
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (Babar Azam), వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్టులు వదులుకునేందుకు వారు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న బాబర్ ఆజం, రిజ్వాన్‌కు ఆ దేశ బోర్డు వరుస షాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో జరగనున్న ఆసియాకప్ టీ20 టోర్నమెంట్‌కు ఈ ఇద్దరినీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంపిక చేయలేదు.
‘బి’ కేటగిరీలో...
అదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్టుల్లోనూ బాబర్, రిజ్వాన్‌లను ‘బి’ కేటగిరీకి పరిమితం చేసింది. కాగా.. 2025–26 ఏడాదికి గానూ పీసీబీ మంగళవారం సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది.
ఇందులో మొత్తం 30 మంది ప్లేయర్లకు అవకాశం కల్పించిన పీసీబీ... ‘ఎ’ కేటగిరీని మాత్రం ఖాళీగా వదిలేసింది. ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీల్లో పదేసి మంది ప్లేయర్లతో జాబితా విడుదల చేసింది.
‘ఈ కాంట్రాక్ట్‌లు ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు వర్తిస్తాయి. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వీటిని కేటాయించాం. ‘ఎ’ కేటగిరీకి ఎవరూ ఎంపిక కాలేదు’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఒక్కో కేటగిరీకి ఎంత మొత్తం చెల్లిస్తున్న విషయాన్ని మాత్రం పీసీబీ వెల్లడించలేదు.
వరుస వైఫల్యాలు
ఇక గతేడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు... ఈ ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, బంగ్లాదేశ్‌తో సిరీస్, వెస్టిండీస్‌తో సిరీస్‌లలో పెద్దగా ప్రభావం చూపని కారణంగా బాబర్, రిజ్వాన్‌ను ‘ఎ’ కేటగిరీ నుంచి ‘బి’కి పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. గతేడాది ‘సి’ కేటగిరీలో ఉన్న టీ20 కెప్టెన్ ఆఘా సల్మాన్ తాజగా ‘బి’ కేటగిరీలో చోటు దక్కించుకున్నాడు. సయీమ్ అయూబ్, హరీస్ రవుఫ్ కూడా ప్రమోషన్ దక్కించుకున్నారు. గతేడాది 27 మందికి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కగా... ఈ సారి ఆ సంఖ్యను 30కి పెంచారు.
వదులుకుందాం
ఈ నేపథ్యంలో.. తమ పట్ల పీసీబీ వ్యవహరించిన తీరుపై బాబర్ ఆజం, రిజ్వాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ కథనం ప్రకారం.. సెంట్రల్ కాంట్రాక్టులో తమను ‘ఏ’ కేటగిరీ నుంచి తప్పించడంపై వీరిద్దరూ ఫోన్‌లో మెసేజ్‌ల ద్వారా సంభాషించుకున్నారు.
పాక్ క్రికెట్‌కు పేరు తెచ్చిన తమను ఇంత ఘోరంగా అవమానించడమేమిటని చర్చించుకున్నారు. ఒకానొక దశలో సెంట్రల్ కాంట్రాక్టులు వదులుకోవాలని భావించారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినా పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం సీనియర్లకు ఉంటుంది.
చదవండి: సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా చరిత్ర