
‘కేబుల్’ విద్యుదాఘాత మరణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
పుట్టిన రోజునే తండ్రి చితికి కొడుకు నిప్పుపెట్టాల్సిన పరిస్థితా?
దీనికి బాధ్యులెవరో ప్రభుత్వం చెప్పాలి.. అనుమతిలేని కేబుళ్లను తొలగించాల్సిందే
ఎయిర్‌టెల్ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పుట్టిన రోజునే తండ్రికి కొడుకు తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి చోటుచేసుకున్నందుకు సమాజం సిగ్గుతో తలదించుకోవాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులతో కేక్ కట్ చేయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు కన్నీటిపర్యంతం కావడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలుడి హృదయం పగిలిపోయిందని.. దీనికి బాధ్యులెవరో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాల్సిందేనని అభిప్రాయపడింది. వైర్లతో విద్యుత్ స్తంభాలు, మామూళ్లతో కొందరి జేబులు బరువెక్కి కిందకు వంగుతున్నాయని చురకలంటించింది. అనుమతి లేని కేబుళ్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది.
అనుమతి ఉన్నా ప్రమాదకరంగా ఉంటే వాటిని కూడా తీసేయాలని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో శ్రీకృష్ణుడి శోభాయాత్ర సందర్భంగా భక్తులు లాగుతున్న రథానికి విద్యుదాఘాతం జరిగి ఐదుగురు మృతి చెందడం, పాతబస్తీలో మరో నలుగురు మృతిచెందిన నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్ల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం తెలిసిందే. దీన్ని సవాల్‌చేస్తూ భారతీ ఎయిర్‌టెల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు.
కరెన్సీ నోట్లు మాత్రం కనిపిస్తాయ్..
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ అనుమతులు తీసుకున్నాకే స్తంభాల ద్వారా కేబుళ్లు తీసుకున్నామని.. ప్రభుత్వం నోటీసు జారీ చేయకుండా నగరమంతా కేబుళ్లను కట్ చేయడం సరికాదన్నారు. టీజీఎస్పీడీసీఎల్ తరఫున శ్రీధర్‌రెడ్డి వాదిస్తూ నగరంలో దాదాపు 20 లక్షలకుపైగా స్తంభాలుంటే 1.70 లక్షల స్తంభాలపైనే కేబుళ్ల ఏర్పాటుకు అనుమతులున్నాయన్నారు.
పరిమితికి మించి కేబుళ్ల వల్ల స్తంభాలు వంగిపోతున్నాయన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మామూళ్లతో కొందరి జేబులు కూడా బరువెక్కి వంగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అనుమతులున్న కేబుల్ ఏజన్సీలు అనధికారిక కేబుళ్ల తొలగింపు విషయంలో విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆదేశించారు.
స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున ఏవి అనుమతులున్నవో ఏవి లేనివో గుర్తుపట్టడం కష్టంగా ఉందన్న వాదనను తోసిపుచ్చారు. అనుమతులు తీసుకోని సంస్థలు ఇచ్చిన కరెన్సీ నోట్లు మాత్రం అక్రమార్కులకు బాగా కనిపిస్తాయని చురకంటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆరు కుటుంబాలు అనుభవిస్తున్న వేదనకు సమష్టి బాధ్యత వహించాలన్నారు. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.