చేతిరాతకు ‘ఏఐ’ పవర్‌.. హైదరాబాద్ కంపెనీ సృష్టి | Hyderabad Startup ReNote AI Launches India’s First AI-Powered Smart Notebook | Sakshi
Sakshi News home page

చేతిరాతకు ‘ఏఐ’ పవర్‌.. హైదరాబాద్ కంపెనీ సృష్టి

Aug 22 2025 1:01 PM | Updated on Aug 22 2025 1:24 PM

Hyderabad Startup ReNote AI Turns Paper into Digital Power

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పుస్తకాలన్నీ డిజిటలైజ్‌ అయిపోతున్నా ఇప్పటికీ చాలా మంది పెన్నూ పేపర్‌ ఉపయోగించి చేత్తో రాయడాన్ని ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే కాగితాన్ని డిజిటల్‌తో కలిపే ఏఐ స్మార్ట్‌ నోట్‌బుక్‌ను  అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్.

టెకీ నుంచి ఎంట్రప్రెన్యూర్‌గా మారిన సుమన్ బాలబొమ్మ అభివృద్ధి చేసిన రీనోట్‌ ఏఐ నోట్‌బుక్‌ (ReNote AI Notebook) దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత నోట్‌బుక్‌గా గుర్తింపు పొందింది. ఇది సాధారణ కాగితపై రాయడం అనుభూతిని అందిస్తూ, ఆ చేతిరాతను డిజిటల్ టెక్స్ట్‌గా మార్చే ప్రత్యేకమైన సాంకేతికతను కలిగి ఉంది.

ఎన్నో ఫీచర్లు
ఈ నోట్‌బుక్‌లో నీటికి తడిసిపోని, చిరిగిపోని, రీ యూజబుల్‌ పేజీలు ఉంటాయి. పైలట్‌ ఫ్రిక్సియాన్‌ (Pilot Frixion) పెన్నుతో వీటిన రాసిన నోట్స్‌ను తుడిచేయవచ్చు. రీనోట్‌ ఏఐ మొబైల్ యాప్ ద్వారా చేతిరాతను డిజిటల్ టెక్స్ట్‌గా మార్చడం, సారాంశాలు తయారు చేయడం, తెలుగు సహా అనేక భాషల్లో అనువాదం, వాయిస్ ఆధారిత శోధన, చిత్రంగా మార్చే స్కెచ్‌లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వ టీ-హబ్‌ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ స్టార్టప్‌ జీఐటెక్స్‌ దుబాయ్‌, ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో, గిఫ్ట్స్‌ వరల్డ్‌ ఎక్స్‌పో న్యూఢిల్లీ  వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో తమ రీనోట్‌ ఏఐ నోట్‌బుక్‌ను ప్రదర్శించింది. మైటీ, గూగుల్‌ వంటి సంస్థలు ఈ యాప్‌ను భారతదేశం లోని టాప్ 100 మొబైల్ యాప్స్ లో ఒకటిగా గుర్తించాయి.

వ్యక్తిగత అనుభవాల నుంచి ప్రేరణతో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన సుమన్ బాలబొమ్మ.. "చేతిరాతలో ఉన్న ఫోకస్, జ్ఞాపక శక్తిని కోల్పోకుండా, డిజిటల్ సౌలభ్యాన్ని కలిపే ప్రయత్నమే రీనోట్‌" అని చెబుతున్నారు. ఇలాంటి ఏఐ నోట్‌బుక్‌ను ‘ఎక్స్‌నోట్‌’ (XNote) అనే అమెరికా సంస్థ కూడా రూపొందించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement