రాత్రికి రాత్రే ఫేమస్ అయినవారిలో మరాఠి నటి గిరిజ ఓక్ ఒకరు. ఈమె నటిగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ చిన్న ఇంటర్వ్యూ క్లిప్ వల్ల సడన్‌గా ఒక్క రోజులోనే వైరల్ అయిపోయింది. అందులో ఆమె నీలిరంగు చీర కట్టుకుని సింపుల్‌గా కనిపించింది. ఈ వైరల్ ఫేమ్ వల్ల తన సినిమాలు ఎక్కువమంది చూస్తే చాలని ఆశపడుతోంది.
అమ్మ గురించి ఎప్పుడూ..
తాజాగా తొలిసారి ఆమె తన కుటుంబం గురించి మాట్లాడింది. నేను మా అమ్మ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇన్ని గంటలు మాత్రమే పనిచేయాలనే నిబంధన అంటూ ఏమీ ఉండదు. దానివల్ల నేను కొన్నిసార్లు 10-12 గంటలపాటు షూటింగ్‌లో ఉండేదాన్ని. కొన్నిసార్లు 16 గంటలపాటు ప్రయాణించి సెట్‌కు వెళ్లేదాన్ని.
ఒంటరిగానే..
పెళ్లికి ముందు, తర్వాత కూడా ఒంటరిగానే వెళ్లేదాన్ని. కానీ రోజంతా పనిచేసి ఇంటికొస్తే.. ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. అమ్మ నాతో ఎందుకు లేదు? అనిపించేది. ఆమె నాతో లేకపోవడానికి ఓ కారణం ఉంది. నా పెళ్లవడానికి ముందే తను రెండో పెళ్లి చేసుకుంది. అయితే నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోవడం అస్సలు తట్టుకోలేకపోయాను. సైకియాట్రిస్ట్‌ను కలిశా.. 17 ఏళ్ల వయసులోనే తొలిసారి థెరపీ తీసుకున్నాను. కొన్నేళ్లపాటు ఆ థెరపీలు కొనసాగించాను.
సాక్షి సంతకం
సినిమా షూటింగ్స్‌కు వెళ్లొచ్చాక ఇంట్లో అంతా నిశ్శబ్ధంగా ఉండేది. అమ్మ నాతో ఉంటే.. ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా భోజనం సిద్ధం చేసేది, నాతో కబుర్లు చెప్పేదని ఫీలయ్యేదాన్ని.. తనను బాగా మిస్ అయ్యేదాన్ని! ఏదేమైనా అమ్మ తన జీవితాన్ని తనే నిర్మించుకుంది. ఆ వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అమ్మ ఎంతగానో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. తన రెండో పెళ్లికి నేను సాక్షి సంతకం పెట్టాను అని చెప్పుకొచ్చింది. గిరిజ ఓక్.. హిందీలో తారే జమీన్‌పర్, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్‌స్పెక్టర్ జిండె వంటి చిత్రాల్లో నటించింది. మరాఠిలో అనేక చిత్రాలు చేసింది.


