
పశుఔషధ బ్యాంక్‌కు విరాళం అందజేస్తున్న ఎన్ఆర్ఐ సుధాకర్, చిత్రంలో పెంటయ్య.
30 ఏళ్ల తర్వాత స్నేహితుడిని కలుసుకున్న ఎన్నారై
కోదాడరూరల్: తన మిత్రుడు మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను సోషల్ మీడియాలో చూసి అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కోదాడకు వచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు ఓ ఎన్నారై. వివరాలు.. సూర్యాపేట జిల్లా (Suryapet District) కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పి. పెంటయ్య, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ చప్పిడి సుధాకర్ 30 ఏళ్ల కిందట హైదరాబాద్‌లోని పశువైద్య కళాశాలలో కలిసి చదువుకున్నారు.
చదువు పూర్తయిన తర్వాత పెంటయ్య కోదాడ (Kodad) ప్రాంతంలో పశువైద్యాధికారిగా పనిచేస్తుండగా.. సుధాకర్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. డాక్టర్ పెంటయ్య కోదాడ పశువైద్యాశాలలో రైతులకు ఉపయోగపడేలా పశుఔషధ బ్యాంకును ఏర్పాటు చేసి మూగజీవాలకు చేస్తున్న వైద్య సేవలను కాలిఫోర్నియాలో ఉంటున్న అతడి స్నేహితుడు సుధాకర్ సోషల్ మీడియాలో చూశాడు. పెంటయ్య ఫోన్ నంబర్ తీసుకున్న సుధాకర్ త్వరలో కలుస్తానని అడ్రస్, లోకేషన్ షేర్ చేయమని చెప్పాడు.
కాలిఫోర్నియా (california) నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సుధాకర్ బుధవారం కోదాడకు వచ్చి తన మిత్రుడు పెంటయ్యను కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు స్నేహితులు ఆనందంలో మునిపోయారు. అనంతరం పశుఔషధ బ్యాంక్‌కు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.20 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌తో పలు రకాల పండ్ల మొక్కలను నాటించారు.