విధుల్లో చేర్చుకోవాలని అదనపు కలెక్టర్‌ను కలిసిన మహిళ
దేవునిపల్లి పీఎస్ లో కేసు నమోదు
కామారెడ్డి క్రైం: నకిలీ నియామక పత్రంతో వచ్చిన ఓ మహిళ పోస్టింగ్ ఇవ్వాలని జిల్లా అధికారులను కలవడం కామారెడ్డి కలెక్టరేట్లో కలకలం సృష్టించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాను ఐఏఎస్ సాధించాననీ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తనను భూ రికార్డులు, కొలతల విభా గం అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేర్చుకోవాలని మంగళవారం ఓ మహిళ తప్పుడు నియామక పత్రంతో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్‌ను కలిసింది. నకిలీ నియామక పత్రం అని గుర్తించిన జిల్లా అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దేవునిపల్లి పోలీసులు సదరు మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. ఆమెను హైదరాబాద్ కు చెందిన నుస్రత్ జహాన్‌గా గుర్తించారు. రెవెన్యూశాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి నియామకపత్రం వచ్చిందని ఆమె చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళపై చీటింగ్, ఫోర్జరీ కేసులను నమోదు చేసి నోటీసులు జారీ చేశామని కామారెడ్డి రూరల్ సీఐ రామన్ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆమె గతంలో సివిల్స్‌కు ప్రిపేర్ అయినట్టు తెలిసింది. ఆమె ఎందుకు ఇలా చేసిందో ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఇలా చేసిందని సమాచారం. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని సీఐ అన్నారు.


