అసెంబ్లీలో కృష్ణా నీళ్లపై చర్చించాలి
చివ్వెంల(సూర్యాపేట), హుజూర్‌నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణానది నీళ్ల అంశంపై అసెంబ్లీలో చర్చించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల, హుజూర్‌నగర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లకు చిత్త శుద్ధి ఉంటే ఎగువ తుంగభద్రకు జాతీయ హోదా, ఆల్మట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి –నారాయణపేట–కొడంగల్‌కు ఉమ్మడి రాష్ట్రంలో 77.5 టీఎంసీలు కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం 40 టీఎంసీలకే ఎందుకు అంగీకరించిందని ప్రశ్నించారు. దీని వల్ల పాలమూరు ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని ఎప్పటికీ క్షమించరన్నారు. హరీష్‌రావును తిడితే సమావేశాలను బహిష్కరించడం బీఆర్‌ఎస్ డ్రామానా అని ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా సభ జరిగిందన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఇస్టానుషారంగా ప్రసంగం కొనసాగించరన్నారు. నిజానికి అసెంబ్లీలో కృష్ణానది నీళ్లమీద చర్చ అన్నారు. అలాంటప్పుడు నదీ పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ,కర్ణాటకల గురించి మాట్లాడాలన్నారు. కర్ణాటక ఆల్మట్టిని 5 మీటర్లు పెంచుతూ ఉంటే సభలో దాని పై సీఎం మాట్లాడాలన్నారు. సూర్యాపేటలో మల్లుస్వరాజ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో రోడ్డు వెడల్పు పేరుతో 300 షాపులు కూల్చేశారని, 8 ఏళ్లు అవుతున్నా వారికి పరిహారం ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉన్నా సూర్యాపేట పరిస్థితులు మారలేదన్నారు. హుజూర్‌నగర్, కోదాడలో నియోజకవర్గాల్లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1450 కోట్లతో మెగా లిఫ్ట్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే అప్పట్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యతిరేకించి, ఇప్పుడు రూ.500 కోట్లు పెంచి లిఫ్ట్ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఆ మెగా లిఫ్ట్‌లో ఆయన వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షురాలు క్రిష్ణవేణి, ఇస్మాయిల్ పాల్గొన్నారు.
ఫ తెలంగాణ జాగృతి
అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత


