
భారతదేశంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో స్కూల్ ఫీజులు భారీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ప్రీ-నర్సరీ ఫీజు లక్షల్లో ఉంటుందని ఎప్పుడైనా విన్నారా?.. అయితే ఇప్పుడు తెలుసుకోండి. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రెడ్డిట్ వినియోగదారు చేసిన పోస్టులో.. బెంగళూరులో చిన్న పిల్లల ప్రీ-నర్సరీ ఫీజు ఏకంగా రూ.1.85 లక్షలు అని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.5,000, వినియోగ వస్తువుల కోసం రూ.28,240 (దీనిని రెండు విడతలుగా విభజించారు). జూన్ నుంచి నవంబర్ కాలానికి ఫీజు రూ.91,200, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు మొత్తం రూ.60,800 అని ఉండటం ఇక్కడ గమనించవచ్చు.

బెంగళూరులో ప్రీ-స్కూల్ ఫీజు ఇంత మొత్తంలో వసూలు చేయడం సమంజసమేనా? మీ అభిప్రాయం ఏమిటి? ప్రీ-స్కూల్ ఖర్చు ఎంత? నాకు అర్థం కావడం లేదు. ఏది సరైనదో తెలుసుకోవడానికి మీరు నాకు సహాయం చేయగలరా? అని రెడ్దిట్ యూజర్ నెటిజన్లను అడిగారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు మరింత పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ కావడంతో.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని స్కూల్స్ ఫీజుల దోపిడీ చేస్తున్నాయని ఒకరు అన్నారు. నా సోదరి నా మేనకోడలికి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల చెల్లించిందని, దాంతో పోలిస్తే మీ ఫీజు తక్కువే అని మరొకరు అన్నారు. ఫీజులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా మాయా ఏబీసీడీలు, 123లు నేర్పిస్తున్నారేమో నాకు అర్థం కావడం లేదని ఇంకొకరు అన్నారు.