
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్‌లోనే బాలుడు ఉంటున్నాడు. బాలుడిని కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడిన బాలుడు.. చోరీ చేశాడు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్న బాలుడు.. ఆ కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీశాడు.
దొంగతనం ఎప్పుడు? ఎక్కడ ఎలా చేయాలి?. చేసే సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో పక్కాగా ప్లాన్ చేసిన బాలుడు.. బాలిక ఇంట్లో చొరబడి రూ. 80 వేలు దొంగతనం చేశాడు. ఇంకా డబ్బులు కాజేసేందుకు ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలుడిని చూసి సహస్ర కేకలు వేయడంతో ఆమెపై దాడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని సహస్రపై విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు.
హత్య చేసిన తర్వాత పక్క బిల్డింగ్‌లో 15 నిమిషాల పాటు బాలుడు దాక్కున్నాడు. ఈ సమాచారాన్ని స్థానికంగా ఉండే ఓ ఐటీ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఐటీ ఉద్యోగి సమాచారం ఆధారంగా బాలుడిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో బాలుడూ ఎంతకీ నోరు విప్పకపోవడంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాలుడు చదువుకుంటున్న స్కూల్‌కు వెళ్లి కూడా ఎస్‌వోటీ పోలీసులు విచారించారు.
ఇక బాలిక కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానికుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. తనీఖీల్లో బాలుడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బాలుడి ఇంట్లో జరిపిన సోదాల్లో సహస్రను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. వచ్చీరాని ఇంగ్లీష్‌లో దొంగతనం ఎలా చేయాలో బాలుడు నేర్చుకున్నాడు. హౌటూ ఓపెన్ డోర్, హౌటూ ఓపెన్ గాడ్ హుండీ ఇలా నెట్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ పేపర్ మీద రాసుకున్నాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
