క్విక్ కామర్స్ కంపెనీల నియామకాలు అప్
5,00,000 నుంచి 7,00,000 మందితో సేవలు
జాబితాలో స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్
మెట్రో నగరాలలో సేవలకు పెరిగిన డిమాండ్
కరోనా మహమ్మారి తలెత్తిన తదుపరి దేశీయంగా ఊపిరిపోసుకున్న క్విక్ కామర్స్ సర్వీసులు మరింత క్విక్‌గా విస్తరిస్తున్నాయి. నిజానికి తొలుత ఈకామర్స్ కంపెనీల సర్వీసులకు డిమాండ్ ఊపందుకోగా.. ఆపై ఇది క్విక్ సర్వీస్ కంపెనీలకు వ్యాప్తించింది. దీంతో గిగ్ వర్కర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం గిగ్ వర్కర్ల భద్రతకు కొత్త చట్టాలను తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాలు చూద్దాం..
దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటా క్లిక్ తదితర పలు ఈకామర్స్ దిగ్గజాలు ఇంటివద్దకే వస్తువులను అందించడం ద్వారా సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. ఈ బాటలో ఫుడ్ డెలివరీ కోసం ఏర్పాటైన ఎటర్నల్(గతంలో జొమాటో), స్విగ్గీ వేగవంత సర్వీసులను అందించడం ద్వారా పలు నగరాలలో చొచ్చుకుపోయాయి. గ్రోసరీస్‌ను త్వరితగతిన అందించేందుకు తెరతీసిన బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ సైతం వినియోగదారులను త్వరితగతిన ఆకట్టుకున్నాయి.
మరోపక్క అర్బన్ కంపెనీ, నోబ్రోకర్ తదితరాలు గృహ పరిరక్షణ, వస్తు సేవల సంబంధ సర్వీసులను సైతం అందించడం ద్వారా వేగంగా బిజినెస్‌ను విస్తరిస్తున్నాయి. కాగా.. 10 నిముషాలలో గ్రోసరీస్‌ను డెలివరీ చేయడం ద్వారా ప్రధానంగా బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ బిజినెస్‌లను భారీగా విస్తరిస్తున్నాయి. ఇవికాకుండా క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలను సమకూర్చేందుకు ఆవిష్కృతమైన ఓలా, ఉబర్, ర్యాపిడో సైతం ప్రధాన నగరాలలో సర్వీసులను భారీగా విస్తరిస్తున్నాయి. వెరసి కొద్ది నెలలుగా గిగ్ వర్కర్లకు దేశీయంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
గ్రోసరీ డెలివరీలు జూమ్
బ్లింకిట్(ఎటర్నల్), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ సుమారు 10 నిముషాల్లోనే వినియోగదారులకు సరుకులను డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఇందుకు భారీస్థాయిలో డెలివరీ వర్కర్లను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా సరుకులను నిల్వపెట్టుకునేందుకు వీలుగా డార్క్ స్టోర్లను సైతం విస్తారంగా ఏర్పాటు చేస్తున్నాయి. తద్వారా ఆయా ప్రాంతాలలో వేగవంత డెలివరీలను చేపట్టగలుగుతున్నాయి. దీనిలో గిగ్ వర్కర్లే ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో భారీగా నియమించుకుంటున్నాయి.
70–80% అప్
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వినియోగదారులను ఆకట్టుకుంటుండటంతో వినియోగదారుల ఇంటివద్దకే డెలివరీలు అందించేందుకు గిగ్ వర్కర్ల నియామకం ఇటీవల ఊపందుకుంది. ఫలితంగా బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో సగటున నెలకు 4,50,00 నుంచి 5,00,000 మందిని నియమించుకుని సర్వీసులు అందిస్తున్నాయి. ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, మానవ వనరుల సంస్థలు అందించిన వివరాల ప్రకారం గతేడాది(2024)లో ఈ కంపెనీలన్నీ సగటున 2,50,000 నుంచి 3,00,000 మందిని వినియోగించుకున్నాయి. ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలాన్ని తీసుకుంటే జొమాటో 5.5 లక్షల మంది నెలవారీ యాక్టివ్ డెలివరీ పార్ట్‌నర్స్‌తో బిజినెస్ నిర్వహిస్తోంది. మాతృ సంస్థ ఎటర్నల్ వివరాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 11 శాతం అధికం. స్విగ్గీ మరింత అధికంగా 6.9 లక్షల మందిని డెలివరీ సర్వీసులకు వినియోగించుకుంటోంది. గతేడాదితో పోలిస్తే సంఖ్య 32 శాతం జంప్‌చేసింది.
ప్రధాన నగరాల హవా
ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన నగర ప్రాంతాలలో క్విక్ సర్వీసులకు భారీ డిమాండ్ కనిపిస్తున్నట్లు స్టాఫింగ్ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇటీవల ఫుడ్ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్విక్ కామర్స్ కంపెనీలు వేతన సంబంధ ప్రోత్సాహకాలివ్వడం ద్వారా డెలివరీ పార్ట్‌నర్స్‌ను సర్వీసులలో కొనసాగించుకోగలుగుతున్నట్లు తెలియజేశాయి. డార్క్ స్టోర్లలో విశ్రాంతికి సైతం వీలుండటం డెలివరీ పార్ట్‌నర్స్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు
వివరించాయి.
డెలివరీల జోరు
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో బ్లింకిట్ 22.3 కోట్ల ఆర్డర్లను డెలివరీ చేసింది. వార్షికంగా ఇది 140 శాతం పురోగతికాగా.. ఇన్‌స్టామార్ట్ 49 శాతం అధికంగా 10.1 కోట్ల డెలివరీలను పూర్తిచేసింది. బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ అంచనాల ప్రకారం ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీల 10 నిముషాల డెలివరీలు నిర్వహించేందుకు 2030కల్లా 15 లక్షల మంది పార్ట్‌నర్స్‌ను నియమించుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా డార్క్ స్టోర్ల ద్వారా ఇందుకు దన్నుగా ప్యాకింగ్, పికప్ సేవలకు మరో 2,00,000 నుంచి 3,00,000 మంది గిగ్ వర్కర్స్ అవసరం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే బ్లింకిట్ 1,816 డార్క్ స్టోర్లను ఏర్పాటు చేసుకోగా.. ఇన్‌స్టామార్ట్ 1,102 స్టోర్లు, జెప్టో 1,000 స్టోర్లు నిర్వహిస్తున్నాయి. 2027కల్లా మొత్తం డార్క్ స్టోర్లను 3,000కు పెంచుకోవాలని బ్లింకిట్ ప్రణాళికలు అమలు చేస్తుండటం గమనార్హం!
– సాక్షి, బిజినెస్ డెస్క్
Quick Commerce (1166213)e-commerce (756092)gig workers (1163850)huge demand (1057581)Central Government (1166326)New laws (107113


