భారత్‌ – బ్రిటన్‌ మధ్య  స్నేహ వారధి.. పాల్‌  | Widely regarded as a bridge between India and the United Kingdom | Sakshi
Sakshi News home page

భారత్‌ – బ్రిటన్‌ మధ్య  స్నేహ వారధి.. పాల్‌ 

Aug 23 2025 6:03 AM | Updated on Aug 23 2025 8:09 AM

Widely regarded as a bridge between India and the United Kingdom

ఇండో–బ్రిటిష్‌  అసోసియేషన్‌కి శ్రీకారం 

బహుళజాతి దిగ్గజం  కపారో గ్రూప్‌ ఏర్పాటు 

సంక్షేమ కార్యక్రమాలకు  భారీగా విరాళాలు 

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్‌ పాల్‌ పంజాబ్‌లోని జలంధర్‌లో 1931 ఫిబ్రవరి 18న జని్మంచారు. ఆయన తండ్రి ప్యారేలాల్‌ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్‌ పాల్‌ 1949లో పంజాబ్‌ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్‌ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్‌లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్‌కి వెళ్లారు. 

కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్‌.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్‌ ఫౌండేషన్‌ అనే చారిటబుల్‌ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్‌ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్‌నకు స్వరాజ్‌ పాల్‌ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్‌లోనే అతి పెద్ద స్టీల్‌ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది.   

లెజెండ్‌.. 
లార్డ్‌ స్వరాజ్‌ పాల్‌ మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్‌–భారత్‌ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్‌ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్‌ వ్యవస్థాపకుడు లార్డ్‌ కరణ్‌ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.  వోల్వర్‌హ్యాంప్టన్‌ యూనివర్సిటీ చాన్సలర్‌గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చెయిర్‌ ఏంజెలా స్పెన్స్‌ పేర్కొన్నారు. 

బ్రిటన్‌లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్‌’ అని పాల్‌ను సన్‌ మార్క్‌ వ్యవస్థాపకుడు లార్డ్‌ రామీ రేంజర్‌ అభివర్ణించారు. భారత్‌–బ్రిటన్‌ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్‌లోని భారత హైకమిషన్‌ ప్రధాని మోదీ సోషల్‌ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్‌ చేసింది. ఆయన విదేశాల్లో భారత్‌కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి పేర్కొన్నారు.  

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి..  

భారత్‌–బ్రిటన్‌ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన లార్డ్‌ పాల్‌ దానికి సుదీర్ఘకాలం చైర్మన్‌గా వ్యవహరించారు. పాల్‌ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్‌ రాణి ఆయనకు నైట్‌హుడ్‌ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. 

పలు సంవత్సరాలుగా బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్‌ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ డిప్యుటీ స్పీకర్‌గా పాల్‌ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా> ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్‌ టేబుల్‌కి కో–చెయిర్‌గా వ్యవహరించారు. 

2009లో బ్రిటన్‌ మోనార్క్‌కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్‌ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్‌ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్‌ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్‌ ఫౌండేషన్‌ పేరును అరుణ అండ్‌ అంబికా పాల్‌ ఫౌండేషన్‌గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్‌లోని చారిత్రక ఇండియన్‌ జింఖానా క్లబ్‌లో లేడీ అరుణ స్వరాజ్‌ పాల్‌ హాల్‌ని ప్రారంభించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement