అనుపమ 'పరదా' సినిమా రివ్యూ | Paradha Movie Review: Anupama Parameswaran Shines in a Bold, Female-Centric Tale | Sakshi
Sakshi News home page

Paradha Review Telugu: 'పరదా' రివ్యూ.. అమ్మాయిలు తప్పకుండా చూడాలి!

Aug 21 2025 11:57 AM | Updated on Aug 21 2025 1:43 PM

Paradha Movie Review Telugu

'రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి'.. రీసెంట్‌గా ప్రమోషన్లలో హీరోయిన్ అనుపమ చెప్పిన మాట ఇది. చాలా నమ్మకంతో ఆగస్టు 22న రిలీజ్‌ పెట్టుకుని, రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఆ చిత్రమే 'పరదా'. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తీసిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించింది. సంగీత, మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
పడతి అనే గ్రామంలో ఈడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల ముఖానికి పరదా కప్పుకొని తిరుగుతుంటుంది. దానికి ఓ కారణం ఉంటుంది. పొరపాటున ఎవరైనా పరదా తీస్తే వాళ్లు.. గ్రామదేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే ఊరిలో ఉండే సుబ్బు(అనుపమ), రాజేశ్ (రాగ్ మయూర్) ప్రేమలో ఉంటారు. వీళ్లకీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. సరిగ్గా నిశ్చితార్థం రోజున సుబ్బు ఫొటో కారణంగా.. ఈమె ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. తన తప్పు లేదని చెబుతున్నా సరే వినరు. దీంతో అనుకోని పరిస్థితుల మధ్య సుబ్బు తన ఊరి దాటి ధర్మశాల వెళ్లాల్సి వస్తుంది. ఈమెకు తోడుగా రత్న(సంగీత), అమిష్ట(దర్శన రాజేంద్రన్) కూడా వెళ్తారు. ఇంతకీ ధర్మశాల ఎందుకు వెళ్లారు? చివరకు సుబ్బు.. పరదా తీసిందా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
గత కొన్నాళ్లలో హీరో సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కాస్త తగ్గాయని చెప్పొచ్చు. ఆ లోటుని భర్తీ చేసేందుకు వచ్చిన చిత్రమే 'పరదా'. ఇందులో హీరోహీరోయిన్లు అంటూ ఎవరూ ఉండరు. కథే మెయిన్ హీరో.

పడతి గ్రామంలో జ్వాలమ్మ జాతరతో సినిమా మొదలవుతుంది. ఈ ఊరిలోని ఈడొచ్చిన అమ్మాయిలు, మహిళలు ఎందుకు పరదా కప్పుకోవాల్సి వచ్చిందనేది మొదటి పది నిమిషాల్లోనే తోలుబొమ్మలాట కథతో చెప్పేస్తారు. తర్వాత సుబ్బు, రాజేశ్ ప్రేమ.. నిశ్చితార్థం.. అనుకోని అవాంతరం వల్ల అది ఆగిపోవడం.. ఇలా కథలో సంఘర్షణ ఏర్పడుతుంది. తన తప్పు లేదని చెబుతున్నా సరే సుబ్బుని ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు ఆదేశించడం.. తర్వాత అనుకోని పరిస్థితుల్లో సుబ్బు.. మరో ఇద్దరు మహిళలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వెళ్లాల్సి రావడం జరుగుతుంది. తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో ఏం తెలుసుకున్నారనేది తెలియాలంటే మూవీ చూడాలి.

ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిల్లో చైతన్యం పెరిగింది. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాల పేరుతో మహిళలని ఇబ్బంది పెడుతున్నారు. ఆచారం, సంప్రదాయం అని చెప్పి బయట ప్రపంచం చూడనీయకుండా చేస్తున్నారు. అలాంటి ఓ ఊరికి చెందిన అమ్మాయి.. తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఎలాంటి సాహసం చేసింది? మూఢనమ్మకాలపై ఎలా పోరాడింది అనే కల్పిత కథతో తీసిన చిత్రమే ఇది.

సినిమా ప్రారంభంలో జెయింట్ వీల్ ఎక్కడానికే సుబ్బు చాలా భయపడుతుంది. కానీ పరిస్థితుల కారణంగా ఎత్తయిన ఎవరెస్ట్ వరకు వెళ్తుంది. తనలో భయాన్ని పోగొట్టుకుంటుంది. మూవీ అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకొని ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసే సీన్‌లో సీతాకోక చిలుక రిఫరెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న ఓ గృహిణి, ఆమిష్ట ఓ ఇంజినీర్. ఈ పాత్రల్ని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు కూడా మెచ్చుకునేలా ఉంటుంది. సెకండాఫ్‌ మొదలవగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపే అయినా.. ఆయన చెప్పే ఓ స్టోరీ, డైలాగ్స్ మంచి ఎమోషనల్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో సుబ్బు పాత్ర.. దేవుడికి కట్టిన వస్త్రాల్ని తగలబెట్టే సీన్, ఊరి ప్రజల కళ్లు తెరిపించింది అనేలా విజువల్‌గా చూపించడం బాగుంది.

అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. సినిమా అంతా కూడా మహిళలు, వారి చైతన్యం అనేలా సాగుతుంది. రెగ్యులర్ ప్రేక్షకులందరికీ ఇది నచ్చకపోవచ్చు. కానీ అమ్మాయిలు మాత్రం తప్పకుండా ఈ మూవీ చూడాలి. చూస్తున్నంతసేపు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు.

ఎవరెలా చేశారు?
సుబ్బు పాత్రలో అనుపమ అద్భుతంగా నటించింది. ఈ పాత్ర ప్రారంభంలో బిడియం, భయం, ప్రేమ లాంటి అంశాలతో చలాకీగా కనిపిస్తుంది. తర్వాత సీరియస్ టోన్‌లోకి మారుతుంది. చివరకొచ్చేసరికి ఫియర్‌లెస్‌ ఉమన్‪‌గా మారడం లాంటి మార్పు కిక్ ఇస్తుంది. రత్నగా చేసిన సంగీత క్యారెక్టర్ కూడా చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతుంది. ఓ సీన్‌లో ఈమె తన భర్త క్యారెక్టర్‌తో చేసే కామెడీ భలే నవ్విస్తుంది. పెళ్లి, పిల్లలు వద్దు అంటూ ఇండిపెండెంట్‌గా ఉండే మహిళలకు దర్శన రాజేంద్రన్ చేసిన అమిష్టా క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. లీడ్ రోల్స్ చేసిన ఈ ముగ్గురు కూడా బాగా చేశారు. రాగ్ మయూర్, 'బలగం' సుధాకర్ రెడ్డి.. ఇలా మిగిలిన వాళ్లు కూడా తమ వంతు న్యాయం చేశారు.

టెక్నికల్ టీమ్ కూడా సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ కాస్త లౌడ్‌గా అనిపించింది కానీ మిగతా చోట్ల సెట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గురించి చెప్పుకోవాలి. గతంలో సినిమా బండి, శుభం అని సినిమాలు తీశాడు. అవి మోస్తరుగా అనిపించాయి కానీ ఈ మూవీతో తనలో చాలానే విషయం ఉందని నిరూపించాడు. ఫిమేల్ సెంట్రిక్ తరహా సినిమాలంటే ఇష్టముంటే మాత్రం 'పరదా' మిస్ కావొద్దు.

- చందు డొంకాన

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement