
భక్త స్వరూపం
నిర్మల మనస్కుడైన భక్తుడు భగవంతునితో ఎలా మమేకం కావాలో నారాయణ భట్టాత్రి ‘శ్రీమన్నారాయణీయం’లో చెబుతున్నారు. గురువాయూరు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ‘నాపై నీ కరుణ ప్రసరించే వరకూ శోకిస్తూ నీ పాదాల వద్దే నా రోజులు గడుపుతాను. నీ ఘనతను ప్రశంసిస్తూ నీ సేవలోనే జీవితం గడుపుతాను’ అంటాడు కవి. ‘నిన్ను వ్యతిరేకించే వారంతా సుఖంగా జీవితాన్ని గడుపుతుంటే నీ భక్తుడనైన నేను నానా బాధలు పొందుతున్నానెందుకు? ఇది నీకు కీర్తినిస్తుందా’ అంటాడు. ఇది చాలా సహజమైన ప్రశ్న. కవిదే కాదు, మనందరి ప్రశ్న కూడా!
కష్టాలలో, సమస్యలలో నిండా కూరుకుపోయి ఉన్న భక్త జనులు, భగవంతునిపై నమ్మిక లేని వారు సుఖంగా ఉంటే తమకెందుకు ఈ బాధలు అనుకుంటారు. అయితే, వారి సుఖం తాత్కాలికం. క్షణికం. కష్టాల భారం మోసే కొద్దీ భగవంతునిపై భక్తి, విశ్వాసాలు బలపడి, ఆత్మలో భగవానుని దర్శన మయ్యాక ఆ ఆనందం వర్ణనాతీతమని పెద్దలు చెబుతారు. ఈ పడుతున్న కష్టాలు, బాధలు అల్పంగా అనిపిస్తాయి.
ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్
కవి! తన వ్యాధి బాధ తగ్గించమని ప్రార్థించటం సుఖ జీవనం గడపటానికి కాదు. భగవంతుణ్ణి ఉపాసన చేయటానికి. ‘స్థిరమైన ధ్యానం కుదరటానికి పవిత్రమైన ఓంకారాన్ని ఎడతెగక జపిస్తూనే ఉంటాను. శ్వాసను బంధిస్తూ ప్రాణాయామం పాటిస్తాను. ప్రయత్నపూర్వకంగా నా బుద్ధిని పదే పదే నీ శారీరక ఆకృతిపై, నీ పాద పద్మాలపై నిలపటానికి ప్రయత్నిస్తాను’ అంటాడు. అలా తదేక దృష్టి దేవునిపై నిలిపినపుడు అన్య విషయాలపైకి బుద్ధి వెళ్లక, భక్తిరస పానంచే తన్మయత్వం కలిగి మనసులో ఆర్ద్ర భావం కలుగుతుంది. క్రమంగా లౌకిక విషయాలపై ఆసక్తి తరిగి, భగవంతునిపై దృష్టి నిలుస్తుంది.
– డా. చెంగల్వ రామలక్ష్మి