సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు | Netizens Comments on Vijay Devarakonda Celebrate Party With hometown Peoples | Sakshi
Sakshi News home page

సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు

Mar 3 2026 12:00 PM | Updated on Mar 3 2026 12:39 PM

Netizens Comments on Vijay Devarakonda Celebrate Party With hometown Peoples

సతీమణి రష్మికతో పాటు విజయ్‌ దేవరకొండ తన సొంతూరులో సందడి చేశారు. పెళ్లి తర్వాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి రావడంతో స్థానికులు సంతోషించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేటలో  తమ  ఫాంహౌజ్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో భక్తిశ్రద్ధలతో గృహ ప్రవేశ పూజలు నిర్వహించారు. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే,  గ్రామస్థులకు, అభిమానులకు ఏర్పాటు చేసిన విందులో నాన్‌- వెజ్‌ ఏర్పాటు చేయడం నెట్టింట వైరల్‌ అయింది. సత్యనారాయణ స్వామి వ్రతం సమయంలో అతిథిలకు నాన్‌- వెజ్‌ ఆహారం పెట్టడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, విజయ్‌ ఇచ్చిన విందుకు గ్రామస్తులు ఫిదా అయ్యారు. చాలామంచి భోజనంతో పాటుగా అందరినీ గౌరవంగా పలకరించారని చెబుతున్నారు. 

హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి  పూజలు జరిగిన సమయంలో శాఖాహారం (వెజ్) మాత్రమే అతిథిలకు వడ్డిస్తారు. కానీ, విజయ్ దేవరకొండ  వెజ్‌తో పాటు నాన్-వెజ్ కూడా వడ్డించారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే, తెలంగాణ నెటిజన్లు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. హిందూ సంప్రదాయాల అందరూ పాటిస్తారంటూనే ప్రాంతాన్ని బట్టి కొన్ని పద్దతులు మారుతాయని చెబుతున్నారు. తెలంగాణలో భక్తితో పాటు తమ ఆహారం పట్ల  ప్రత్యేకమైన శైలి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. 

విజయ్‌ వారింట్లో  పూజ ముగిసిన తర్వాత  స్వామివారి పీఠాన్ని జరిపి ఆ కార్యక్రమాన్ని మొదట పూర్తి చేశారని చెబుతున్నారు. ఆ తర్వాతనే మాంసాహార విందును ఏర్పాటు చేశారని తెలుపుతున్నారు. తెలంగాణ‌లోని చాలా కుటుంబాల్లో ఇలాంటి ఆనవాయితీగా వస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. విజయ్‌ ఇంటికి దూరంగానే నాన్‌- వెజ్‌ ఆహారం వడ్డించారని చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో  పూజ పూర్తయిన సాయంత్రం లేదా మరుసటి రోజు తప్పకుండా విందు ఉంటుందని అందులో మాంసం వడ్డించడం సర్వసాధారణ‌మ‌ని గుర్తుచేస్తున్నారు.

సొంతిల్లు కట్టుకున్నా: విజయ్‌
స్వగ్రామం తుమ్మన్‌పేటకు మూడు దశబ్దాలుగా దూరంగా ఉన్నప్పటికీ తమ కుటుంబానికి గ్రామస్థులతో విడదీయరాని అనుబంధం ఉందని  విజయ్‌ దేవరకొండ తెలిపారు. తన తొలి పుట్టినరోజు కూడా ఇదే గ్రామంలో నిర్వహించినట్లు అమ్మా నాన్న చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. తన తండ్రి కోరిక మేరకు స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకున్నానని ఆయన అన్నారు. అందుకే తన వివాహానంతరం వ్రతం చేసి గ్రామస్థులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరు భోజనం చేసి తమను ఆశీర్వదించాలని కోరారు. తుమ్మన్‌పేట  పాఠశాలలో 9, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన  విద్యార్థులకు ఉపకారవేతనం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అచ్చంపేట పరిధిలోని 44 పాఠశాలల విద్యార్థులకు దీన్ని అమలు చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement