ముసుగు ధరించిన సాయుధుల దుశ్చర్య
టెల్ అవీవ్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఓ నర్సరీపై ముసుగు ధరించిన సాయుధులు దాడి చేశారు. ఒక పాలస్తీనా వాసిని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దెయిర్ షరాఫ్ గ్రామానికి సమీపంలోని ఓ మొక్కల నర్సరీ ఉంది. ఇందులో పాలస్తీనా వాసి అయిన 67 ఏళ్ల బధిరుడు బసిమ్ సలేహ్ యాస్సిన్ పనిచేస్తున్నాడు. సెటిలర్లయిన కొందరు వ్యక్తులు ముసుగులు, ఆయుధాలు ధరించి గురువారం ఆ నర్సరీ వద్దకు వచ్చారు.
వారిని చూసి నర్సరీలో పనిచేసే వారంతా దూరంగా వెళ్లిపోయారు. వెళ్తూ వారు బధిరుడైన బసిమ్‌కు హెచ్చరికలు చేశారు. వినిపించకపోవడంతో అతడు అక్కడే ఉండిపోయాడు. దుండగులు వచ్చీ రావడంతోనే అక్కడ కనిపించిన బసిమ్‌పై కాళ్లతో తన్నుతూ కర్రలతో కొట్టారు. అతడు నేలపై పడిపోయేదాకా కొట్టి, వదిలేసి వెళ్లిపోయారు. ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన వారు సెల్‌ఫోన్లలో బంధించి ఆన్‌లైన్‌లో ఉంచారు. బసిమ్ చేతి వేళ్లు విరిగిపోయా యని, శరీరమంతటా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు నర్సరీ నిర్వాహకులు తెలిపారు.


