ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు
చిలుకూరు : ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ నాయకులు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారని, అదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే పార్టీ శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి సాహెబ్ అలీ, జిల్లా కార్యవర్గ సభ్యులు నంద్యాల రామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెమిడాల రాజు, జెర్రిపోతులగూడెం సర్పంచ్ గుగులోతు లలిత, ఉప సర్పంచ్ ఉద్దండు దుర్గ నాయకులు పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో
ప్రత్యేక పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణుడిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ది వీరహనుమాన్, రామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేశ్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు.
గుంత పూడ్చమంటే రాళ్లేశారు
కోదాడ : పట్టణంలోని బొడ్రాయి బజార్‌కు వెళ్లే మార్గంలో ప్రధాన కూడలి వద్ద రోడ్డు మధ్యలో గుంత ఏర్పడింది. దాంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దాంతో సమీపంలో ఓ ఇంటి స్లాబ్‌ను కూల్చగా మిగిలిన వ్యర్థాలు, రాళ్లను తీసుకొచ్చి మున్సిపల్ సిబ్బంది అందులో పోశారు. ఇన్నిరోజులు గుంతతో ఇబ్బందులు పడ్డ జనం ఇప్పుడు సిమెంట్ రాళ్ల మధ్య నుంచి వేళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్‌లైయినట్లు అయ్యింది రోడ్డు పరిస్థితి అని వాపోతున్నారు.
ధనుర్మాస పూజలు
సూర్యాపేట : పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో దనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలను నల్లాన్ చక్రవర్తుల మురళీధర్ ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం భక్తులకు అమ్మవారి ఆశీస్సులు, వేద ఆశీర్వచనము అందజేశారు. కక్కిరేణి శేఖర్, మోహన్, వెంకన్న పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు
ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు


