
పండుగ సీజన్‌లో హ్యాకర్ల హంట్
బోగస్ ట్రావెల్ ప్యాకేజీలు, ఫేక్ బుకింగ్స్
క్విక్ హీల్ హెచ్చరిక
న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో ఆదమరిచి ఉన్న తరుణంలో సైబర్ మోసాల విషయంలో జాగ్రత్త వహించాలని సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ క్విక్ హీల్ టెక్నాలజీస్ హెచ్చరించింది. ఫేక్ బుకింగ్ ఇంటర్‌ఫేస్‌లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీలు, నమ్మశక్యం కాని బూటకపు ఈ–కామర్స్ ఆఫర్లతో మోసగాళ్లు గాలం వేసే ముప్పు ఉందని పేర్కొంది.
నకిలీ టికెట్ల సైట్లు, మోసపూరిత లింకులు, ఫిషింగ్ పేజీలకు దారి తీసే యూపీఐ పేమెంట్ రిక్వెస్టుల రూపంలో ఈ దాడులు జరగొచ్చని పేర్కొంది. అలాగే, అప్పటికప్పుడు రుణాలిచ్చేస్తామని ఆకర్షించే క్రెడిట్, లోన్ యాప్‌లు కూడా మందుపాతరల్లాంటివని ఒక ప్రకటనలో వివరించింది. అన్నింటికీ పరి్మషన్లు కావాలంటూ అడిగే ఫేక్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. సాధారణంగా పండుగల సందర్భంగా డాండియా, ఇతరత్రా కార్యక్రమాల కోసం బుక్ చేసుకునే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని క్విక్ హీల్ తెలిపింది.
ఆగస్టు నుంచి డిసెంబరు దాకా సాగే పండుగల నెలల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇలాంటి ఉదంతాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఔట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ వల్లే ఈ తరహా మోసాలు జరుగుతుంటాయి కాబట్టి, యూజర్లంతా ఎప్పటికప్పుడు యాంటీవైరస్‌లను, సిస్టమ్ ప్యాచ్‌లను అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. డీల్స్ విషయంలో సందేహం కలిగితే ఎంబెడెడ్ లింకులను క్లిక్ చేయకుండా, నేరుగా బ్రాండ్ అధికారిక యాప్‌నే ఉపయోగించడం లేదా బ్రౌజర్‌లో పోర్టల్ అడ్రెస్‌ని స్వయంగా టైప్ చేయడం మంచిదని పేర్కొంది.
తెలిసే సరికే ఆలస్యం..
→ వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ దగ్గర పడే కొద్దీ రైలు, ఫ్లయిట్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ, ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లు మొదలైన వాటిని ఉపయోగించడం పెరుగుతుంది. ఇదే అదనుగా, సిసలైన వాటిలా అనిపించే నకిలీ బుకింగ్ ఇంటర్‌ఫేస్‌లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీ ఆఫర్లతో నేరగాళ్లు మోసం చేస్తారు.
→ మంచి ఆఫర్ల కోసం అన్వేíÙంచే యూజర్లను నకిలీ వెబ్‌సైట్ల వైపు మళ్లిస్తుంటారు. వాటిలోని మాల్‌వేర్‌లతో బ్యాంకింగ్ వివరాలను తస్కరిస్తారు. మొబైల్స్‌కి పండుగ గ్రీటింగ్ ఈ–కార్డుల రూపంలో ట్రోజన్లను పంపించి కాంటాక్టు లిస్టులను సంగ్రహిస్తారు. ఓటీపీలను దారి మళ్లిస్తారు. తమ వ్యక్తిగత, పేమెంట్ వివరాలన్నీ క్రిమినల్స్ చేతుల్లోకి చేరిపోయాయని బాధితులకు తెలిసేసరికే ఆలస్యమైపోతుంది.
→ ఇక ఇన్‌స్టంట్ రుణాల యాప్‌లది మరో తీరు. వీటిని ఒక్కసారి ఇన్‌స్టాల్ చేస్తే, కాంటాక్టులు, ఎస్‌ఎంఎస్‌లు ఇలా ప్రతి దానికీ పర్మిషన్లు అడుగుతాయి. బాధితుల స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా మోసపూరిత మెసేజీలను పంపిస్తుంటాయి.