పట్నంలో ఓటుకు పాట్లు
మున్సిపల్ ఎన్నికల్లోనూ..
సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాంతో మున్సిపాలిటీల్లో అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, మార్పులు, చేర్పులు చేస్తుండగా.. కొందరు ఓటర్లు పల్లె నుంచి పట్నం వచ్చేందుకు యత్నిస్తున్నారు. మున్సిపాలిటీల్లోనూ ఓటు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇందుకు అవకాశం ఇవ్వకపోవడంతో నిరుత్సాహం చెందుతున్నారు.
ఇక్కడా ఓటేద్దాం
జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానమై ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు చాలామంది తమ పిల్లల చదువు, ఉద్యోగం, వ్యాపార రీత్యా సమీప మున్సిపాలిటీ కేంద్రాలకు వెళ్లి నివాసం ఉంటున్నారు. సొంతూరిలో వ్యవసాయం చూసుకుంటు గ్రామంతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని చాలా మందికి పల్లెల్లో, మున్సిపాలిటీల్లో డబుల్ ఓట్లు ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒకచోట ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వేరువేరుగా జరగడంతో పట్టణంలో, పల్లెలో ఓటు వేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు ప్రకటించిన ముసాదా జాబితాలో తమ పేరు ఉందా అని పరిశీలించుకుంటున్నారు.
ఫ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు
నమోదుకు ప్రయత్నాలు
ఫ పల్లెల్లో ఉన్న ఓటును
మార్చుకునేందుకు ఆపసోపాలు
ఫ ఓటరు తుదిజాబితాలో
చోటుకోసం యత్నం
ఫ ఓటు మార్పునకు అవకాశం
లేకపోవడంతో నిరుత్సాహం
పల్లె నుంచి పట్టణం వచ్చి అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ సొంతూరిలో ఓటు వేశారు. తిరిగి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఓటు వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి ఆయా వార్డుల్లోని వివిధ పార్టీల నాయకులు సైతం సహకరిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు పొందడం, లేదంటే ఓటు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు 2025 అక్టోబర్ 1వ తేదీన రూపొందించిన ఓటరు జాబితా ప్రకారం జరగనున్నాయి. అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా సైతం ఇదే. మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినా అది కూడా మున్సిపాలీటీల్లో ఉన్న ఓటర్లకే. ముసాయిదా జాబితాలో పొరపాటుగా పక్కపక్క వార్డులకు మారిన వాటిని మాత్రమే గుర్తించి మార్పు చేయనున్నారు. దాంతో పల్లె నుంచి పట్నంకు ఓటు బదిలీ, కొత్తగా ఓటు పొందాలన్న వారి ఆశలు ఫలించడం లేదు.


