
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిక్షాత్మక సుంకాలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తప్పుబట్టారు. ట్రంప్ నిర్ణయాల కారణంగా వాషింగ్టన్- న్యూఢిల్లీ మధ్య సంబంధాలు విచ్ఛిన్నమయ్యే దశకు చేరుకున్నాయని ఆమె అన్నారు. వీటిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు.
బుధవారం ప్రచురితమైన న్యూస్‌వీక్ ఆప్-ఎడ్‌లో.. ఆమె భారతదేశాన్ని చైనా మాదిరిగా ప్రత్యర్థిగా పరిగణించరాదని అన్నారు. ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, భారత్- మధ్య సంధి కుదిర్చానంటూ అమెరికా పేర్కొనడం.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య చీలికకు కారణమవుతున్నాయని హేలీ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా భారత్- అమెరికా సంబంధాలలో విభేదాలు కనిపించాయని, ట్రంప్ యంత్రాంగం భారత్‌పై 25 శాతం సుంకాలతో దాడి చేసిందని ఆమె అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలలో అమెరికా పాత్ర లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసిందన్నారు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను సమర్థించిన నిక్కీ హేలీ ఇప్పుడు ఆయన చర్యలను తప్పుపడుతున్నారు. భారతదేశాన్ని అత్యుత్తమ ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలని, అది చైనా మాదిరిగా ప్రత్యర్థి కాదన్నారు. ఇప్పటివరకు రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఎటువంటి ఆంక్షలను విధించలేదని ఆమె పేర్కొన్నారు. ఆసియాలో చైనా ఆధిపత్యానికి దీటుటా ఎదుగుతున్న దేశంతో స్నేహ సంబంధాలను దూరం చేసుకోవడం వ్యూహాత్మక విపత్తు అవుతుందని ఆమె అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, చైనా తర్వాతి స్థానంలో ఉందని హేలీ గుర్తుచేశారు. కమ్యూనిస్ట్ నియంత్రణలో ఉన్న చైనాతో పోలిస్తే, ప్రజాస్వామ్య భారతదేశం స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరింపులకు గురిచేయదని ఆమె అన్నారు. ట్రంప్ మొదటి పరిపాలనా కాలంలో ఐక్యరాజ్యసమితికి 29వ అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ ఉన్నారు. అమెరికా అధ్యక్ష మంత్రివర్గంలో పనిచేసిన మొదటి భారతీయ అమెరికన్‌గా ఆమె పేరొందారు.