
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో వినియోగదారుల కొనుగోలు వైఖరిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా భారతీయులు 22 క్యారెట్ల (ఆభరణాలు), 24 క్యారెట్ల (బార్లు, కాయిన్స్) బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపేవారు. అయితే ధరల పెరుగుదలతో ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లో కొనుగోలు నిర్ణయాలు ప్రభావితమవుతున్నాయి.
కొనుగోలు వైఖరిలో మార్పులు
18 క్యారెట్ వైపు మొగ్గు
బంగారం అధిక ధరల కారణంగా కొంతమంది వినియోగదారులు 22 క్యారెట్ల బంగారానికి బదులుగా తక్కువ క్యారెట్ (ఉదాహరణకు 18 క్యారెట్) ఆభరణాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 18K బంగారంలో స్వచ్ఛత తక్కువగా (75% బంగారం) ఉన్నప్పటికీ దాని ధర తక్కువగా ఉంటుంది. దీనితో అత్యవసరాలకు, శుభకార్యాలకు ముందుగా కేటాయించిన బడ్జెట్‌లో ఆభరణాలు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.
ఆభరణాల డిమాండ్‌లో స్వల్ప తగ్గుదల
పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ, అధిక ధరల వల్ల ఆభరణాల మొత్తం డిమాండ్‌లో స్వల్ప మందగమనం కనిపిస్తోంది. వినియోగదారులు ఆభరణాల బరువును తగ్గించుకోవడం లేదా తేలికపాటి, రోజువారీ వినియోగానికి సరిపోయే డిజైన్లను ఎంచుకోవడం చేస్తున్నారు.
బంగారంపై మోజు ఎందుకంటే..
బంగారం రికార్డు ధరలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల భౌతిక బంగారం (బార్లు, కాయిన్స్) రూపంలో పెట్టుబడులు పెరిగాయి. చాలామంది భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే సురక్షితమైన ఆస్తి (సేఫ్ హెవెన్ అసెట్)గా భావిస్తారు. కొంతమంది భౌతిక బంగారం కొనుగోలు, నిల్వ సమస్యలు, అధిక ధరలు, మేకింగ్ ఛార్జీలను నివారించడానికి గోల్డ్ ఈటీఎఫ్‌లు (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), డిజిటల్ గోల్డ్ వంటి పెట్టుబడి సాధనాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.
ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధరల పెరుగుదల కేవలం దేశీయ డిమాండ్ పైనే కాకుండా, ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావించే అంతర్జాతీయ పెట్టుబడిదారులు మార్కెట్‌లో అనిశ్చితి ఉన్నప్పుడు ఈ రంగంలో పెట్టుబడులు పెంచుతారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions)
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, రాజకీయ అస్థిరత పెట్టుబడిదారుల్లో అభద్రతా భావాన్ని పెంచుతాయి. ఈ అనిశ్చితి కారణంగా వారు స్టాక్ మార్కెట్‌ల నుంచి బంగారం వైపు మళ్లుతారు.
ద్రవ్యోల్బణం (Inflation) భయాలు
ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుంది. అయితే అలాంటి సమయంలో బంగారం విలువ అంతర్జాతీయంగా నిలకడగా ఉండటమే కాకుండా పెరుగుతుంది కూడా. అందుకే ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు పెట్టుబడిదారులు తమ కొనుగోలు శక్తిని కాపాడుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తారు.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు
ప్రపంచవ్యాప్తంగా చైనా, రష్యా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు (Central Banks) ఇటీవల తమ బంగారు నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవి మార్కెట్లో భారీ కొనుగోలుదారులుగా ఉండటం వల్ల పసిడికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఉన్నప్పుడు డాలర్ విలువ పడిపోతుంది. డాలర్ బలహీనపడటం వల్ల ఇతర కరెన్సీల వారికి బంగారం చౌకగా లభిస్తుంది. ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది.
గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం లేదా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందనే అంచనాలు పెట్టుబడిదారులను రిస్క్ లేని బంగారం వంటి ఆస్తుల వైపు మళ్లేలా చేస్తాయి.
ఇదీ చదవండి: పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం!