‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’కు కోత? | Government steps towards changing fee reimbursement rules | Sakshi
Sakshi News home page

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’కు కోత?

Aug 21 2025 4:41 AM | Updated on Aug 21 2025 4:41 AM

Government steps towards changing fee reimbursement rules

నిబంధనల మార్పు దిశగా సర్కారు అడుగులు

50% సబ్జెక్టులు పాసవ్వాలి.. 75% హాజరు ఉండాలి

ప్రధాన సబ్జెక్టుల్లో 60% మార్కులు రావాలి

అప్పుడు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఎంతవుతుందో నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వం

ప్రస్తుతం రీయింబర్స్‌మెంట్‌ కింద ఏటా రూ.2,350 కోట్లు చెల్లింపు

12.50 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

కొత్త నిబంధనలు వస్తే సగం మందికి కత్తెర?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు షాక్‌ ఇవ్వడానికి  ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు సగం మందిపై ప్రభావం చూపించేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కఠినమైన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు సూచించింది. మంగళవారం రాత్రి ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇంజనీరింగ్‌ ఫీజులతో పాటు, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపైనా చర్చించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు దాదాపు రూ.8 కోట్ల మేర పేరుకుపోవడంతో.. పరీక్షల సమయంలో యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ అంశాలను విద్యా, సంక్షేమ శాఖల అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు తీరును మార్చాలని, అర్హతల్లో మార్పులు చేయాలని ఆయన సూచించినట్టు సమాచారం. దీనివల్ల అర్హులైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం దీన్ని కొనసాగించాయి. లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేస్తూ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ఈ కారణంగానే ఏ ప్రభుత్వమూ ఇందులో ఏ చిన్న మార్పూ చేయడానికీ సాహసించలేదు. తాజాగా ఈ పథకం నిబంధనలు సవరిస్తే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధికారులే అంటున్నారు. 

మార్పుల ప్రభావంపై నివేదిక కోరిన ప్రభుత్వం!
ఇంజనీరింగ్, డిగ్రీ మొదలుకొని అన్ని సాంకేతిక, సాధారణ కోర్సులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అర్హతల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఒక సంవత్సరంలో 50 శాతం సబ్జెక్టులు పాసవ్వడంతో పాటు, 75 శాతం హాజరు ఉండాలనే కొత్త నిబంధన తీసుకురావాలని సీఎం సూచించినట్టు తెలిసింది. దీంతో పాటు ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో నిర్దిష్ట మార్కులను ప్రామాణికంగా తీసుకునే అంశంపైనా ఆయన అధికారులతో చర్చించినట్టు తెలిసింది. 

డిగ్రీ కోర్సుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లోపిస్తున్నాయని, ఇలాంటి వారిని రీయింబర్స్‌మెంట్‌ నుంచి తప్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదే సమయంలో సాంకేతిక విద్యకు సంబంధించి కొన్ని మార్పులపై ఈ సందర్భంగా చర్చించారు. కోర్సుకు సంబంధించిన ప్రధాన సబ్జెక్టులో విద్యార్థి కనీసం 60 శాతం మార్కులు తెచ్చుకోవాలని, వారికే రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలనే ప్రతిపాదన ముఖ్యమంత్రి తెచ్చినట్టు సమాచారం. 

ఉదాహరణకు సీఎస్‌ఈ ఎమర్జింగ్‌ కోర్సు తీసుకున్న విద్యార్థి డేటాసైన్స్‌ సబ్జెక్టులో 60 శాతం మార్కులు తెచ్చుకుని తీరాలి. ఆ విధంగా ఆయా కోర్సులకు సంబంధించిన ప్రధాన సబ్జెక్టుల్లో మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలు తీసుకొస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఎంతవరకూ ఉంటుందో నివేదిక ఇవ్వాలని సీఎం కోరినట్టు తెలిసింది.

కొత్త నిబంధనలతో కష్టమే..!
రాష్ట్రంలో ప్రతి ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్తవాళ్ళు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా రూ.2,350 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్‌ చేస్తున్నారు. బీసీలకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్‌లో మొత్తం చెల్లిస్తున్నారు. ఆపై ర్యాంకులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తారు. 

ప్రస్తుతం మొదటి ఏడాదిలో 50 శాతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు అవ్వని విద్యార్థులు దాదాపు 50 శాతం మంది ఉంటున్నారు. ఉన్నత విద్యలో కొత్తగా ప్రవేశించడం, భయం వల్ల వారికి తక్కువ మార్కులు వస్తున్నాయి. ఈ కారణంగానే తొలి ఏడాది పలు సబ్జెక్టులు మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 75 శాతం హాజరు విషయంలోనూ భిన్నాభిప్రాయాలు విన్పిస్తున్నాయి. 

యూనివర్సిటీలు డిజిటల్‌ విద్యను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కాలేజీల్లో ఫ్యాకల్టీ లేకపోవడం, కాలేజీకి వచ్చినా పాఠాలు జరగకపోవడంతో విద్యార్థులు ఆన్‌లైన్‌ బాట పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హాజరును కొలమానంగా తీసుకుంటే చాలామంది విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఇబ్బంది తప్పదని అధికారులే చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement