breaking news
Lord Swaraj Paul
-
లార్డ్ స్వరాజ్‌పాల్ కన్నుమూత
లండన్/న్యూఢిల్లీ: ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్‌లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. స్వరాజ్‌పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన దానశీలిగా ఆయన్ను అభివరి్ణంచారు. బ్రిటన్–భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు స్వరాజ్ పాల్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వ్యాపార దిగ్గజం, దానశీలి, అంతర్జాతీయంగా ప్రవాస భారతీయులకు ఆయనొక ఐకాన్ అని తెలిపారు. 1966లో కుమార్తె చికిత్స కోసం బ్రిటన్ వెళ్లిన లార్డ్ పాల్ ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ సంస్థ కపారో గ్రూప్‌ను నెలకొల్పారు. ఉక్కు, ఇంజినీరింగ్, ప్రాపర్టీ తదితర రంగాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దారు. బ్రిటన్‌లో అత్యంత సంపన్న ఏషియన్‌గా ఎదిగారు. దశాబ్దాల పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కీలకంగా నిల్చారు. -
భారత్ – బ్రిటన్ మధ్య స్నేహ వారధి.. పాల్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్ పాల్ పంజాబ్‌లోని జలంధర్‌లో 1931 ఫిబ్రవరి 18న జన్మించారు. ఆయన తండ్రి ప్యారేలాల్ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్ పాల్ 1949లో పంజాబ్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్‌లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్‌కి వెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్‌నకు స్వరాజ్ పాల్ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్‌లోనే అతి పెద్ద స్టీల్ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది. లెజెండ్.. లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్–భారత్ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. వోల్వర్‌హ్యాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్‌గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చెయిర్ ఏంజెలా స్పెన్స్ పేర్కొన్నారు. బ్రిటన్‌లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్’ అని పాల్‌ను సన్ మార్క్ వ్యవస్థాపకుడు లార్డ్ రామీ రేంజర్ అభివర్ణించారు. భారత్–బ్రిటన్ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్‌లోని భారత హైకమిషన్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్ చేసింది. ఆయన విదేశాల్లో భారత్‌కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి.. భారత్–బ్రిటన్ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లార్డ్ పాల్ దానికి సుదీర్ఘకాలం చైర్మన్‌గా వ్యవహరించారు. పాల్ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్ రాణి ఆయనకు నైట్‌హుడ్ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ (Padma Bhushan) పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంవత్సరాలుగా బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్‌కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్ ఆఫ్ లార్డ్స్ డిప్యుటీ స్పీకర్‌గా పాల్ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్ టేబుల్‌కి కో–చెయిర్‌గా వ్యవహరించారు. 2009లో బ్రిటన్ మోనార్క్‌కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్ ఫౌండేషన్ పేరును అరుణ అండ్ అంబికా పాల్ ఫౌండేషన్‌గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్‌లోని చారిత్రక ఇండియన్ జింఖానా క్లబ్లో లేడీ అరుణ స్వరాజ్ పాల్ హాల్ని ప్రారంభించారు. -
మోదీతో స్వరాజ్‌పాల్ సమావేశం
ప్రధాని నరేంద్రమోదీతో గురువారం ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ భేటీ అయ్యారు. 30 నిముషాల పాటు సాగిన ఈ సమావేశంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం చర్చకు వచ్చింది. ఈ చొరవకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్వరాజ్‌పాల్ ప్రధానికి హామీ ఇచ్చారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, చైనా ఆర్థిక వ్యవస్థతో పోటీకి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సైతం పాల్ అభిప్రాయపడ్డారు. -
అపూర్వ విద్యార్థి పాల్
‘మనవళ్లూ... చూడండి. ఈ స్కూల్లోనే నేను చదువుకుని ఇంత వాడినయ్యా. నన్ను ఈ స్కూల్లో చేర్పించిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు నేను రుణపడి ఉంటా. ఇక్కడికి రావడం అద్భుత అనుభూతిని కలిగిస్తోంది. ఈ క్షణాలను మర్చిపోలేను...’ అని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త, కపారో గ్రూప్ ఫౌండర్ చైర్మన్ లార్డ్ స్వరాజ్ పాల్ (83) ఉద్వేగంతో అన్నారు. సాతంత్య్రానికి పూర్వం జలంధర్‌లో తాను చదువుకున్న దోబా ప్రైమరీ, సెకండరీ స్కూళ్లను ఆయన శనివారం సందర్శించారు. బ్రిటన్ నుంచి తన కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లను కూడా తీసుకువచ్చారు. ‘వయసు మీదపడుతోంది. మళ్లీ ఎప్పుడొస్తానో తెలియదు. మళ్లీ రాగలనా అనేది కూడా చెప్పలేను. అందుకే, నా సంతానానికి, ముఖ్యంగా నా మనవళ్లకు వారి మూలాలను చూపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకువచ్చాను...’ అని ఆయన చెప్పారు. కుమారుడు అంగద్, కోడలు మిషెల్లీ, కుమార్తె అంజలి, వారి ముగ్గురు సంతానంతో పాటు జలంధర్ వచ్చిన లార్డ్ పాల్, తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
బ్రిటన్‌లో ‘ఆసియా’ కుబేరులు హిందుజాలు
లండన్: పారిశ్రామిక దిగ్గజాలు హిందుజా సోదరులు.. వరుసగా రెండవ ఏడాదీ బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న ఆసియన్లుగా నిల్చారు. 13.5 బిలియన్ పౌండ్లకు పైగా (సుమారు రూ. 1,36,000 కోట్లు) సంపదతో ఆసియన్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. క్రితం ఏడాదితో పోలిస్తే వారి సంపద బిలియన్ పౌండ్లు పెరిగింది. ఆసియన్ మీడియా అండ్ మార్కెటింగ్ గ్రూప్‌కి చెందిన ఈస్టర్న్‌ఐ ప్రచురణ సంస్థ రూపొందించిన ఆసియన్ రిచ్ లిస్ట్ 101 జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 12 బిలియన్ పౌండ్ల సంపదతో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 2వ స్థానంలో నిల్చారు. ఇక, 750 మిలియన్ పౌండ్ల సంపదతో ఎన్నారై పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ 10వ స్థానంలో ఉన్నారు. కాగా హిందుజా గ్రూప్.. ఆసియన్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కూడా దక్కించుకుంది. అటు టాటా గ్రూప్.. ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డును అందుకుంది. బ్రిటన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రిటన్ విద్యా మంత్రి మైఖేల్ గోవ్ ఈ పురస్కారాలను అందజేశారు. సంపన్నుల జాబితాలోని 101 మంది కుబేరుల మొత్తం సంపద 52 బిలియన్ పౌండ్ల మేర ఉంటుంది. ఇది 2013తో పోలిస్తే 6 బిలియన్ పౌండ్లు అధికం.