హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సూరి. ఈయన హీరోగా నటించి విడుదలైన గరుడన్, మామన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్‌ఎస్ ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో సూరి జాలరిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా వర్కౌట్ చేసి పూర్తిగా మారిపోయారు. రూ.75 కోట్లతో రూపొందుతున్న మండాడి సూరి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ సభ్యులు తెలిపారు.
ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ నిపుణులతో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ 40 రోజులపాటు చిత్రికరించినట్లు చెప్పారు. చిత్రంలోని బోటు ఫైట్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. దీనికి ప్రకాష్‌కుమార్ సంగీతం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి.


