సైదన్నా.. సౌకర్యాలు ఏవన్నా
నేనూ, మా ప్రాంతం వాళ్లు చాలా ఏళ్లుగా దర్గాకు వస్తున్నాం. కానీ ఇక్కడ ఉండేందుకు సౌకర్యాలు లేవు. సత్రాలు, వంట గదులు లేక కందూరు చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రైవేటు గదుల వాళ్లు ఇష్టం వచ్చినట్లు అడుగుతున్నారు. యాటలు కోసిన దగ్గర నుంచి పాతెహాలు సమర్పించే వరకు ప్రతి దానికీ డబ్బులు వసూలు చేస్తున్నారు.
సైదామస్తాన్, కారంపూడి, ఆంధ్రప్రదేశ్
బోర్డు ఆదేశాల మేరకు
దర్గా వద్ద కాంట్రాక్టు పద్ధతి లేదు. బోర్డు నిర్ణయాల ప్రకారం వారాని రూ. 2 లక్షలకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాం. వీరు దర్గాలో కొన్నింటికి ధరలు నిర్ణయించి భక్తుల వద్ద నుంచి తీసుకుంటున్నరు. నేను ఉద్యోగిని మాత్రమే. వక్ఫ్ బోర్డు అధికారులు చెప్పినట్లు నడుచుకోవడమే నాపని. దర్గా వద్ద కొన్ని అసౌకర్యాలు ఉన్న మాట వాస్తవమే, ఉర్సు ఉత్సవాలకు కల్పించాల్సిన వసతులపై ఎస్టిమేషన్ వేసి బోర్డుకు నివేదించా.
–మహమూద్, వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్
పాలకవీడు : సుమారు 450 ఏళ్ల చరిత్ర కలిగిన దర్గా.. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు సైదన్నా అని పిలుచుకునే ఆధ్యాత్మిక క్షేత్రం జాన్‌పహాడ్‌దర్గా. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యల్లో భక్తులు తరలివస్తారు. అయితే దర్గా వద్ద సరైన సౌకర్యాలు లేక పోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దర్గాకు ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయం వస్తున్నా, అభివృద్ధిపై వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మూడు రోజుల పాటు ఉర్సు
ఈ నెల 22, 23, 24 తేదీల్లో జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు. 23న నిర్వహించే గంధం ఊరేగింపునకు లక్షల సంఖ్యలో భక్తులు దర్గాను దర్శించుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా ఏర్పాట్ల కోసం అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపినట్లు అధికారులు చెప్పారు.
వసతులు కరువు
జాన్‌పహాడ్ దర్గా నుంచి వక్ఫ్ బోర్డుకు ప్రతి సంవత్సరం రూ.2 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. అయినా దర్గా వద్ద మౌలిక వసతులు కల్పించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తలదాచుకోవడానికి కనీసం కాటేజీలు లేవు, ఉన్నవి శిథిలావస్థకు చేరాయి. కందూరు, మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు వంట గదులు, స్నానాల గదులు లేక అన్నీ ఆరు బయటే చేయాల్సి వస్తున్నది. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు కాటేజీ నిర్వాహకులు భక్తుల వద్ద నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు.
భూములు అన్యాక్రాంతం
దర్గా చుట్టూ ఉన్న సుమారు 15 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి ఆక్రమణలకు గురవుతున్నా వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కళ్లముందే భూములు అన్యాక్రాంత మవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ ఊరుకుంటోందని పేర్కొంటున్నారు. దర్గా భూముల్లో ఆక్రమణలు తొలగించి విశ్రాంతి గదులు, కాటేజీలు, భోజనశాలలు, వంట గదులు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
భక్తుల నిలువు దోపిడీ..
దర్గాకు వచ్చే భక్తుల నుంచి కాంట్రాక్టర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. కందూరుకు యాటల సమర్పన, జెండాలు, దట్టీలు, కొబ్బరికాయలు, వాహన పూజ ఇలా ప్రతి దానికీ ప్రైవేటు వ్యక్తులు ధరలు నిర్ణయించి బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు హుండీలో వేయాల్సిన డబ్బును సైతం నిర్వాహకులు బలవంతంగా తీసుకుంటున్నట్లు భక్తులు వాపోతున్నారు. ఇక్కడ విక్రయించే సుమారు 17 రకాల వస్తువులపై వక్ఫ్‌బోర్డు కాంట్రాక్టు పద్ధతిన వేలం నిర్వహించేది. కొందరు ఈ విషయమై కోర్టును ఆశ్రయించారు. బహిరంగ వేలంపై కోర్టు స్టే విధించినా వక్ఫ్ బోర్డు అధికారులు దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో వారు అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దర్గాకు వచ్చే భక్తుల కోసం తగిన సౌకర్యాలు కల్పించాలని, వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ వసూళ్లను అరికట్టి దర్గా పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.
తాగునీటి ట్యాంకుల వద్ద అపరిశుభ్రత
శిథిలమైన కాటేజీలు
ఫ జాన్‌పహాడ్ దర్గా వద్ద కనీస
సదుపాయాలు కరువు
ఫ శిథిలావస్థలో వసతి గదులు
ఫ వంటశాలలు, స్నానాల గదులు లేక భక్తుల అవస్థలు
ఫ 22 నుంచి ఉర్సు
ఫ లక్షల్లో తరలిరానున్న భక్తులు
సైదన్నా.. సౌకర్యాలు ఏవన్నా
సైదన్నా.. సౌకర్యాలు ఏవన్నా
సైదన్నా.. సౌకర్యాలు ఏవన్నా
సైదన్నా.. సౌకర్యాలు ఏవన్నా


