
దీపావళి సమీపిస్తున్న కొద్దీ, బంగారం, వెండి ధరలు చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పండుగ డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ విధానాల వల్ల పసిడి ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు (gold price) ఇప్పటికే 10 గ్రాములకు రూ .1,18,000 దాటగా, వెండి కిలోకు రూ .1,44,000 దాటింది. దీపావళి రోజు అంటే అక్టోబర్ 21 నాటికి బంగారం రూ .1.22 లక్షలు, వెండి (silver price)రూ .1.50 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆజ్యం పోస్తున్న ప్రపంచ పోకడలు
అంతర్జాతీయంగా, బంగారం ఔన్స్ కు 3950– 4000 డాలర్లకు చేరుకుంటుందని, అలాగే వెండి ఔన్స్ కు 49– 50 డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ ధరల వేగానికి విశ్లేషకులు చెబుతున్న కారణాలు.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డోవిష్ (తక్కువ వడ్డీ రేట్లు, వృద్ధికి ప్రాధాన్యం) వైఖరి, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్, బలమైన ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు, భారతదేశ పండుగ, వివాహ సీజన్ల నుండి బలమైన డిమాండ్.
వెండికి పారిశ్రామిక డిమాండ్
సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల నుండి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ర్యాలీకి మద్దతు ఇస్తోంది. సరఫరా పరిమితులు, రూపాయి విలువ తరుగుదల మరింత ఊపందుకుంటోంది.
ఇదీ చదవండి: ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి