ఉక్కుపాదంతో ఆందోళనను అణచేసేందుకు ఖమేనీ సర్కార్ యత్నం
మూడో వారంలోకి అడుగుపెట్టిన ఆందోళనపర్వం
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్‌లైన్లు బంద్!
టెహ్రాన్/దుబాయ్: నింగినంటుతున్న నిత్యావసర సరకులు ధరలు, పేదికకం, అవినీతి, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన ఇరాన్ ప్రజల్లోంచి పెల్లుబికిన ఉద్యమాగ్ని మరింత ఎగసిపడుతోంది. రెండు వారాలుగా ఉద్యమిస్తున్న నిరసనకారుల శనివారం సైతం తమ ఆందోళనను కొనసాగించారు. ఉత్తర టెహ్రాన్‌లోని సాదత్ అబాద్ ప్రాంతంలో వేలాది మంది స్థానికులు రోడ్ల మీద కొచ్చి భారీ నిరసన ప్రదర్శన చేశారు.
ఖమేనీ, ఆయన పాలన అంతమవ్వాలి అని నినదించారు. ఇస్ఫమాన్ నగరంలో ప్రభుత్వ కార్యాలయాలపైకి ఆందోళనకారులు గ్యాసోలిన్ బాంబులను విసిరేశారు. మహిళలు తమ హిజాబ్‌లను తొలగించి తగలబెట్టారు. నియంత పాలన నశించాలని నినదించారు. ఈ సందర్భంగా ఖమేనీ చిత్రపటానికి నిప్పంటించారు. అయితే ఆందోళనకారుల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసేందుకు, తాజా సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేందుకు అయతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ సేవలను స్తంభింపజేసింది.
అయినాసరే ఆందోళనలు మరింత విస్తృతమవుతూ ఖమేనీ సర్కార్‌కు పెనుసమస్యగా మారాయి. దీంతో ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెదీ అజాద్ రంగంలోకి దిగి ఆందోళనకారులన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘‘ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ అత్యంత కఠిన శిక్షలు విధిస్తాం. అలాంటి వాళ్లంతా దేవునికి శత్రువులే. వాళ్లకు మరణశిక్ష వేస్తాం’’అని అన్నారు. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల్లో ఇప్పటిదాకా 551 మంది చనిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
హింసిస్తే దాడులు చేస్తా: ట్రంప్
ఇరాన్‌లో నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం తన మద్దతు మరోసారి ప్రకటించారు. ‘‘శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఇరాన్ ప్రజలపై ఖమేనీ ప్రభుత్వం విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. ఆందోళనలను అణిచివేసే క్రమంలో నిరసనకారులను పొట్టనబెట్టుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే అమెరికా దళాలు రంగంలోకి దిగడం ఖాయం’’అని ట్రంప్ అన్నారు.
ఉధృతంచేయండి: యువరాజు పిలుపు
ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశాన్ని వీడిన ఇరాన్ యువరాజు రెజా పహ్లావీ శనివారం ఆందోళనకారులకు తాజాగా మరో సందేశం పంపించారు. ‘‘అందరూ జాతీయ జెండాలు, చిహా్నలతో వీధుల్లోకి వచ్చేయండి. శనివారం, ఆదివారం సైతం ఆందోళన కార్యక్రమాలు చేపట్టండి. కేవలం వీధుల్లోకి వస్తే సరిపోదు. నగరాల కూడళ్లను ఆక్రమించండి. నేను కూడా ఉద్యమకారునిగా మారతా. త్వరలోనే మాతృభూమిపై అడుగుపెడతా’’అని వీడియో సందేశంలో పహ్లావీ పేర్కొన్నారు.
నారీ నిరసన... కొత్తగా
టెహ్రాన్: ఇరాన్‌లో అయొతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలో 1979లో ఉవ్వెత్తున ఎగసిపడిన ఇస్లామిక్ చైతన్యవిప్లవంలో మహిళా హక్కులు మాడిమసైపోయినందుకు తీవ్ర నిరసనగా నేడు మహిళాలోకం కొత్త తరహాలో ఉద్యమిస్తోంది. ఖమేనీ ఫొటోకు నిప్పుపెట్టి ఆ తర్వాత తగలబడిపోతున్న అదే ఫోటోతో తమ సిగరెట్‌ను అంటించుకుంటూ అతివలు తమలోని నిరసనజ్వాలలను జనానికి తెలియజేస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన ద్రవ్యోల్బణం, అవినీతి, అసమర్థ, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన ఇరాన్ ప్రజలు గత కొద్దిరోజులుగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తుండటం తెల్సిందే. వీటికితోడు మహిళాలోకం చేస్తున్న ఈ నయా నిరసనకు ఆన్‌లైన్ వేదికలు జై కొట్టాయి.


