
దేశవ్యాప్తంగా పండుగ సీజన్‌లో రిటైలర్లు ఆకర్షణీయ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుండడంతో ఏటా వాణిజ్యం పెరుగుతోంది. ఇది ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో మరీ అధికంగా ఉంటుంది. వస్తువులపై రాయితీలు, మార్కెటింగ్, వినియోగదారుల సెంటిమెంట్ కలగలిసి ఆర్డర్ వాల్యూమ్‌లు పండుగ సీజన్‌లో అధికమవుతుంటాయి. అయితే ఇటీవలకాలంలో రిటైలర్ల వద్ద ఆర్డర్లు, ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని డెలివరీ చేసే గిగ్ కార్మికుల కొరత భారీగా ఉందని కొందరు చెబుతున్నారు.
గిగ్ వర్కర్ల సంక్షోభం
పండుగ సమయంలో భారీగా వస్తున్న ఆర్డర్లను నిర్వహించడానికి ఈ-కామర్స్, క్విక్-కామర్స్ కంపెనీలు గిగ్ కార్మికులపై అధికంగా ఆధారపడతాయి. ఈ గిగ్ వర్కర్లు గిడ్డంగులు, డార్క్ స్టోర్‌ల నుంచి వస్తువుల తుది డెలివరీ వరకు కీలక విభాగాల్లో పనిచేస్తారు. ఆన్‌లైన్ షాపింగ్ చెయిన్‌లో వీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే, ఈ ఏడాది కార్మిక కొరత మునుపటి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉందని స్టాఫింగ్ ఏజెన్సీలు తెలుపుతున్నాయి. వస్తువుల పంపిణీ కేంద్రాలుగా పనిచేసే డార్క్ స్టోర్‌లు సగం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. గిడ్డంగులు అసాధారణంగా అధిక అట్రిషన్ రేట్లను (పని మానేసే వారి సంఖ్య) ఎదుర్కొంటున్నాయి. డెలివరీ కార్గో విమానాల సంఖ్య కూడా తగ్గిపోయింది.
కార్మికుల కొరతకు కారణాలు
తాత్కాలిక సిబ్బందికి మార్కెట్‌లో డిమాండ్ సంవత్సరానికి 15-20% పెరిగింది. ముఖ్యంగా టైర్-2, 3 నగరాల్లో వీరి అవసరం అధికమైంది. దాంతో మార్కెట్‌లో అధిక రాబడి వస్తున్న విభాగాల్లోకి వీరు మారుతున్నారు. గిగ్ పాత్రల్లో ముఖ్యంగా డెలివరీలో నెలకు 35-40% అట్రిషన్ రేట్లు కనిపిస్తున్నాయి. కార్మికులు తరచుగా స్వల్ప వేతన పెంపు కోసం ఇతర ప్లాట్‌ఫామ్‌ల్లోకి మారుతున్నారు. సీజన్ తర్వాత వీరు పూర్తిగా ఈ ఫీల్డ్ వదిలేసి నిర్మాణం వంటి ఇతర పనుల కోసం వెళుతున్నారు. తర్వాతి సీజన్‌లో తిరిగి వస్తున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
గిగ్ కార్మికులకు సరైన రక్షణ వ్యవస్థలు లేకపోవడం, దీర్ఘకాలిక ఒప్పందాలు కరవవ్వడం, కనీస కెరియర్ పురోగతి వంటివి లోపించడం కూడా వీరి సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది. భారతదేశ గిగ్ ఆర్థిక వ్యవస్థలోని లోతైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడంలో కంపెనీలు, ప్రభుత్వ యాంత్రాగాలు విఫలమవుతున్నాయి.
టైర్-2, టైర్-3 మార్కెట్ల పెరుగుదల
ఇండోర్, కొచ్చి, భువనేశ్వర్, నాగ్‌పూర్ వంటి నగరాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇవి గిగ్ నియామకంలో 30-40% పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో టాలెంట్ పూల్ పరిమితంగా ఉండటం వల్ల కార్మికులను ఆకర్షించడం కంపెనీలకు సవాలుగా మారుతోంది.
తాత్కాలిక పరిష్కారాలు
తక్షణ అవసరాలను పూరించడానికి ఈ-కామర్స్ సంస్థలు డిజిటల్ ఫ్లెక్సి-హైరింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, స్టాఫింగ్ ఏజెన్సీలపై ఆధారపడుతున్నాయి. కళాశాల విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారు, పట్టణ వలసదారులతో సహా సాంప్రదాయేతర కార్మిక వర్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే, కొత్తగా క్విక్-కామర్స్ రంగంలోకి వస్తున్న కంపెనీలతో వీరికి డిమాండ్ పెరుతోంది.
ఇదీ చదవండి: జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్