రియాద్: అరబ్ దేశమైన సౌదీ అరేబియా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ముస్లిమేతర విదేశీయులకు మద్యం విక్రయాలకు అనుమతిచ్చేలా షరియా చట్టాల్ని సడలించినట్లు తెలుస్తోంది. విజన్ 2030 సౌదీ లిబరలైజేషన్ పేరుతో ప్రస్తుతం దేశాన్ని చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి విభిన్న రంగాలకు విస్తరించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై సౌదీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
సౌదీ అరేబియా ఇప్పటివరకు షరియా చట్టం ప్రకారం మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. కానీ ఇటీవల ప్రభుత్వం ముస్లిమేతరల (Non-Muslim Expats) కోసం ప్రత్యేకంగా మద్యం విక్రయించేందుకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం సౌదీ అరేబియా దేశ సామాజిక, ఆర్థిక, పర్యాటక రంగాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావించబడుతోంది.
కొత్త విధానంతో ముస్లిమేతర విదేశీయులు ప్రత్యేక లైసెన్స్ పొందిన స్టోర్లలో మద్యం కొనుగోలు చేయొచ్చు. ఈ కొనుగోళ్ల విషయంలో కఠిన నిబంధనలు వర్తిస్తాయి.
సౌదీ అరేబియా విజన్ 2030 ప్రణాళికలో భాగంగా పర్యాటకాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మద్యం విక్రయాలతో పాశ్చాత్య దేశాల నుండి పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. సౌదీ (saudi arabia) యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ఆధ్వర్యంలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు నివేదికలు హైలెట్ చేశాయి.
అయితే, ఈనిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. పలువురు సౌది రాజు తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే మరికొందరు మాత్రం మద్యం అమ్మకాలతో షరియా చట్టాల్ని అతిక్రమించడమేనంటూ తప్పుబడుతున్నారు.
ఏది ఏమైనా రాజు తీసుకున్న నిర్ణయంపై మెజార్టీ వర్గాల నుంచి అంటే పర్యాటకరంగం మీద ఆధారపడే హోటల్ యజమానులు, ట్రావెల్ ఏజెన్సీలు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సడలించిన షరియా నిబంధనలు కారణంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు,పర్యాటక రంగానికి గణనీయంగా ఆదాయ మార్గాలు పెరగడం, కొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకు రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


