breaking news
Quick Heal
-
సెలబ్రేషన్స్ ముసుగులో సైబర్ ట్రాప్స్..!
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో ఆదమరిచి ఉన్న తరుణంలో సైబర్ మోసాల విషయంలో జాగ్రత్త వహించాలని సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ క్విక్ హీల్ టెక్నాలజీస్ హెచ్చరించింది. ఫేక్ బుకింగ్ ఇంటర్‌ఫేస్‌లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీలు, నమ్మశక్యం కాని బూటకపు ఈ–కామర్స్ ఆఫర్లతో మోసగాళ్లు గాలం వేసే ముప్పు ఉందని పేర్కొంది. నకిలీ టికెట్ల సైట్లు, మోసపూరిత లింకులు, ఫిషింగ్ పేజీలకు దారి తీసే యూపీఐ పేమెంట్ రిక్వెస్టుల రూపంలో ఈ దాడులు జరగొచ్చని పేర్కొంది. అలాగే, అప్పటికప్పుడు రుణాలిచ్చేస్తామని ఆకర్షించే క్రెడిట్, లోన్ యాప్‌లు కూడా మందుపాతరల్లాంటివని ఒక ప్రకటనలో వివరించింది. అన్నింటికీ పరి్మషన్లు కావాలంటూ అడిగే ఫేక్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. సాధారణంగా పండుగల సందర్భంగా డాండియా, ఇతరత్రా కార్యక్రమాల కోసం బుక్ చేసుకునే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని క్విక్ హీల్ తెలిపింది. ఆగస్టు నుంచి డిసెంబరు దాకా సాగే పండుగల నెలల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఇలాంటి ఉదంతాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఔట్‌డేటెడ్ సాఫ్ట్వేర్ వల్లే ఈ తరహా మోసాలు జరుగుతుంటాయి కాబట్టి, యూజర్లంతా ఎప్పటికప్పుడు యాంటీవైరస్‌లను, సిస్టమ్ ప్యాచ్‌లను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. డీల్స్ విషయంలో సందేహం కలిగితే ఎంబెడెడ్ లింకులను క్లిక్ చేయకుండా, నేరుగా బ్రాండ్ అధికారిక యాప్‌నే ఉపయోగించడం లేదా బ్రౌజర్లో పోర్టల్ అడ్రెస్‌ని స్వయంగా టైప్ చేయడం మంచిదని పేర్కొంది. తెలిసే సరికే ఆలస్యం.. → వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ దగ్గర పడే కొద్దీ రైలు, ఫ్లయిట్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ, ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లు మొదలైన వాటిని ఉపయోగించడం పెరుగుతుంది. ఇదే అదనుగా, సిసలైన వాటిలా అనిపించే నకిలీ బుకింగ్ ఇంటర్‌ఫేస్‌లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీ ఆఫర్లతో నేరగాళ్లు మోసం చేస్తారు. → మంచి ఆఫర్ల కోసం అన్వేíÙంచే యూజర్లను నకిలీ వెబ్సైట్ల వైపు మళ్లిస్తుంటారు. వాటిలోని మాల్వేర్లతో బ్యాంకింగ్ వివరాలను తస్కరిస్తారు. మొబైల్స్‌కి పండుగ గ్రీటింగ్ ఈ–కార్డుల రూపంలో ట్రోజన్లను పంపించి కాంటాక్టు లిస్టులను సంగ్రహిస్తారు. ఓటీపీలను దారి మళ్లిస్తారు. తమ వ్యక్తిగత, పేమెంట్ వివరాలన్నీ క్రిమినల్స్ చేతుల్లోకి చేరిపోయాయని బాధితులకు తెలిసేసరికే ఆలస్యమైపోతుంది. → ఇక ఇన్స్టంట్ రుణాల యాప్‌లది మరో తీరు. వీటిని ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే, కాంటాక్టులు, ఎస్ఎంఎస్లు ఇలా ప్రతి దానికీ పర్మిషన్లు అడుగుతాయి. బాధితుల స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా మోసపూరిత మెసేజీలను పంపిస్తుంటాయి. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఎదురుదెబ్బ!
సాక్షి,ముంబై:భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌ల వరుస రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ ఆఫీసర్(CISO)ఉన్న విశాల్ సాల్వి ఇన్ఫోసిస్‌కు గుడ్ బై చెప్పారు.అంతేకాదు సైబర్ సెక్యూరిటీ సంస్థకు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు కూడా. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) ఈ రంగంలో 29 ఏళ్ల అనుభవం ఉన్న సాల్వి గత ఏడేళ్లుగా ఇన్ఫోసిస్‌కు CISOగా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్‌హీల్ కి నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ పరిశ్రమలో విశ్వసనీయ సంస్థగా ఉన్న క్విక్ హీల్ టీంకు నాయకత్వం వహించడం చాలా సంతోషకరమైన విషయమని విశాల్ ఒక ప్రకటనలో తెలిపారు.సైబర్ భద్రతను అందరికీ ప్రాథమిక హక్కుగా మార్చే భాగస్వామ్య లక్ష్యానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నాన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అపారమైన అనుభవం ఉన్న సాల్వి ఇన్ఫోసిస్కంటే ముందు PwC, HDFC బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్, క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి సంస్థల్లో కీలక పాత్రల్లో పనిచేశారు. అలాగే క్విక్ హీల్ కైలాష్ కట్కర్ సీఎండీగా ఉంటారు.మరోవైపు కొత్త నాయకత్వ నియామకంపై కైలాష్ కట్కర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కస్టమర్ సెంట్రిసిటీ ఇన్నోవేషన్‌తో మా చోదక శక్తిగా, క్విక్ హీల్ వ్యక్తులు, సంస్థలు, దేశాలకు తమ భద్రతా సేవల్ని కొనసాగుతుయన్నారు. విశాల్ సాల్వితో కలిసి, దేశంలోని సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్‌ని మార్చేందుకు గ్లోబల్ మ్యాప్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) కాగా ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీ నుంచి ఉన్నతాధికారి వైదొలగడం ఇదే తొలిసారి కాదు. జూన్ నెలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన్నేపల్లి నర్సింహారావు కూడా కంపెనీకి (టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు) రాజీనామా చేశారు. 20 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్‌లో చేరిన మన్నేపల్లి హైదరాబాద్ సెంటర్‌కి హెడ్‌గా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రెసిడెంట్ మోహిత్ జోషి ఇన్ఫోసిస్‌ను వీడి టెక్ మహీంద్రా సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ప్రెసిడెంట్ రవికుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా చేరారు. ఇక ఇన్ఫోసిస్‌కు గుడ్‌బై చెప్పిన సుదీప్ సింగ్ ఇన్ఫోటెక్ సీఈవోగా చేరిన సంగతి తెలిసిందే. -
గుడ్‌న్యూస్: క్విక్ హీల్ న్యూ వెర్షన్ 23 లాంచ్
పుణె: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందించే ‘క్విక్ హీల్’ మాల్వేర్ను గుర్తించే ‘వెర్షన్ 23’ని విడుదల చేసింది. వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడమే కాకుండా, ముప్పు తీవ్రతను అంచనా వేస్తుందని కంపెనీ తెలిపింది. లోతైన విశ్లేషణ టూల్స్‌తో దాడులను నిరోధిస్తుందని వెల్లడించింది. దీనివల్ల సైబర్ దాడుల ముప్పును గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ర్యామ్‌సమ్‌వేర్ నుంచి రక్షణ, ఎప్పటికప్పుడు ఇంజన్ స్కానింగ్, యాంటీ ట్రాకర్, బ్రీచ్ అలర్ట్ తదితర ఫీచర్లతో ఈ నూతన టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపింది. ‘‘కరోనా సంక్షోభం తర్వాత సైబర్ దాడులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఈ దాడులు ఎంతో అత్యాధునికంగా ఉంటున్నాయి. కనుక వీటిని సాధారణ యాంటీ వైరస్లు గుర్తించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెర్షన్ 23ని రూపొందించాం’’అని క్విక్ హీల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ తెలిపారు. -
క్విక్ హీల్- బజాజ్ ఫైనాన్స్‌కు Q4 షాక్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో ఐటీ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ సర్వీసులు అందించే క్విక్ హీల్ టెక్నాలజీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే విధంగా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నిరాశామయ పనితీరు ప్రదర్శించడంతో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. క్విక్ హీల్ టెక్నాలజీస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐటీ, డేటా సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే క్విక్ హీల్ టెక్నాలజీస్ నికర లాభం 71 శాతం పడిపోయి రూ. 8 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు సైతం 25 శాతం క్షీణించి రూ. 64 కోట్లను తాకాయి. పన్నుకు ముందు లాభం 75 శాతం క్షీణించి రూ. 10.2 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో క్విక్ హీల్ టెక్ షేరు 10.5 శాతం కుప్పకూలింది. రూ.104 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో బజాజ్ ఫైనాన్స్ రూ. 948 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4తో పోలిస్తే ఇది 19 శాతం క్షీణతకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 36 శాతం పెరిగి రూ. 7231 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 5 శాతం పతనమై రూ.1896 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1865 వరకూ దిగజారింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం! బజాజ్ గ్రూప్‌లోని ఈ ఎన్బీఎఫ్సీ కంపెనీలో ప్రమోటర్లకు 56.2 శాతం వాటా ఉంది. -
లిస్టింగ్ లో క్విక్ హీల్ కుదేలు..
సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ క్విక్‌హీల్ టెక్నాలజీస్.. లిస్టింగ్ రోజున భారీగా క్షీణించింది. ఇష్యూ ధర రూ. 321తో పోలిస్తే బీఎస్ఈలో దాదాపు 20.73 శాతం నష్టపోయి రూ. 254.45 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో 23.3 శాతం మేర క్షీణించి రూ. 246 స్థాయిని కూడా తాకడం గమనార్హం. ఇక ఎన్ఎస్ఈలోనూ 20.91 శాతం పతనంతో రూ. 253.85 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,782 కోట్లుగా ఉంది. ఈ ఏడాది లిస్టయిన కంపెనీల్లో టీమ్‌లీజ్ సర్వీసెస్, ప్రెసిషన్ క్యామ్‌షాఫ్ట్స్ తర్వాత క్విక్‌హీల్ మూడోది. ఫిబ్రవరి 10తో ముగిసిన ఐపీవోలో కంపెనీ రూ. 451 కోట్లు సమీకరించింది. ఇష్యూ ధర రూ. 311-321 శ్రేణిలో ఉండగా.. ఇష్యూ 11 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. చివరికి రేటును రూ. 321గా నిర్ణయించారు. మరోవైపు క్విక్‌హీల్ పూర్తి షేర్‌హోల్డింగ్ వివరాలు వెల్లడించలేదంటూ ఎన్సీఎస్ కంప్యూటెక్ సంస్థ ఎండీ మనోహర్ మలానీ సెబీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.