‘‘మొదట్లో నా జీవితంలో బర్త్ డే సెలబ్రేషన్స్ లేవు. ఎప్పుడైతే నేను సినిమాల్లోకి వచ్చానో నా బర్త్ డేని నా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్లే వస్తారు... కటౌట్స్ పెడతారు... కేక్ కట్ చేస్తారు. లక్షల్లో ఖర్చు పెడతారు. ఇలా ప్రతి ఏడాది సెప్టెంబరు 18న జరుగుతుంది. అందుకే ఆ రోజుని నేను నా బర్త్ డే అని కాకుండా ఫ్యాన్స్ డే అని డిక్లేర్ చేశాను’’ అని ఉపేంద్ర చెప్పారు.
రామ్, భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాలో సినీ సూపర్‌స్టార్ సూర్యగా ఉపేంద్ర, ఆయన అభిమాని సాగర్‌గా రామ్ నటించారు. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరులతో ఉపేంద్ర పంచుకున్న విశేషాలు.
∙‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కథను ఒక ప్రేక్షకుడిలా విన్నాను. ఈ సినిమాలో చూపించినది అందరి జీవితంలో జరిగే ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఇందులో నేను సూర్యకుమార్ అనే సూపర్ స్టార్ పాత్రలో కనిపిస్తాను. అందరి సూపర్ స్టార్స్ జీవితాల్లో ఉన్నట్లే ఫ్యాన్స్, కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్... వంటివి సూర్య కెరీర్‌లోనూ ఉంటాయి. ఒక స్టార్‌ని ఆయన ఫ్యాన్స్ ఎందుకు అంత గొప్పగా ఆరాధిస్తారో, ఎందుకు అంత ప్యూర్‌గా ప్రేమిస్తారో లాజిక్ దొరకదు. కొన్నిసార్లు అనిపిస్తుంది వారి ప్రేమకు మేము అర్హులమా? అని.
⇒ ఈ చిత్రంలో రామ్‌గారి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇంట్రవెల్ సీన్‌కి థియేటర్‌లో ఆడియన్స్ గూస్‌బంప్స్ ఫీలవుతారు. ధనిక, పేద వర్గాల మధ్య ఉండే తారతమ్యాలు, ప్రేమ, భావోద్వేగాలు వంటివి కమర్షియల్‌గా చక్కగా చూపించారు దర్శకుడు మహేశ్‌బాబు. నిజ జీవితంలో ఓ యాక్టర్‌గా నా ఫ్యాన్స్‌కి ఏదైనా చెప్పాలనే కోరిక నాకు ఉంటుంది. ఆ చాన్స్ నాకు ఈ సినిమాతో లభించిందని అనుకుంటున్నాను.
⇒ ‘ఏ’ సినిమా చూద్దామని థియేటర్‌కి వెళ్లాను. ఫస్ట్ డేనే నా సినిమాకు అంతమంది జనాలు వస్తారని నేను ఊహించలేదు. సినిమా చూడకుండా నన్ను చూస్తూ, ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఆ తర్వాత అందరూ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. డిఫికల్ట్ స్క్రీన్‌ప్లే ఉన్న ‘ఏ’ను చూడకుండా ఆడియన్స్ అందరూ బయటకు వచ్చారేంటి? అనుకున్నాను. అందరూ నన్ను చుట్టు ముట్టడంతో ΄ోలీసులు వచ్చి అక్కడ్నుంచి నన్ను తీసుకుని వెళ్లారు. నేను థియేటర్‌కి వెళితే ఆ సినిమా స్క్రీనింగ్ డిస్ట్రబ్ అవుతుందేమోనని అప్పట్నుంచి థియేటర్స్‌కు వెళ్లడం లేదు.
⇒ ఒక ఫిల్మ్ మేకర్‌కు సంతృప్తి ఉండదు. ప్రేక్షకులకు ఇంకా ఏదైనా కొత్తగా చెప్పాలనే ఆకాంక్ష ఉంటుంది. నా సినిమాల గురించి ఆడియన్స్ చర్చించుకోవాలని, డీ కోడ్ చేయాలని నా సినిమా టైటిల్స్‌ను కొత్తగా ప్రయత్నిస్తుంటాను. ‘ఏ, ఓం, సూపర్, యూఐ’ టైటిల్స్ ఇలా వచ్చినవే. ఇక స్క్రిప్ట్ సిద్ధమైన వెంటనే నా దర్శకత్వంలోని సినిమాను ప్రకటిస్తాను. చిరంజీవిగారితో సినిమా చేయడం నా డ్రీమ్. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. నేను ఓ లీడ్ రోల్ చేసిన ‘45’ సినిమా డిసెంబరులో రిలీజ్ అవుతుంది.


