
ఉరుకు పరుగుల జీవితాల నుంచి ఉరుకుల పోటీల వైపు దృష్టి సారిస్తున్నారు పలువురు నగరవాసులు. నగరంలో రెగ్యులర్‌గా నిర్వహించే ఏదో ఒక మారథాన్‌లో భాగస్వాములు అవుతుంటారు కొందరు.. ఇది క్రమంగా నగరం నుంచి విదేశాలకూ వ్యాపించింది.. పలువురు ఔత్సాహికులు వెకేషన్‌తో పాటు మారథాన్ కూడా చేస్తున్నారు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మారథాన్‌లలోనూ పాలుపంచుకుంటున్నారు. మరికొందరు ఏకంగా రికార్డులవైపు పరుగు పెడుతున్నారు.. ఈ క్రమంలోనే రన్‌కేషన్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది.. మారథాన్ పరుగునే క్రమంగా వెకేషన్‌తో కలగలిపి రన్‌కేషన్ అని పిలుస్తున్నారు.. ఈ ట్రెండ్ టూరిజానికి కూడా భారీగా ఊపునిస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నమాట.
అనుభవజ్ఞులైన రన్నర్లకు, అంతర్జాతీయ రేసులు అంటే కేవలం ఒక ప్రధాన మారథాన్‌కు అర్హత సాధించడం లేదా మరో వ్యక్తిగత పరుగు పందెం వేయడం మాత్రమే కాదు.. అవి కొత్త పర్యాటక గమ్యస్థానాలను అన్వేషించడానికి ఒక అవకాశం కూడా. ‘సెలవులు ఇప్పుడు రన్ కేషన్‌లుగా మారాయి’ అని ప్రముఖ మారథాన్ రన్నర్‌లు ఈ ట్రెండ్‌ను నిర్వచిస్తున్నారు
ఈవెంట్ల కోసమే..
‘మారథాన్ టూర్‌లో పాల్గొనేవారిలో ఎక్కువ మంది పేరున్న అథ్లెట్లు కాదు, ఈవెంట్‌ల కోసం మాత్రమే శిక్షణ పొందే అమెచ్యూర్ రన్నర్లు. అందుకే మారథాన్ టూరిజం ఊపందుకుంటోంది’ అని మారథాన్ టూర్‌లను నిర్వహించే గౌరీ జయరామ్ అంటున్నారు. నగరం నుంచి పర్యాటక పరుగుల కోసం ఎంచుకుంటున్న వాటిలో దేశీయంగా ముంబైలో జరిగే టాటా ముంబై మారథాన్, అలాగే న్యూఢిల్లీ, చెన్నైలలో జరిగే రన్స్, అదే విధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిడ్నీ మారథాన్, రియో మారథాన్, అంటార్కిటికా మారథాన్, లండన్, టొరంటో, న్యూయార్క్.. వంటివెన్నో ఉన్నాయి.
మారథాన్ టూరిజం అంటే..
మారథాన్ అంటే అత్యంత సుదీర్ఘ దూరంలో పాల్గొనే పరుగు పందెం పోటీలు. రోజు రోజుకూ ఆదరణ పెంచుకుంటున్న ఈ మారథాన్ ఈవెంట్స్ దేశంలోని ప్రతి ప్రధాన నగరానికీ ఒక అలంకారంగా మారాయి. అంతర్జాతీయంగానూ అనేక నగరాల్లో విందు, వినోదాల సమ్మేళనంగా సాగే ఈ మోడ‘రన్’ ఫెస్టివల్స్.. రాను రానూ పర్యాటక ఆకర్షణగా కూడా స్థిరపడుతున్నాయి.
ఒకసారి స్థానికంగా జరిగే పరుగు పోటీలో పాల్గొని మారథాన్ రన్నర్‌గా మారిన తర్వాత కాలక్రమంలో.. ఇతర నగరాల్లోని మారథాన్స్‌లో పాల్గొనడంపై నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది. అదే మారథాన్ టూరిజంకు ఊపునిస్తోంది. ఏటా మారథాన్ టూరిజంలో పాల్గొనే భారతీయ రన్నర్లలో ఐదు రెట్లు పెరుగుదల ఉందని నిపుణులు చెబుతున్న మాట.
నిపుణుల సూచనలు..
మారథాన్ పర్యాటకులకు నగరానికి చెందిన నిపుణులు పలు సూచలను చేస్తున్నారు.. అవగాన లేకుండా, శిక్షణ లేకుండా మారథాన్‌లలో పాల్గొంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు.
ప్రయాణించే ముందు తగినంత శిక్షణ పొందాలి.
మారథాన్ పర్యటనలలో పేరొందిన మారథాన్ ప్రయాణ సంస్థలను ఎంచుకోవాలి.
స్థానిక వాతావరణ పరిస్థితులకుసంపూర్ణంగా సిద్ధం అవ్వాలి.
హ్యాండ్ లగేజీలో రేస్ డే పరికరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ఆతిథ్య దేశంలో అత్యవసర కాంటాక్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలి.
మారథాన్ టూరిజం కోసం ప్రణాళిక సాధారణంగా ఆరు నెలల ముందుగానే ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
సకుటుంబ సమేతంగా ‘రన్’డి..
రన్నర్లు క్రీడ పట్ల తమ మక్కువను పెంచుకుంటూనే కొత్త నగరాలు సంస్కృతీ, సంప్రదాయాలను అన్వేషించేందుకు ఈ ట్రెండ్ వీలు కలి్పస్తోంది. స్థానిక సంప్రదాయాలు హృదయపూర్వక ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ సుందరమైన ప్రకృతి దృశ్యాల మీదుగా పరుగు తీసే అవకాశాన్ని మారథాన్ టూరిజం అందిస్తోంది.
‘పని ఒత్తిడి కారణంగా, నేను నా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. మారథాన్‌ల కోసం ప్రయాణించే సమయాన్ని పాఠశాల సెలవులతో మేళవింపు చేయడం ద్వారా రన్‌కేషన్‌లో ఆ లోటు పూడ్చగలుగుతున్నా’ అని కొన్ని సంవత్సరాలుగా మారథాన్ రన్నర్‌గా ఉన్న నగరవాసి డాక్టర్ కునాల్ అంటున్నారు.
తాము పాల్గొనే మారథాన్ ఈవెంట్స్ కోసం కుటుంబాన్ని తీసుకెళ్లడం అనేది కుటుంబంతో ఒక వెకేషన్‌ను గడపడం వంటి ప్రయోజనాలతో పాటు స్ఫూర్తిని నింపుతోంది. ‘ఇది నా భార్యను మారథాన్ రన్నర్‌గా మార్చింది. ఇప్పుడు నా 14 ఏళ్ల కొడుకు 5 కె రన్నర్‌గా శిక్షణ పొందుతున్నాడు.’ అని కునాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా రన్‌కేషన్స్ నిర్వహించేందుకు ప్రత్యేక ఈవెంట్ ప్లానర్లు కూడా పుట్టుకొచ్చేశారు.
(చదవండి: నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్)