
బాలీవుడ్‌లో కొన్నేళ్ల పాటు నెం1 అందాల నటిగా యువ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మనీషా కొయిరాలా(Manisha Koirala ). సుభాష్ ఘయ్ తీసిన 1942 ఎ లవ్ స్టోరీ సినిమా, అందులోని పాటల్లో మనీషా కొయిరాలా అందాన్ని మర్చిపోవడం అంత తేలిక కాదు అంటారు బాలీవుడ్ సినీ ప్రేమికులు. నాగార్జున సరసన క్రిమినల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది ఈ నేపాలీ సుందరి. అద్భుతమైన విజయాలను చవిచూసినా, విధి ఆమె పట్ల చిన్న చూపు చూడడంతో క్యాన్సర్ బారిన పడింది. దాంతో ఆమె జీవితం పూర్తిగా తల్లకిందులైంది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే తన వయసుకు తగిన పాత్రలతో తిరిగి బాలీవుడ్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మనీషా.. పలు విషయాలను పంచుకుంది.
అందాల నటిగా తెరపై గ్లామర్‌ను గుబాళింపజేసిన మనీషా బాలీవుడ్‌లో అనేక అఫైర్స్ వార్తలకు కూడా కేరాఫ్‌గా నిలిచింది. ‘అగ్ని సాక్షి’ (1996) సినిమాలో కలిసి నటించినప్పుడు సహ నటుడైన నానా పటేకర్‌తో సంబంధం ఏర్పడింది. అప్పటికే పెళ్లయిన నానా పటేకర్ ప్రతీ తెల్లవారుఝామున మనీషా ఇంటి నుంచి తిరిగి రావడం అనేకమార్లు వెలుగులోకి వచ్చింది. అదే విధంగా సౌదాగర్ లో నటించిన వివేక్ ముష్రాన్‌తోనూ ఆమెకు సంబంధం ఉందని వార్తలు గుప్పుమన్నాయి.
ఇక మార్కెట్ సినిమా సమయంలో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న మనీషా కి ఆర్యన్ వేద్ ప్రేమ ఓదార్చింది.. సినిమా రంగంలో మాత్రమే కాదు సినీయేతర రంగాల వారితో కూడా ఆమె సంబంధాలు అప్పట్లో బాగా వెలుగు చూశాయి. నానా పటేకర్‌తో బ్రేకప్ బాధలో ఉండగా, హుస్సేన్ బాబాయ్‌గా పేరొందిన డిజె హుస్సేన్, నేపాల్‌లోని ఆస్ట్రేలియన్ అంబాసిడర్ క్రిస్పిన్ కొన్‌రాయ్, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారి సిసిల్ ఆంథోనీ, అమెరికన్ స్పోర్ట్స్ కౌన్సిలర్ క్రిస్టోఫర్ డోరిస్...ఇలా పలువురితో ఆమె సంబంధాలు పెట్టుకుందని అప్పట్లో వెల్లడైంది. వీటన్నింటినీ వదిలించుకుని నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహాయ్‌ని 2010లో పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించినప్పటికీ ఆ బంధం కూడా రెండేళ్లోనే బెడిసి కొట్టింది.
క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత మనిషా కోయిరాలా చాలా మారిపోయింది. ‘‘ఆ వ్యాధి నాకు జీవితం విలువ తెలిసివచ్చేలా చేసింది, ఒక్క క్షణాన్ని కూడా వృధా చేసుకోకూడదని నేర్పింది. ఆ ఎదురుదెబ్బకు ముందు నేను అనేక చెత్త పనుల్లో, చెత్త సంబంధాల్లో చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను,’’ అని మనీషా ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని ఆమె అంటోంది. ‘‘ఇకపై నేను నిరర్థకమైన సంబంధాలేవీ పెట్టుకోను. ఒంటరితనం నుంచి రక్షించడానికి ఎవరైనా మగవాడు రావాలని కూడా ఎదురు చూడను. నేను సింగిల్‌నే కానీ ఒంటరిగా లేను. ఇప్పుడు నా సహవాసాన్ని నేనే ఆస్వాదించడం మొదలుపెట్టాను. నాకు లాంగ్ ట్రెక్కింగ్‌లు చేయడం ఇష్టం. దీర్ఘ ధ్యాన విరామాలు తీసుకుంటాను. అయితే నాలాగా జీవనశైలిని మార్చుకోవడానికి ఏదో పెద్ద నష్టం, కష్టం వచ్చే వరకూ ఎదురు చూడవద్దు. ఇప్పుడే మార్చుకోండి’’ అంటూ మనీషా తోటి మహిళలకు సలహా ఇస్తోంది. అనుభవం నేర్పిన పాఠాలతో ఒకనాటి సిల్వర్ స్క్రీన్ బ్యూటీ... భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటోంది. తన జీవితాన్ని ఓ పాఠంగా తీసుకోవాలని యువతులకు సూచిస్తోంది.