ఇక నుంచి ఈసీఆర్ దేశాలు 19
భారత ప్రభుత్వం ఇటీవల ఇరాన్ దేశాన్ని ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు అనుమతి అవసరమైన) దేశాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ & ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ విభాగం గత ఏడాది ఆగస్టున సర్కులర్‌ను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 18గా ఉన్న ఈసీఆర్ దేశాల సంఖ్య 19కి పెరిగింది.
ఈ నిర్ణయం ప్రకారం, ఈసీఆర్ పాస్‌పోర్టు కలిగిన భారతీయ కార్మికులు ఉద్యోగం కోసం ఇరాన్‌కు వెళ్లాలంటే ఇక నుంచి తప్పనిసరిగా భారత ప్రభుత్వ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-మైగ్రేట్ పోర్టల్‌లో నమోదైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీఓఐ) ద్వారా ఎయిర్‌పోర్టులలోని ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల (ఐసీపి) వద్ద ధృవీకరణ జరుగుతుంది.
ఇవే 19 ఈసీఆర్ దేశాలు
ఎమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఈసీఆర్ దేశాలు ఇవి: ఈ దేశాలను స్పెసిఫైడ్ / నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ గా కూడా పిలుస్తారు.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు (6): బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).
ఇతర దేశాలు (13): ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్, ఇరాన్.
ఈసీఆర్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?
ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వాయిర్డ్) పాస్‌పోర్ట్ అంటే – ఈ 19 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే ముందు, భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అర్థం.
సాధారణంగా 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. తక్కువ చదువు, తక్కువ లోకజ్ఞానం కలిగిన బలహీన వర్గాల కార్మికులను విదేశాల్లో దోపిడీ నుంచి రక్షించడమే ఈ విధాన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విదేశాల్లో శారీరక శ్రమ చేసే 'బ్లూ కాలర్ వర్కర్స్' సంక్షేమం కోసం ఈసీఆర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.
ఎమిగ్రేషన్ క్లియరెన్స్ ఎలా?
ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఈ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు, లైసెన్స్ పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ లోని 'ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్' (పిఓఈ) కార్యాలయంలోఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి.
వలస కార్మికుని పాస్‌పోర్ట్, ఉద్యోగ సంస్థ, జీతం ఒప్పందం, రిక్రూటింగ్ ఏజెన్సీ వివరాలు అన్నీ ఈ-మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు అవుతాయి.
అలాగే, ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) కింద రూ.10 లక్షల ప్రమాద బీమా తప్పనిసరిగా వర్తిస్తుంది.
రెండేళ్ల బీమాకు కేవలం రూ.325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పునరుద్ధరణ చేసుకోవచ్చు.
ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్ట్ అంటే?
ఈసీఎన్‌ఆర్ (ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్) అంటే – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అన్నమాట.
ఈసీఎన్‌ఆర్ కేటగిరీకి వీరు అర్హులు:
* 10వ తరగతి ఉత్తీర్ణులు
* విదేశాల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు
* ఆదాయపు పన్ను చెల్లింపుదారులు
* 50 సంవత్సరాల పైబడిన వారు
వీరు లోకజ్ఞానం కలిగినవారు, అవసరమైతే తమను తాము రక్షించుకునే సామర్థ్యం ఉన్నవారిగా ప్రభుత్వం భావిస్తుంది. వీరు కూడా ఐచ్చికంగా ప్రవాసి భారతీయ బీమా యోజన పొందవచ్చు.
విజిట్ / టూరిస్ట్ వీసాలకు వర్తించదు
ఏ పాస్‌పోర్ట్ కలిగిన వారైనా – విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, వైద్య అవసరాలు లేదా విహారయాత్రల కోసం ఈ 19 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు.
రాను–పోను విమాన టిక్కెట్, చెల్లుబాటు అయ్యే వీసా ఉంటే సరిపోతుంది.
–మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు 91 98494 22622


