
దేశంలో కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చారిత్రక గరిష్టాలను తాకాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్‌తో రూపాయి బలహీనపడటం, అస్థిర అంతర్జాతీయ పరిస్థితులు.. ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులను పసిడి వైపు నెట్టివేశాయి. దాని ధరను మరింత పెంచేశాయి.
అయితే పెరిగిన బంగారం ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లకు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనడం చాలా కష్టంగా మారింది. ఫలితంగా, వినియోగదారులు ఇప్పుడు మరింత తక్కువ క్యారెట్ ఆభరణాల వైపు మళ్లుతున్నారు. 9 క్యారెట్లు, 14 క్యారెట్లు, 18 క్యారెట్ల ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.
బంగారం సెంటిమెంట్..
నిశ్చింతైన పెట్టుబడిగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగానూ ఇళ్లలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లి సీజన్ తో పాటు దసరా, దీపావళి వంటి పండుగలను బంగారం కొనడానికి అత్యంత శుభ సమయాలుగా పరిగణిస్తారు. కానీ ధరలు కొత్త గరిష్టాలను తాకడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో దుకాణదారులు సంప్రదాయం, స్థోమత రెండింటినీ సమతుల్యం చేస్తూ తక్కువ క్యారెట్ పసిడి ఆభరణాలను కొనుగోలుదారులకు అందుబాటు తీసుకొచ్చారు.
ప్రభుత్వ మద్దతు
22 క్యారెట్ల బంగారం మాదిరిగానే 9 క్యారెట్, 14 క్యారెట్ల బంగారానికి కూడా హాల్ మార్కింగ్ ను అనుమతించాలని ప్రభుత్వం తీసుకున్న చర్య కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంచింది. తక్కువ క్యారెట్ల ఆభరణాలను ఎంచుకున్నప్పుడు కూడా వినియోగదారులు నాణ్యత గురించి భరోసా పొందుతారు.
ఎవరు కొంటున్నారు..?
పాత కొనుగోలుదారులు ఇప్పటికీ దీర్ఘకాలిక విలువ కోసం 22 క్యారెట్ల ఆభరణాలను ఇష్టపడుతున్నారు. యువ వినియోగదారులు తక్కువ క్యారెట్లలో తేలికపాటి, అధునాతన ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పు రాబోయే కొన్నేళ్లలో భారతదేశంలో ఆభరణాల పోకడలను పునర్నిర్వచించే అవకాశం ఉంది. సంప్రదాయాన్ని స్థోమత, ఫ్యాషన్తో మిళితం చేస్తుంది.