
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ ఓ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఓ వన్డేలో అత్యధిక ఔట్ ఫీల్డ్ క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాడిగా మార్క్ టేలర్ (1992), మైఖేల్ క్లార్క్ (2004), ఆండ్రూ సైమండ్స్ (2006), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2015), మిచెల్ మార్ష్ (2016), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2017), లబూషేన్ (2024) సరసన చేరాడు. వీరంతా ఓ వన్డేలో తలో నాలుగు ఔట్ ఫీల్డ్ క్యాచ్‌లు పట్టారు.
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో గ్రీన్ ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, వియాన్ ముల్దర్, నండ్రే బర్గర్ క్యాచ్‌లు పట్టాడు. గ్రీన్‌తో పాటు మిగతా ఆసీస్ ఆటగాళ్లు కూడా మైదానంలో పాదరసంలా కదలి సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది.
మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఆ జట్టు 31 ఓవర్లలో 163 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్ (18), లబూషేన్ (1), గ్రీన్ (35), క్యారీ (13) ఔట్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (78), ఆరోన్ హార్డీ (6) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్ 2, ఎంగిడి, ముల్దర్, ముత్తుసామి తలో వికెట్ తీశారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పర్యాటక సౌతాఫ్రికా తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.