
ఆన్‌లైన్ గేమ్‌లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడంతో.. పార్లమెంటు దీనిపై కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత.. డ్రీమ్11, విన్‌జోతో సహా అనేక గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ కార్యకలాపాలను నిలిపివేసాయి.
పోకర్‌బాజీని నిర్వహిస్తున్న దాని అనుబంధ సంస్థ మూన్‌షైన్ టెక్నాలజీస్ ఆన్‌లైన్ గేమ్‌లను అందించడం ఆపివేసిందని నజారా టెక్ శుక్రవారం తెలిపింది. ఈ జాబితాలో విన్‌జో, మొబైల్ ప్రీమియర్ లీగ్, జూపీ కూడా ఉన్నాయి. డ్రీమ్ 11లో కూడా క్యాష్ గేమ్‌లను నిలిపివేసింది.
బెంగళూరుకు చెందిన గేమ్‌స్క్రాఫ్ట్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ప్రముఖ రమ్మీ ప్లాట్‌ఫామ్.. రమ్మీకల్చర్ భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో ఒపీనియన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ప్రోబో అడుగులు వేస్తూ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏ23 రమ్మీ.. ఏ23 పోకర్‌లను నిర్వహించే హెడ్ డిజిటల్ వర్క్స్.. అన్ని ఆన్‌లైన్ మనీ గేమ్‌లను నిలిపివేసింది.
ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..
ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించే బిల్లును ఎవరైనా ఉల్లంగిస్తే.. మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా లేదా రెండూ కూడా విధించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. నిబంధనలను ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చేవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం కూడా ఈ నిబంధనల్లో ఉంది.