా, ధీరుడిగా, హీమాన్‌గానే చూపిస్తూ వచ్చింది. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఆయన ఆ రూపంతోనే మిగిలిపోతాడు. ధర్మేంద్ర నటించిన ‘గాడీ బులా రహీహై’ పాటలో ‘గాడీ’ అంటే మృత్యువుకు సంకేతం. ఇన్నాళ్లకు మబ్బుల సెట్టింగ్, మెరుపుల ఆర్క్‌ లైట్లు ఉన్న చోటుకు తీసుకెళ్లే గాడీ ఎక్కి తరలిపోయాడు ధర్మేంద్ర. గాడీ బులా రహీహై... సీటీ బజా రహీహై.

హేమమాలినితో ప్రేమకథ
హిందీ సినిమాల్లో హేమమాలిని రాకను బాంబేలో పెద్ద దుమారంగా మార్చిన వ్యక్తి రాజ్‌కపూర్‌. హేమమాలిని హిందీలో హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా ‘స΄్నోంకా సౌదాగర్‌’ (1968)లో రాజ్‌కపూర్‌ హీరో. ఆ సినిమా పబ్లిసిటీ కోసం ‘డ్రీమ్‌ గర్ల్‌ హేమమాలిని’ అంటూ బాంబే అంతా హోర్డింగ్స్‌ పెట్టించాడు. అలా ఆమె బాలీవుడ్‌ హీరోల దృష్టిలో పడింది. ఆ వెంటనే ధర్మేంద్ర తో ‘తుమ్‌ హసీ మై జవాన్‌’ (1969)లో నటించింది. ధర్మేంద్ర అప్పటికే వివాహితుడైనా, నలుగురు పిల్లల తండ్రయినా హేమమాలిని ఆకర్షణలో పడ్డాడు. 

సౌత్‌ హీరోయిన్లు హిందీలో ఎప్పుడూ టాప్‌స్టార్స్‌గానే ఉన్నారు. వహీదా రహెమాన్, వైజయంతీమాల, రేఖ... ఇప్పుడు హేమమాలిని. ఆమె స్నేహం కోసం అందరూ ఎదురు చూసిన వారే. వీరిలో మనోజ్‌ కుమార్, జితేంద్ర, సంజీవ్‌ కుమార్, ధర్మేంద్ర ఉన్నారు. ‘షోలే’ (1975) చేసే సమయానికి ధర్మేంద్ర ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆమెకు దగ్గరవడానికి ఆమెతో నటించే సీన్లలో రీటేక్‌ల కోసం లైట్‌బాయ్స్‌ను ఏదో ఒక తప్పు చేయమని తప్పుకు వంద రూపాయలు ఇచ్చేవాడు– ఆ రోజుల్లో. దాంతో హేమమాలినికి ధర్మేంద్ర అవస్థ తెలిసి వచ్చింది. 

అయినప్పటికీ ఇంట్లో అనంగీకారం, ధర్మేంద్ర మొదటి పెళ్లి కారణంగా హేమ మనసు ద్వైదీభావంతో ఉండేది. ఆ సమయంలోనే జితేంద్రతో దాదాపుగా ఆమె వివాహం వరకూ వెళ్లడం, మద్రాసుకు అందుకై వాళ్లు చేరుకోగా ధర్మేంద్ర మరో ఫ్లయిట్‌లో అక్కడకు వెళ్లి ఆమెను ఒప్పించి పెళ్లి కేన్సిల్‌ చేయడం ఆ రోజుల్లో వార్తగా వచ్చింది. చివరకు ధర్మేంద్ర, హేమమాలిని 1980లో వివాహం చేసుకున్నారు. ఇది పెద్ద వార్త. అయితే ధర్మేంద్ర తన కుటుంబాన్ని హేమమాలిని జీవితంలో జోక్యం చేసుకోకుండా, హేమమాలిని తాను అతని కుటుంబంలో జోక్యానికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. 

అలాగే ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్‌ కౌర్‌ ఎప్పుడూ ఈ విషయమై ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడలేదు. వారి ఇద్దరు కుమార్తెల్లో ఇషా డియోల్‌ సినిమాల్లో రావడం ధర్మేంద్రకు అంగీకారంగా లేకపోయినా తర్వాత ఆమెతో పాటు కలిసి నటించాడు కూడా. ‘నేను నా కుమార్తెను నటించ వద్దు అన్నాను నిజమే. నన్ను నా తండ్రి నటించ వద్దు అన్నాడు కదా. సినిమా రంగంలో కెరీర్‌ ఎంపికపై తల్లిదండ్రుల అభి్రపాయం ఉండటం తప్పు కాదు’ అంటాడు ధర్మేంద్ర. అయితే ధర్మేంద్ర కుమారులు సన్ని డియోల్, బాబీ డియోల్‌ తమ సవతి తల్లి కుమార్తెలతో అంత మంచి అనుబంధంలో ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. వారు నలుగురూ కలిసిన సందర్భాలు దాదాపుగా లేనట్టే.

ధర్మేంద్ర టాప్‌ 10 పాటలు
1.     యా దిల్‌ కి సునో దునియా వాలో 
    ∙అనుపమ
2.     ఆప్‌ కే హసీన్‌ రుఖ్‌మె ఆజ్‌ నయా నూర్‌ హై
    ∙బహారె ఫిర్‌ భి ఆయేగీ
3.     బహారోంనె మేరా చమన్‌ లూట్‌ కర్‌ 
    ∙దేవర్‌
4.     సాథియా నహీ జానా కె జీనా లగే 
    ∙ఆయా సావన్‌ ఝూమ్‌ కే
5.     ఆజ్‌ మౌసమ్‌ బడా బే ఇమాన్‌ హై 
    ∙లోఫర్‌
6.     పల్‌ పల్‌ పల్‌ దిల్‌ కే పాస్‌ 
    ∙బ్లాక్‌ మెయిల్‌
7.     కోయి హసీనా జబ్‌ రూuЇ జాతీ హై తో 
    ∙షోలే
8.     ఓ మెరి మెహబూబా
    ∙ధరమ్‌ వీర్‌
9.     హమ్‌ బేవఫా హర్‌గిజ్‌ న థే 
    ∙షాలిమార్‌
10. జిల్‌మిల్‌ సితారోంకా ఆంగన్‌ హోగా 
    ∙జీవన్‌ మృత్యు

మాఫియాకి ధర్మేంద్ర హడల్‌
1980లలో ప్రతి చిన్నా చితకా హీరోలకు మాఫియా నుంచి కాల్స్‌ వచ్చేవి. ‘భాయ్‌ మాట్లాడతాడట’ అనంటే అందరూ ఒణికిపోయేవారు. డబ్బులు కొందరు ఇచ్చేవారు. ఇలాగే ఒకసారి ధర్మేంద్రకు కూడా ఫోన్‌ వచ్చింంది. ధర్మేంద్ర ఫోన్‌ అందుకుని ‘మీరు ఎంత మంది ఉంటారు. ఒక పది మంది ఉంటారా? మీకు నేనొక్కణ్ణే చాలు. కాదు కూడదన్నారో ఒక ఫోన్‌ కొడితే మా పంజాబ్‌ నుంచి లారీలకు లారీలు కత్తులతో దిగుతారు. రండి చూసుకుందాం’ అన్నాడు. అంతే! మళ్లీ మాఫియా నుంచి ధర్మేంద్రకు ఫోన్‌ లేదు.

నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్‌’ధర్మేంద్ర మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్‌ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్‌లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్‌కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్‌ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్‌హౌస్‌ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement