
బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఏడాది చివరికి ఔన్స్‌కు 3,600 డాలర్లకు చేరుకోవచ్చని వెంచురా సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సమస్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడుల పరంగా డిమాండ్ పసిడిని నడిపించొచ్చని తెలిపింది.
కామెక్స్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర ఈ నెల 7న 3,534 డాలర్లను నమోదు చేయగా.. డిసెంబర్ నాటికి 3,600 డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. దేశీ మార్కెట్లో పరిశీలిస్తే ఎంసీఎక్స్‌లో ఈ నెల 8న అక్టోబర్ నెల గోల్డ్ కాంట్రాక్టు (10 గ్రాములు) ధర రూ.1,02,250 రికార్డు స్థాయిని నమోదు చేసింది. అమెరికాలో బలహీన వృద్ధి, యూఎస్ డాలర్ ఇండెక్స్‌పై ఒత్తిళ్లు, పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను వెంచురా సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. ఈ పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ బలంగా కొనసాగుతున్నట్టు తెలిపింది.
‘‘ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడుల డిమాండ్ 3 శాతం పెరిగి రూ.1,249 టన్నులకు చేరుకుంది. విలువ పరంగా 132 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయంగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు 16 శాతం పెరిగి జూన్ చివరికి 3,616 టన్నులుగా ఉన్నాయి’’ అని వెంచురా సెక్యూరిటీస్ వివరించింది. బంగారం నిర్వహణ ఆస్తుల విలువ ఏడాది కాలంలో 64 శాతం ఎగసి 383 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిపింది.
దేశీయంగానూ ఇదే ధోరణి..
దేశీయంగానూ బంగారంపై పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు వెంచురా సెక్యూరిటీస్ గణాంకాలను ప్రస్తావించింది. గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని బంగారం నిల్వలు జూన్ 30 చివరికి 66.68 టన్నులకు పెరిగినట్టు తెలిపింది. ఏడాది కాలంలో 42 శాతం పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని పసిడి ఆస్తుల విలువ ఇదే కాలంలో రెట్టింపై రూ.64,777 కోట్లకు చేరినట్టు పేర్కొంది.
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్ల ఖాతాలు (ఫోలియోలు) 41 శాతం పెరిగి 76.54 లక్షలకు చేరాయని.. ఏడాది కాలంలో 317 శాతం పెరిగినట్టు తెలిపింది. గోల్డ్ ఈటీఎఫ్‌లు తదితర డిజిటల్ గోల్డ్ సాధనాలపై పెట్టుబడులకు యువ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో బంగారం ఆభరణాల డిమాండ్ స్థిరంగా కొసాగుతోందని తెలిపింది. ముఖ్యంగా భౌతిక, డిజిటల్ బంగారంపై పెట్టుబడులతో కూడిన హైబ్రిడ్ విధానాలను అనుసరిస్తున్నట్టు పేర్కొంది.
దీర్ఘకాలంలో రాబడులు..
‘‘గత 20 ఏళ్లలో 14 సంవత్సరాల్లో బంగారం సానుకూల రాబడులు అందించింది. దీంతో విలువ పెరిగే సాధనంగా, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా బంగారానికి గుర్తింపు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరల ర్యాలీ దీన్ని బలపరుస్తోంది. గత మూడేళ్లలో వార్షిక రాబడి 23 శాతంగా ఉంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 సూచీ వార్షిక రాబడి 11 శాతంగానే ఉంది’’ అని వెంచురా సెక్యూరిటీస్ తన నివేదికలో వివరించింది.
సెంట్రల్ బ్యాంక్‌లు సైతం స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండడాన్ని ప్రస్తావించింది. సార్వభౌమ బంగారం బాండ్ల జారీని 2024 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ నిలిపివేయడంతో, ఈటీఎఫ్, ఇతర బంగారం డిజిటల్ సాధనాల్లోకి అధిక పెట్టుబడులు వెళ్లొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, బలహీన యూఎస్ డాలర్‌కు తోడు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో బంగారం ధరలు ఈ ఏడాది మిగిలిన కాలంలో స్థిరంగా ఎగువవైపు చలించొచ్చు’’అని వెంచురా సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ ఎన్‌ఎస్ రామస్వామి తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,400 డాలర్ల సమీపంలో ఉంది.