పెర్ఫ్యూమ్‌ బ్రాండ్లకు నిధుల పరిమళం | Explore India booming perfume market 2026 | Sakshi
Sakshi News home page

పెర్ఫ్యూమ్‌ బ్రాండ్లకు నిధుల పరిమళం

Jan 11 2026 6:34 AM | Updated on Jan 11 2026 6:34 AM

Explore India booming perfume market 2026

దేశీ ఫ్రాగ్రెన్స్‌ మార్కెట్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి 

6 మిలియన్‌ డాలర్లు సేకరించిన మియోలా 

ఫ్రాగానోట్స్‌కి 1 మిలియన్‌ డాలర్లు

సాక్షి, బిజినెస్‌ డెస్క్: కొంతకాలంగా దేశీ ఫ్రాగ్రెన్స్‌ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త తరం లగ్జరీ పెర్ఫ్యూమ్‌ బ్రాండ్లు పెద్ద ఎత్తున నిధులను సమీకరిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఫ్రాగానోట్స్‌ గతేడాది ఆగస్టులో రుకమ్‌ క్యాపిటల్‌ నుంచి ప్రీ–సిరీస్‌ ఫండింగ్‌ కింద 1 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. 

అటు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిరా ఫ్రాగ్రెన్సెస్‌ మాతృ సంస్థ మియోలా గతేడాది అక్టోబర్‌లో ప్రీ–సిరీస్‌ ఎ రౌండ్‌ కింద 6 మిలియన్‌ డాలర్లను సమకూర్చుకుంది. 

ఇక ఇండోర్‌కి చెందిన హౌస్‌ ఆఫ్‌ ఈఎం5 సంస్థ బోట్‌ సహవ్యవస్థాపకుడు అన్‌ గుప్తా నుంచి నిధులు సేకరించింది. ఇప్పటివరకు రూ. 5–6 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. మరోవైపు, గుజరాత్‌కి చెందిన అదిల్‌ ఖాద్రి బ్రాండ్‌.. షార్క్‌ ట్యాంక్‌ ఇండియా షోలో రూ. 50 లక్షల ఫండింగ్‌ దక్కించుకుంది. 2023లో ఏర్పాటైన గుడ్‌మెల్ట్స్‌ అనే బ్రాండ్‌ కూడా ఆనికట్‌ క్యాపిట్ల నుంచి ప్రీ–సీడ్‌ ఫండింగ్‌ని సమకూర్చుకుంది.  

భారీగా కార్యకలాపాల విస్తరణ.. 
శశాంక్‌ చౌరీ ప్రారంభించిన హౌస్‌ ఆఫ్‌ ఈఎం5 తొలి ఏడాదిలో (2022–23) కేవలం 900 ఆన్‌లైన్‌ ఆర్డర్లను ప్రాసెస్‌ చేసింది. ప్రస్తుతం రోజుకు 2,000 ఆర్డర్లు, నెలకు దాదాపు 80,000 పైగా బాటిల్స్‌ని విక్రయిస్తోంది. కంపెనీ కస్టమర్లలో అత్యధిక శాతం వాటా 28–45 ఏళ్ల వారిదే ఉంటోంది. గత మూడేళ్లలో హౌస్‌ ఆఫ్‌ ఈఎం5 సుమారు రూ. 200 కోట్ల టర్నోవరు సాధించింది. వచ్చే మూడేళ్లలో రూ. 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆఫ్‌లైన్‌లో కూడా కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఆ తర్వాత అమెజాన్‌ ఫస్ట్‌ ద్వారా గ్లోబల్‌గా కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది.

 తమ కంపెనీ లాభాల్లోనే కొనసాగుతోందని, ఇన్వెస్టర్లు ఆసక్తిగానే ఉన్నా, ప్రస్తుతం మరిన్ని నిధులు సమీకరించాల్సిన తక్షణ అవసరమేమీ లేదని శశాంక్‌ తెలిపారు.  మరోవైపు, 2018లో ప్రారంభమైన ఆదిల్‌ ఖాద్రి ప్రీమియం సెగ్మెంట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ప్రతి నెలా రూ. 11–12 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. థర్డ్‌ పార్టీ తయారీ సంస్థ భాగస్వామ్యంతో నాలుగైదు నెలలకు సరిపడ నిల్వలను ఉత్పత్తి చేసి పెట్టుకుంటోంది. అంతర్గతంగా నిధులతోనే విస్తరణ చేపడుతోంది. హైదరాబాద్‌తో పాటు ముంబై, లక్నో, జైపూర్, సూరత్, అహ్మదాబాద్‌ తదితర నగరాల్లో దాదాపు 50 స్టోర్స్‌ నిర్వహిస్తోంది. వచ్చే రెండున్నర–మూడేళ్లలో స్టోర్స్‌ సంఖ్యను 111కి పెంచుకునే యోచనలో ఉంది. 

2 బిలియన డాలర్ల మార్కెట్‌.. 
దేశీఫ్రాగ్రెన్స్‌ మార్కెట్‌ పరిమాణం ప్రస్తుతం సుమారు 2 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఓ నివేదికలో తెలిపింది. ఇది 2030 నాటికి 4.08 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పెర్‌ఫ్యూమ్‌ బ్రాండ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. 
2022లో గరిమా కక్కర్‌ ప్రారంభించిన ఫ్రాగానోట్‌ వచ్చే రెండేళ్లలో మెట్రోల్లో ఆఫ్‌లైన్‌ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. అలాగే వారణాసి, సోలన్‌లాంటి ప్రాంతాల్లోనూ విస్తరిస్తోంది. అటు అంతర్జాతీయ మార్కెట్లపైనా దృష్టి పెడుతోంది. ప్రధానంగా వచ్చే మూడేళ్లలో ప్రీమియం 
అఫోర్డబుల్‌ సెగ్మెంట్లో స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అటు హీరా ఫ్రాగ్రెన్సెస్‌ మాతృ సంస్థ మియోలా కూడా వచ్చే 12–18 నెలల్లో కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉంది. ఇటీవలే సమీకరించిన నిధుల్లో నుంచి సుమారు 2–2.2 మిలియన్‌ డాలర్లను ఇందుకోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement