
Photo: Instagram/noraandkhalid
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తిమేరకు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటారు. స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులు తమ వారసులకు ఇచ్చేందుకు కష్టపడుతుంటారు. దుబాయ్‌కు చెందిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ జంట తమ పసిపాప కోసం అపురూప కానుకను సిద్ధం చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరు గడించిన బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసి.. తమ పాప భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దుబాయ్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్లు నోరా, ఖలీద్ భార్యాభర్తలు. ఐకానిక్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో తమ బిడ్డ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ సందర్భంగా తమ పాపతో కలిసి ఆనందాన్ని పంచుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 24 గంటలు గడవకముందే ఈ వీడియోకు 5 లక్షలకుపైగా వ్యూస్, 26 వేలకు పైగా లైకులు వచ్చాయి. పెద్దయ్యాక తమ కూతురికి ఆర్థిక సమస్యలు లేకుండా చేయాలన్న ముందుచూపుతో ఈ ఫ్లాట్ కొన్నామని నోరా వెల్లడించారు.
తమ జీవితంలోని ఉత్తమ పెట్టుబడులలో ఇది ఒకటని ఆమె తెలిపారు. 1% పేమెంట్ ప్లాన్‌తో ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశామని, తమ బిడ్డ పెద్దయ్యే నాటికి మొత్తం చెల్లించేస్తామని నోరా చెప్పారు. ఫ్లాట్ రెడీ అయిన తర్వాత అద్దెకు ఇస్తామని, తమ కూతురు పెద్దైన తర్వాత ఇందులో ఉండాలనుకుంటే ఉంటుందన్నారు. బుర్జ్ ఖలీఫాలో వ్యూ ఫ్లాట్ కాబట్టి దీని విలువ భవిష్యత్తులో బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో చూసిన నెటిజనులు.. నోరా, ఖలీద్ దంపతులను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి స్థిరత్వం కావాలని కలలు కంటారని ఒకరు కామెంట్ చేశారు. కాగా, నోరా, ఖలీద్ ఉమ్మడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.