
20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపడం వల్ల ఇంజిన్‌ల పనితీరు తగ్గిపోతుందని వార్తలు వస్తున్న వేళ.. అవన్నీ పూర్తిగా అబద్ధం అని 'నితిన్ గడ్కరీ' తోసిపుచ్చారు. 'పెట్రోలియం లాబీ' ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఇథనాల్ ఉపయోగించడం వల్ల.. ఇంజిన్‌ల పర్ఫామెన్స్ తగ్గిపోతుందనేది అబద్దం. మేము దీనిని నిరూపించడానికి ప్రస్తుతం పాత కార్లపైన ట్రయల్స్ నిర్వహించామని గడ్కరీ అన్నారు. సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా? అని కూడా పరిశీలించాము. పెట్రోలియం లాబీలో కొంతమంది తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. బ్రెజిల్‌లో వారు 27 శాతం బ్లెండింగ్ చేస్తారు. అక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన అన్నారు.
20 శాతం ఇథనాల్ ఉపయోగించడం వల్ల ఉద్గారాలు తగ్గడమే కాకుండా.. పెట్రోల్ దిగుమతి కూడా తగ్గుతుంది. ఇథనాల్ శుభ్రమైన ఇంధనం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుంది. రైతులకు సహాయపడుతుందని నితిన్ గడ్కరీ అన్నారు.
భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: రూ. 24తో ఐటీఆర్ ఫైలింగ్.. జియోఫైనాన్స్ బంపరాఫర్
బ్లెండింగ్ కార్యక్రమం గురించి ఆందోళనలు ఉన్నాయి, ఇది వాహన పనితీరు.. మన్నికను ప్రభావితం చేస్తుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్‌తో ఇథనాల్ కలపడం వల్ల ఇంధన సామర్థ్యం తగ్గుతుందని.. దాని తుప్పు పట్టే లక్షణాలు ఇంధన వ్యవస్థలను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. అంతే కాకుండా బ్లెండింగ్ కార్యక్రమం ఆహార పంటలను పండించే రైతులను కూడా పక్కదారి పట్టిస్తుంది.