యూరప్‌ ఎయిర్‌పోర్ట్‌లపై సైబర్‌ దాడి | Cyberattack disrupts flights at European airports | Sakshi
Sakshi News home page

యూరప్‌ ఎయిర్‌పోర్ట్‌లపై సైబర్‌ దాడి

Sep 21 2025 6:40 AM | Updated on Sep 21 2025 6:40 AM

Cyberattack disrupts flights at European airports

ప్రధాన విమానాశ్రయాల్లో స్తంభించిన కార్యకలాపాలు

నిలిచిపోయిన చెక్‌–ఇన్, బోర్డింగ్‌ వ్యవస్థలు

వందల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

పలు విమానసర్వీసులు రద్దు

పునరుద్దరణకు కృషిచేస్తున్న బ్రిటన్, బెల్జియం, జర్మనీ తదితర దేశాలు

లండన్‌/న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో రహదారు లను ఎంత విపరీతంగా వినియోగిస్తారో యూరప్‌ దేశాల్లో విమానాలను పౌరులు అంతే స్థాయి లో ఉపయోగిస్తారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే యూరప్‌లోని పలు దేశాల్లోని ప్రధాన విమానాశ్రయాలపై శనివారం అనూహ్యంగా హఠాత్తుగా ఒకేసారి సైబర్‌ దాడి జరిగింది. ఈ దెబ్బకు ఆయా విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికుల చెక్‌–ఇన్, బోర్డింగ్‌ సర్వీసులు స్తంభించిపోయాయి. 

సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సర్వీస్‌ ప్రొవైడర్లను సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకోవడంతో ఈ సమస్య తెలెత్తినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే అప్రమత్తమైన నిపుణులు పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతానికి పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చిందని, స్వల్పస్థాయిలో ప్రయాణికులే ఇంకా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో విమానసర్వీసుల వ్యవస్థలో పటిష్ట భద్రతా లోపించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

లండన్‌లోని ప్రఖ్యాత హీత్రూ ఎయిర్‌పోర్ట్‌ మొదలు బెల్జియంలోని బ్రస్సెల్‌లో ఎయిర్‌పోర్ట్, జర్మనీలోని బెర్లిన్‌ విమానాశ్రయం దాకా పలు ఎయిర్‌పోర్ట్‌లు సైబర్‌దాడుల ప్రభావాన్ని చవిచూశాయి. ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్‌ వ్యవస్థల్లో సైబర్‌దాడి జరగలేదని కేవలం సర్వీస్‌ ప్రొవైడర్లలోనే ఈ ఘటన జరిగిందని బ్రస్సెల్స్‌ ఎయిర్‌పోర్ట్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘కొన్ని ఎయిర్‌పోర్ట్‌లలో మల్టీ–యూజర్‌ సిస్టమ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (మ్యూస్‌) సాఫ్ట్‌వేర్‌పై సైబర్‌దాడి జరిగింది. దీంతో  ప్రయాణికులు సొంతంగా చెక్‌–ఇన్‌ చేసుకోవడం, బోర్డింగ్‌ పాస్‌ ముద్రణ, బ్యాగులకు ట్యాగ్‌లు తదితర సేవలు అందుబాటులోకి లేకుండా పోయాయి’’అని ఈ సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే కోలిన్స్‌ ఏరోస్పేస్‌ సంస్థ తెలిపింది.

ఇది కచ్చితంగా లక్షిత దాడే
‘‘యథాలాపంగా జరిగిన దాడి కాదు. హ్యాకర్లు, నేరముఠాలు లేదా యూరప్‌ అంటే గిట్టని దేశాలు తమ సైబర్‌ నిపుణులతో చేయించిన దాడి ఇది. ఒకేసారి వేర్వేరు దేశాల్లోని వేర్వేరు సర్వీస్‌ ప్రొవైడర్ల సమక్షంలో పనిచేసే ఎయిర్‌పోర్ట్‌లపై జరిగిన దాడి ఇది. ఇది నిజంగా ఆశ్చర్యానికి, షాక్‌కు గురిచేసే దాడి. ప్రపంచంలోనే మంచి పేరున్న ఏవియేషన్, రక్షణరంగ కంపెనీల సాఫ్ట్‌వేర్‌పైనే దాడి జరిగింది. భద్రతావైఫల్యాలను ఈ ఘటన ఎత్తిచూపిస్తోంది’’ అని ప్రయాణి నిపుణుడు పౌల్‌ ఛార్లెస్‌ విశ్లేషించారు. 

సైబర్‌దాడికి గురైన వ్యవస్థలతో అనుసంధానతను ఆపరేటర్లు వెంటనే తొలగించి ప్రభావతీవ్రతను తగ్గించారని బెర్లిన్‌ ఎయిర్‌పోర్ట్‌ తెలిపింది. యూరప్‌లోనే అత్యంత రద్దీగా ఉంటే హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లోనూ కొందరు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ‘కియోస్క్‌లు పనిచేయట్లేవు. కౌంటర్‌ల వద్ద సిబ్బంది ఎటో వెళ్లిపోయారు. బ్యాగేజ్‌ చెక్‌–ఇన్‌ కోసం టెర్మినల్‌–4 వద్ద మూడు గంటలువేచి ఉన్నాను’ అని మేరియా కాసే అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఆన్‌లైన్‌ పనిచేయట్లేదు. దీంతో మ్యాన్యువల్‌గా చెక్‌–ఇన్‌ పూర్తిచేస్తున్నాం. బ్యాగ్‌లపై చేతితో నంబర్లు వేస్తున్నాం’’అని ఏవియేషన్, డిఫెన్స్‌ టెక్నాలజీ సంస్థ కోలిన్స్‌కు అనుబంధ ‘ఆర్‌టీఎక్స్‌’ తెలిపింది. భారత్‌లో మాత్రం ఇలాంటి సమస్య తలెత్తలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు శనివారం ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement