గోవాలో ఘనంగా ‘ఇఫీ’ చలన చిత్రోత్సవం
తరలి వస్తున్న సినీ ప్రముఖులు... సినీ అభిమానులు
ఈవెంట్ల హోరు... ఇంటర్నేషనల్ సినిమా జోరు
జయహో దక్షిణాది అంటున్న సినీ ప్రపంచం.
కళా బృందాల ఆటపాటలతో కళకళలాడుతున్న వేదికలు
గోవాలోని పంజిమ్‌లో 56వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నెల 20న ఆరంభమైన ఈ చిత్రోత్సవం మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈ ఉత్సవంలో 81 దేశాల నుంచి 240కి పైగా సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. వీటిలో 13 ప్రపంచ ప్రీమియర్‌లు, అనేక అంతర్జాతీయ ఆసియా ప్రీమియర్‌లు ఉన్నాయి. ఈ చిత్రోత్సవానికి జపాన్ కంట్రీ ఆఫ్ ఫోకస్‌గా, స్పెయిన్ ‘భాగస్వామి దేశం’గా ఆస్ట్రేలియా ‘స్పాట్‌లైట్ దేశం’గా వ్యవహరిస్తున్నాయి.
తెలుగు చిత్రాల సందడి...
పలు టాలీవుడ్ చిత్రాలకు ఈ చిత్రోత్సవంలో చోటు దక్కింది. నేడు (26వ తేదీ బుధవారం) ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను, 28న ‘సంక్రాంతికి వస్తున్నాం’ను ప్రదర్శించనున్నారు. ప్రారంభ చిత్రాల్లో ఒకటిగా తమిళ చిత్రం ‘అమరన్’ చోటు దక్కించుకోగా, మరికొన్ని తమిళ, మలయాళ చిత్రాలను కూడా ప్రదర్శించారు. పనోరమా విభాగంలో 25 చలన చిత్రాలు, 20 నాన్–ఫీచర్ చిత్రాలు ఉన్నాయి.
సినిమా... అంతకు మించి...
ఈసారి చిత్రోత్సవంలో సినిమాల ప్రదర్శనతో పాటు మరెన్నో వైవిధ్యభరిత, ఆసక్తికరమైన కార్యక్రమాలకు చోటు కల్పించారు. కొత్త తరాన్నిప్రోత్సహించడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడం వంటి లక్ష్యాలతో వీటిని నిర్వహిస్తున్నారు.
క్రియేటివిటీకి క్లాప్...
చిత్రోత్సవాల్లో సినిమాల ప్రదర్శనతో పాటు నూతన తరాన్నిప్రోత్సహించడమే లక్ష్యంగా ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో‘ (సీఎమ్‌ఓటి) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 128 మంది యువతీ యువకులు 48 గంటల చిత్ర నిర్మాణ ΄ోటీలో పాల్గొన్నారు. వీరిని 5 విభాగాలుగా విభజించి ΄ోటీ నిర్వహించారు. దీనిలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఎంపిక అవడం విశేషం.
మాస్టర్ క్లాస్... సూపర్ హిట్...
చిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మాస్టర్ క్లాస్‌లు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. బాలీవుడ్ సినీ ప్రముఖుడు విధు వినోద్ చోప్రా నిర్వహించిన మాస్టర్ క్లాస్ ఆకట్టుకుంది. అందులో ఆయన పంచుకున్న జీవితానుభవాలు యువతను మేల్కొలిపేలా ఉన్నాయి. అలాగే చిత్రోత్సవాల్లో దాదాపు పూర్తి స్థాయిలో కనిపించిన మరో సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సమర్పించిన మాస్టర్ క్లాస్ సినీరంగంలో రాణించాల్సిన వారికి ఉండాల్సిన ఓర్పు పట్టుదల అవసరాన్ని నొక్కి చెప్పింది.
సెషన్స్... లెసన్స్...
‘ఇన్ –కన్వర్జేషన్ ’ పేరిట కీలకమైన అంశాలపై సాగుతున్న పలు చర్చలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సుహాసిని, ఖుష్బూ నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అలాగే సినిమా రంగంలో మహిళల అంశంపై దేశ విదేశీ ప్రముఖులు సాగించిన చర్చ కూడా ఆలోచనలు రేకెత్తించేలా ఉండి, ఆకట్టుకుంది.
ఏఐ ఫెస్ట్... రేపటికి మస్ట్...
ఇఫీలో తొలిసారిగా ‘సినిమాఏఐ హ్యాకథాన్’ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సినిమాటిక్ సృజనాత్మకథ కలయికలో హ్యాకథాన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన ఫిల్మ్‌లు ప్రదర్శిస్తున్నారు.
ఇఫీస్టా...
మరోవైపు ప్రధాన ఉత్సవానికి సమాంతరంగా ‘ఇఫెస్టా’ సాంస్కృతిక సంబరం ఏర్పాటైంది. ఇది సంగీతాభిమానులను తనివి తీరా ఆనందింపజేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, జానపద నృత్యాలు.. వంటివి ఉంటున్నాయి. ‘బాటిల్ ఆఫ్ బాండ్స్’ (భారతీయ, అంతర్జాతీయ బ్యాండ్స్) మరో ఆకట్టుకునే కార్యక్రమం. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన కళాబృందాల్లో మన తెలంగాణ నుంచి గుస్సాడీ నృత్య కళాకారుల బృందం కూడా ఒకటి.
అలలోత్సవం... వేవ్స్ బజార్...
మారియట్ హోటల్ వేదికగా నిర్వహిస్తోన్న వేవ్స్ బజార్ పెద్ద సంఖ్యలో ఆహుతుల్ని ఆకర్షిస్తోంది. ఈప్రాంగణంలో రోజూ పదుల సంఖ్యలో సినిమాల ప్రదర్శనతో పాటు స్టార్టప్స్ వేదికలు, సాంకేతిక పరికరాల ప్రదర్శనలు... ఇంకా మరెన్నింటికో చోటు కల్పించారు. ఎన్‌ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ఈవెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫిల్మ్ + టెక్‌ను కలిపే ఉద్దేశంతో స్టార్ట్–అప్ – ఇన్నోవేషన్‌ను కలుపుతూ వేవ్ ఎక్స్ అనే జోన్ కూడా ఏర్పాటు చేశారు.
సెలబ్రిటీకి రైట్ రైట్... రెడ్ కార్పెట్..
సినిమాల ప్రదర్శన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై సినీ సెలబ్రిటీలు వాక్ చేస్తున్నారు. ఆ సందర్భంగా వీరు సందర్శకులు, మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో అతిర«థ మహారధుల వంటి సినిమా ప్రముఖులు కనపడుతుండడంతో ఔత్సాహిక రూపకర్తలకు అభిమానులకు అవధుల్లేని ఆనందం కలుగుతోంది.
ప్రత్యేక ఆకర్షణలు...
ఇఫీలో ఆహుతులను ఆకట్టుకుంటున్న అనేక ప్రదర్శనల్లో కొన్ని మరింత విశేషంగా అనిపిస్తున్నాయి. వాటిలో.. ∙‘షోలే’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో వినియోగించిన బైక్‌ను ఈ ఈవెంట్‌లో ప్రదర్శిస్తున్నారు. దాంతో ఆహుతులు ఆ బైక్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ∙కళా అకాడమీలో ఏర్పాటైన కెమెరా ప్రదర్శన ఔరా అనిపిస్తోంది. అక్కడ వందల సంఖ్యలో కొలువుదీరిన అనేక కెమెరాల్లో శతాధిక వయస్సు ఉన్నవి కూడా ఉండడం విశేషం. పలు కెమెరాలు మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. మహారాష్ట్రకు చెందిన సర్వేష్ అనే కెమెరాల సేకర్త ఈ ప్రదర్శనను సమర్పిస్తున్నారు. ఆహుతులు పెద్ద సంఖ్యలో ఈ కెమెరాలను తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు.
⇒ప్రాంగణంలో నెలకొల్పిన అనేక స్టాల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాంకేతిక ప్రగతికి చిహ్నంగా కనిపించే అనేక విశేషాలను ఈ స్టాల్ ప్రదర్శిస్తోంది. పైగా యువతను ఆకట్టుకునేలా అప్పటికప్పుడు గెలు΄ోటముల్ని తేల్చేసే టెక్ గేమ్స్ నిర్వహిస్తుండడంతో యువత పెద్ద సంఖ్యలో గుమి కూడుతోంది.
పంజిమ్‌లోని పీబీబి సెంటర్, ఐనాక్స్ థియేటర్‌ప్రాంగణం, కళా అకాడమీ, మారియట్ హోటల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియం... తదితర ప్రదేశాల్లో ఇఫీ విస్తరించింది. ఈ దఫా ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్స్‌కు కూడా చోటు కల్పించడం మరో విశేషం. వందల సంఖ్యలో ఈవెంట్లు ఆకర్షణలు, విశేషాలతో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది ఆహుతులను ఆకర్షిస్తోంది. మరో 2 రోజుల్లో ముగియనున్న ఇఫీ... మరో ఏటా తన కోసం వేచి చూసేవారి సంఖ్యని ఈ ఏడాది కార్యక్రమాలతో మరింతగా పెంచుకోనున్నదని చెప్పవచ్చు. – సత్యబాబు
దక్షిణ కొరియా ఎంపీ జేవాన్ కిమ్ మన వందే మాతరంను అత్యంత శ్రావ్యంగా గానం చేయడం గోవాలో జరిగిన వేవ్స్ ఫిల్మ్ బజార్‌ప్రారంభ వేడుకలో హర్ష ధ్వానాలు అందుకుంది. ఒక విదేశీయురాలు ఇంత అందంగా పాడగలగడం చూడటం గొప్ప విషయం అని పలువురు అతిథులు అభినందనలు కురిపించారు.
భానుమతి శత జయంతుత్సవాలు...
ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినిమా దిగ్గజాలు గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్ భూపేన్ హజారికా, సలీల్ చౌదరిలతో పాటు మన తెలుగు సినీరంగానికి చెందిన దివంగత నటి స్వర్గీయ పి. భానుమతి శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఆమె నటించిన సూపర్ హిట్ సినిమా ‘మల్లీశ్వరి’ని చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఇదే ఫెస్టివల్‌లో భాగంగా గత ఏడాది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకుప్రారంభ వేడుకలో టాలీవుడ్ నటుడు బాలకృష్ణను సన్మానించారు. ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను సన్మానించనున్నారు అలాగే ఆయన సినిమాలు లల్ సలామ్, జైలర్’ లను చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తున్నారు.


